న్యూఢిల్లీ: పాకిస్తాన్ అణ్వాయుధాలను రహస్యంగా పరీక్షిస్తోందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై భారత ప్రభుత్వం స్పందించింది. దశాబ్దాలుగా కొనసాగిస్తున్న దొంగ రవాణా, ఎగుమతి నియంత్రణ నిబంధనల ఉల్లంఘనలు, రహస్య ఒప్పందాల చుట్టూ పాకిస్తాన్ రహస్య అణు కార్యకలాపాలు కేంద్రీకృతమై ఉన్నాయని వ్యాఖ్యానించింది.
పాకిస్తాన్ అణు బాంబు రూపకల్పనలో ప్రముఖంగా ఉన్న ఏక్యూ ఖాన్ చర్యలతోపాటు ఆ దేశం అణ్వ్రస్తాలను సమకూర్చుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలపై అంతర్జాతీయ సమాజాన్ని భారత్ ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ వస్తోందని తెలిపింది. దొంగచాటుగా అణు పరీక్షలు జరిపిన చరిత్ర పాకిస్తాన్ సొంతమని ఎద్దేవా చేసింది. పాకిస్తాన్, చైనాలు గుట్టుచప్పుడు కాకుండా అణ్వ్రస్తాలను పరీక్షిస్తున్నందున, తాము కూడా అలా చేస్తే తప్పెలా అవుతుందని ట్రంప్ ఇటీవల సమర్థించుకోవాలని చూడటం తెల్సిందే.


