‘బబితా’ కాదు ‘ఖదీజా’.. స్లీపర్ సెల్ నెట్‌వర్క్ గుట్టురట్టు | Jaish Links in Rajasthan ATS Nabs Woman with Active Pakistan Network | Sakshi
Sakshi News home page

‘బబితా’ కాదు ‘ఖదీజా’.. స్లీపర్ సెల్ నెట్‌వర్క్ గుట్టురట్టు

Jun 24 2026 12:38 PM | Updated on Jun 24 2026 12:46 PM

Jaish Links in Rajasthan ATS Nabs Woman with Active Pakistan Network

జైపూర్‌: రాజస్థాన్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్‌) తాజాగా ఒక అంతర్జాతీయ ఉగ్రవాద నెట్‌వర్క్‌ను ఛేదించింది. పాకిస్తాన్‌కు చెందిన నిషేధిత ఉగ్రవాద సంస్థ ‘జైష్-ఎ-మహమ్మద్’తో సంబంధాలు కలిగి ఉన్నారనే ఆరోపణలపై బబితా ధాకడ్ అలియాస్ ఖదీజా అనే మహిళను అధికారులు జైపూర్‌లో అరెస్ట్ చేశారు. ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి అందిన పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన ఏటీఎస్, ఆమె దేశ వ్యతిరేక శక్తులతో నిరంతరం సంబంధాలు కొనసాగిస్తున్నట్లు గుర్తించింది. ప్రస్తుతం జూన్ 27 వరకు ఆమెను ఏటీఎస్ కస్టడీకి అప్పగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

పాకిస్తాన్ చేతుల్లో సోషల్ మీడియా ఖాతాలు
సవాయ్ మాధోపూర్ జిల్లాకు చెందిన బబితా ధాకడ్ జైపూర్‌లోని వాటికా ప్రాంతంలో  తండ్రితో కలిసి నివసిస్తోంది. గత కొన్నేళ్లుగా భర్తకు దూరంగా ఉంటున్న ఈమె సోషల్ మీడియా, వాట్సాప్ ఖాతాలను పాకిస్తాన్ నుంచే ఆపరేట్ చేస్తున్నట్లు విచారణలో తేలింది. తన మొబైల్ సిమ్ కార్డుకు సంబంధించిన యాక్సెస్ క్రిడెన్షియల్స్ (రహస్య సమాచారం) మొత్తాన్ని ఆమె సరిహద్దు అవతలి ఉన్న హ్యాండ్లర్లకు అప్పగించినట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. నిఘా నీడలో ఉన్న కాలంలో ఆమె జైపూర్‌లోని పలు ప్రాంతాల్లో అనుమానాస్పదంగా తిరిగినట్లు ఏటీఎస్ పేర్కొంది.

మసూద్ అజహర్ కుటుంబంతో కనెక్షన్?
పాకిస్తాన్‌లోని బహావల్‌పూర్ కేంద్రంగా పనిచేస్తున్న పలువురు ఉగ్రవాద హ్యాండ్లర్లతో ఈమె  టచ్‌లో ఉన్నట్లు డిజిటల్ ఆధారాలు లభించాయి. వారు ఆమెకు మతపరమైన బ్రెయిన్‌వాష్ (ఇండోక్ట్రినేషన్) చేసినట్లు తెలుస్తోంది. విచిత్రమేమిటంటే, ఆమెతో మాట్లాడిన వారిలో ఒకరు తాను జైష్-ఎ-మహమ్మద్ అధినేత మసూద్ అజహర్ కుటుంబ సభ్యుడినని, బహావల్‌పూర్ నుండి మాట్లాడుతున్నానని పరిచయం చేసుకున్నాడు. ఈ వ్యవహారం వెనుక భారతదేశంలో పెద్ద ఎత్తున ‘స్లీపర్ సెల్’ నెట్‌వర్క్‌ను నిర్మించేందుకు, కొత్త రిక్రూట్‌మెంట్లు చేపట్టేందుకు జైష్ ముఠా ప్రయత్నించిందని అధికారులు అనుమానిస్తున్నారు.

మత మార్పిడి.. పాక్‌కు వెళ్లేందుకు ప్లాన్
ఏటీఎస్ అధికారుల విచారణలో బబితా పలు సంచలన విషయాలను అంగీకరించింది. ఒక పాకిస్తానీ మత గురువు (మౌల్వీ) ఫోన్ ద్వారా చేసిన బోధనలకు ఆకర్షితురాలై తాను ఇస్లాం మతాన్ని స్వీకరించి, తన పేరును ‘ఖదీజా’గా మార్చుకున్నట్లు ఆమె వెల్లడించింది. అంతేకాకుండా, ఆమెను గుట్టుచప్పుడు కాకుండా పాకిస్తాన్‌కు తీసుకువెళ్లేందుకు అవతలి వైపు ఉన్న వ్యక్తులలో చర్చించినట్లు ఒప్పుకుంది. ప్రస్తుతం ఆమెపై ఉగ్రవాద నిరోధక చట్టం, భారతీయ న్యాయ సంహిత కింద కేసులు నమోదు చేసి, డిజిటల్ సాక్ష్యాలను ల్యాబ్‌కు పంపారు.

ఇది కూడా చదవండి: మొహర్రం సెలవుపై క్లారిటీ.. ఇక ‘లాంగ్ వీకెండ్’..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement