2030 నాటికి 5 మిలియన్ మెట్రిక్ టన్నుల వార్షిక ఉత్పత్తి లక్ష్యం
జాతీయ గ్రీన్ హైడ్రోజన్ మిషన్‌పై కేంద్రం కీలక ప్రకటన
రూ.8 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వస్తాయని అంచనా
దేశంలో తొలి పోర్ట్ ఆధారిత పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభం
సాక్షి, న్యూఢిల్లీ: 2070 నాటికి ‘నెట్ జీరో’ఉద్గారాలను సాధించే దిశగా, 2047 నాటికి ‘వికసిత్ భారత్’గా నిలిచే లక్ష్యంతో భారత్ తన ఇంధన ప్రణాళికల్లో ముందడుగు వేస్తోంది. శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గిస్తూ, స్వచ్ఛమైన ఇంధన ఉత్పత్తికి పెద్దపీట వేస్తోంది. ఇందులో భాగంగా పర్యావరణ హితమైన ‘గ్రీన్ హైడ్రోజన్’రంగాన్ని ప్రోత్సహించడానికి 2023లో ప్రారంభించిన జాతీయ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ (ఎన్‌జీహెచ్‌ఎం) ద్వారా భారత్‌ను ఈ రంగంలో గ్లోబల్ హబ్‌గా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలను వేగవంతం చేసింది. 2030 నాటికి ఏటా 5 మిలియన్ మెట్రిక్ టన్నుల(ఎంఎంటీ) గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిని సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తాజాగా ప్రకటించింది.
గ్రీన్ హైడ్రోజన్ అంటే?
సౌర, పవన విద్యుత్ వంటి పునరుత్పాదక ఇంధన వనరులను ఉపయోగించి, ‘ఎలక్ట్రోలసిస్’ప్రక్రియ ద్వారా నీటిని హైడ్రోజన్, ఆక్సిజన్‌గా విడదీయడం ద్వారా ఉత్పత్తి అయ్యే హైడ్రోజన్‌ను గ్రీన్ హైడ్రోజన్ అంటారు. ప్రతి కిలో హైడ్రోజన్ ఉత్పత్తికి రెండు కిలోలకు మించకుండా కార్బన్ డై ఆక్సైడ్ ఉద్గారాలు ఉంటేనే దానిని ‘గ్రీన్ హైడ్రోజన్’గా ప్రభుత్వం అధికారికంగా గుర్తిస్తుంది.
మిషన్ ప్రధాన లక్ష్యాలు
గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ద్వారా రూ.8 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులను ఆకర్శించవచ్చని కేంద్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. దీనివల్ల శిలాజ ఇంధనాల దిగుమతులు రూ.లక్ష కోట్లకు పైగా తగ్గుతాయని, 6 లక్షలకు పైగా ఉద్యోగాలను సృష్టించగలమని భావిస్తోంది. అంతేకాకుండా 2030 నాటికి ఏటా సుమారు 50 ఎంఎంటీ గ్రీన్‌హౌస్ వాయువుల ఉద్గారాలను నివారించవచ్చని, తద్వారా పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుందని చెబుతోంది. గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కోసం 2029–2030 ఆర్థిక సంవత్సరం వరకు కేంద్రం రూ.19,744 కోట్లు కేటాయించింది. ఇందులో రూ.17,490 కోట్లను ‘స్ట్రాటజిక్ ఇంటర్వెన్షన్స్ ఫర్ గ్రీన్ హైడ్రోజన్ ట్రాన్సిషన్ (ఎస్‌ఐజీహెచ్‌టీ) కార్యక్రమానికి కేటాయించారు. దీనిద్వారా గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి కీలకమైన ఎలక్ట్రోలైజర్ల తయారీకి ఆర్థిక ప్రోత్సాహకాలను అందిస్తారు. దీంతోపాటు పైలట్ ప్రాజెక్టులకు రూ.1,466 కోట్లు, పరిశోధన–అభివృద్ధి కోసం రూ.400 కోట్లు కేటాయించారు.
రంగాలవారీగా పైలట్ ప్రాజెక్టులు
→ ఈ మిషన్‌లో భాగంగా ఇప్పటికే పలు రంగాల్లో పైలట్ ప్రాజెక్టులు ఊపందుకున్నాయి. భారత్‌లో తొలిసారిగా పోర్ట్ ఆధారిత గ్రీన్ హైడ్రోజన్ పైలట్ ప్రాజెక్టును వి.ఓ.చిదంబరనార్ పోర్ట్‌లో (తమిళనాడు) ఈ ఏడాది సెప్టెంబర్‌లో ప్రారంభించారు. దీంతోపాటు దీనదయాళ్ (గుజరాత్), పారాదీప్(ఒడిశా) పోర్టులను కూడా గ్రీన్ హైడ్రోజన్ హబ్‌లుగా అభివృద్ధి చేస్తున్నారు.
→ 10 వేర్వేరు మార్గాల్లో 37 ఫ్యూయల్ సెల్, హైడ్రోజన్ ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ వాహనాలతో (బస్సులు, ట్రక్కులు) మొబిలిటీ పైలట్ ప్రాజెక్టులను ప్రారంభించారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో (లేహ్, 3,650 మీటర్లు) గ్రీన్ హైడ్రోజన్ మొబిలిటీ ప్రాజెక్టును సైతం ఎన్‌టీపీసీ 2024 నవంబర్‌లో ప్రారంభించింది.
→ ఉక్కు తయారీలో గ్రీన్ హైడ్రోజన్ వాడకంపై ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలతో కలిసి ఐదు పైలట్ ప్రాజెక్టులను చేపట్టారు.
→ ఎరువుల తయారీకి శిలాజ ఇంధన ఆధారిత ఫీడ్‌స్టాక్‌లకు బదులుగా గ్రీన్ అమ్మోనియా వాడకాన్ని ప్రోత్సహిస్తున్నారు.
→ అంతేకాకుండా ఈ రంగంలో ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులను, నైపుణ్యాలను ఆకర్శించేందుకు భారత్ పలు దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకుంటోంది. యూ రోపియన్ యూనియన్(ఈయూ), యూ కే, జర్మనీ(ఏ2 గ్లోబల్), సింగపూర్ వంటి దేశాలతో కలిసి ప్రమాణాలు, సాంకేతికత, మార్కెట్ల అభివృద్ధికి భారత్ కృషి చేస్తోంది.


