ఢిల్లీ: 2020 దేశరాజధాని అల్లర్ల కేసు విచారణ సందర్భంగా సుప్రీం కోర్టులో ఢిల్లీ పోలీసులు కీలక వ్యాఖ్యలు చేశారు. మేధావులు ఉగ్రవాదం వైపు అడుగులేస్తే.. వాళ్లు మరింత ప్రమాదకరంగా మారతారని కోర్టుకు నివేదించారు. ఈ సందర్భంగా నిందితులు ఉమర్ ఖాలిద్, షర్జీల్ ఇమామ్ బెయిల్‌ను తిరస్కరించాలని కోరారు.
సుప్రీం కోర్టులో నిందితుల బెయిల్ పిటిషన్‌పై గురువారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఢిల్లీ పోలీసుల తరఫున అడిషనల్ సోలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు వాదనలు వినిపించారు. ‘‘వాళ్లు ఉగ్రవాద చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ ఇవ్వకూడదు’’ అని విజ్ఞప్తి చేశారు. ‘‘ఈ మధ్య కాలంలో డాక్టర్లు, ఇంజినీర్లు తమ వృత్తులు వదిలి దేశ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు. మేధావులు ప్రభుత్వ సహాయంతో డాక్టర్లు, ఇంజినీర్లు అవుతారు. తర్వాత దేశ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొంటారు. అలాంటి వారు సాధారణ ఉగ్రవాదుల కంటే మరింత ప్రమాదకరులు’’ అని అన్నారాయన.
ఈ సందర్భంగా నిందితుడు షర్జీల్ ఇమామ్ 2019–2020లో సీఏఏకు వ్యతిరేకంగా ఇచ్చిన ప్రసంగాల వీడియోలు కోర్టులో ప్రదర్శించారు. ఈ అల్లర్లు సహజమైనవి కావని.. పక్కా ప్రణాళికతో జరిగిన కుట్ర అని వివరించారు. నిందితులు ఉపా చట్టం కింద అరెస్ట్ అయ్యారని.. బెయిల్ ఇవ్వడానికి కొత్త కారణాలు కనిపించడం లేవని పేర్కొన్నారు.
అల్లర్ల నేపథ్యం..
కేంద్ర ప్రభుత్వం 2019లో సిటిజన్ అమెండ్‌మెంట్ యాక్ట్(CAA)ను 2019లో ప్రవేశపెట్టింది. దీనిని వ్యతిరేకిస్తూ దేశంలో పలు చోట్ల నిరసనలు జరిగాయి. ఢిల్లీలో జాఫ్రాబాద్, షాహీన్ బాగ్ వంటి ప్రాంతాల్లో మహిళలు దీక్షలు చేపట్టారు. వీటిని ఉద్దేశిస్తూ బీజేపీ నేత కపిల్ మిశ్రా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరి 23వ తేదీన మౌజ్‌పూర్ వద్ద జరిగిన ర్యాలీలో ఆయన మాట్లాడుతూ..‘‘నిరసనకారుల్ని అణచివేయాలి. లేకుంటే చట్టాన్ని మా చేతుల్లోకి తీసుకుంటాం’’ అని పోలీసులకు అల్టిమేటం ఇచ్చారు. ఆ మరుసటి రోజు నుంచి మూడు రోజులపాటు ఉత్తర ఢిల్లీలో అల్లర్లు చెలరేగాయి.
2020 ఢిల్లీ అల్లర్లలో 53 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఎక్కువగా మైనారిటీలే ఉన్నారు. సుమారు 700 మందికి పైగా గాయపడ్డారు. అనేక ఇళ్లు, వ్యాపార సంస్థలు, మసీదులు, దేవాలయాలు ధ్వంసమయ్యాయి. దీంతో కపిల్ మిశ్రాపై కేసు నమోదు చేయాలని ఢిల్లీ కోర్టు ఆదేశించింది. అదే సమయంలో ఈ అల్లర్ల వెనుక మేధావుల ముసుగులో ఉగ్రవాదులు ఉన్నారని.. రెజీమ్ చేంజ్ ఆపరేషన్ అనే పేరుతో కేంద్ర ప్రభుత్వాన్ని అస్థిరం చేయాలనే కుట్ర చేశారని ఢిల్లీ పోలీసులు అభియోగాలు నమోదు చేశారు. విద్యార్థి సంఘాల నేతలు అయిన ఉమర్ ఖాలిద్, షర్జీల్ ఇమామ్‌లను అరెస్ట్ చేసి కేసులు నమోదు చేశారు.
ఫేక్ ఎవిడెన్స్‌పై విమర్శలు..
2020 ఢిల్లీ అల్లర్లకు సంబంధించి మొత్తం 695 క్రిమినల్ కేసులు నమోదు అయ్యాయి. ఢిల్లీ కింది కోర్టుల్లో ఇవి విచారణ జరిగాయి. 116 కేసుల్లో ఇప్పటికే తీర్పులు వెలువడ్డాయి. 97 కేసుల్లో నిందితులు నిర్దోషులుగా విడుదలయ్యారు. ఈ క్రమంలో.. పోలీసులు సమర్పించిన వాటిల్లో నకిలీ ఆధారాలు, కల్పిత సాక్ష్యాలు ఉన్నట్లు కోర్టులు గుర్తించారు. ప్రత్యేకించి.. 17 కేసుల్లో ఫేక్ ఎవిడెన్స్‌ను కోర్టులు హైలైట్ చేశాయి. దీంతో విమర్శలు వెల్లువెత్తాయి.
తాజాగా ఢిల్లీ ఎర్రకోట వద్ద కారు పేలిన ఘటనలో 12 మంది మరణించారు. ఇది ఉగ్రదాడి అని, ఆత్మాహుతి దాడికి పాల్పడింది జమ్ముకశ్మీర్ పుల్వామాకు చెందిన డాక్టర్ ఉమర్ ఉన్ నబీ విచారణలో తేలింది. అంతేకాదు.. ఉమర్‌కు పాక్ ఆధారిత ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్‌తో సంబంధాలున్నట్లు తేలింది. అయితే ఈ పేలుళ్లకు కొన్నిగంటల ముందు భారీ ఉగ్రకుట్రను ఫరీదాబాద్+జమ్ము కశ్మీర్ పోలీసులు చేధించారు. భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఆ సమయంలోనూ పలువురు వైద్యులను అరెస్ట్ చేశారు. మరోవైపు.. ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ కేసులోనూ పలువురు వైద్యులు అరెస్ట్ అయ్యారు. దీంతో విద్యావంతులు ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొనే వైట్‌కాలర్ టెర్రరిజంపై ఆందోళన వ్యక్తమవుతోంది.


