breaking news
Global Hub
-
సేంద్రియ వ్యవసాయంలో గ్లోబల్ హబ్‌గా భారత్
సాక్షి, చెన్నై/కోయంబత్తూరు: సేంద్రియ వ్యవసాయ రంగంలో మన దేశం గ్లోబల్ హబ్‌గా మారడం ఖాయమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టంచేశారు. సేంద్రియ సాగు మన సంప్రదాయమేనని గుర్తుచేశారు. ప్రకృతి హిత సేద్యానికి భారత్ పుట్టినిట్లు అని పేర్కొన్నారు. ఈ విషయంలో ప్రపంచానికి కేంద్రంగా మారే దిశగా వేగంగా దూసుకెళ్తోందని వెల్లడించారు. నేటి యువత వ్యవసాయ రంగంపై మక్కువ చూపుతున్నారని, ఆధునిక, లాభదాయక ఉపాధి అవకాశంగా భావిస్తున్నారని తెలిపారు. వ్యవసాయంలోకి యువత ఎక్కువగా ప్రవేశిస్తే గ్రామీణ ఆర్థిక రంగానికి ఎంతగానో మేలు జరుగుతుందని ఉద్ఘాటించారు. బుధవారం తమిళనాడులోని కోయంబత్తూరులో ‘దక్షిణభారత సహజ సాగు సదస్సు–2025’ను, ప్రదర్శనను ప్రధాని మోదీ ప్రారంభించారు. సేంద్రియ వ్యవసాయ రంగంలో ఉత్తమ సేవలను అందిస్తున్న వారికి అవార్డులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా పీఎం–కిసాన్ సమ్మాన్ నిధి 21వ విడత సొమ్మును ప్రధానమంత్రి విడుదల చేశారు. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 9 కోట్ల మందికిపైగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకి రూ.18 వేల కోట్లకుపైగా నిధులు జమ చేశారు. పీఎం–కిసాన్ సమ్మాన్ నిధి కింద ఇప్పటిదాకా రూ.4 లక్షల కోట్లకుపైగా సొమ్మును రైతులకు అందజేసినట్లు వెల్లడించారు. భూమాతను కాపాడుకుందాం.. గత 11 ఏళ్లలో మన సాగు రంగం ఎన్నో మార్పులకు లోనైందని ప్రధాని మోదీ గుర్తుచేశారు. మన దేశం నుంచి వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులకు రెండు రెట్లు పెరిగాయని చెప్పారు. వ్యవసాయ ఆధునీకరణకు ప్రభుత్వం కృషి చేస్తోందని, రైతాంగానికి అన్ని విధాలుగా సహకరిస్తోందని అన్నారు. కిసాన్ క్రెడిట్ కార్డు(కేసీసీ) పథకం ద్వారా ఈ ఏడాది రైతులకు రూ.10 లక్షల కోట్ల సాయం అందినట్లు పేర్కొన్నారు. జీవ ఎరువులపై జీఎస్టీ తగ్గింపుతో అన్నదాతలకు లబ్ధి చేకూరుతోందని హర్షం వ్యక్తంచేశారు. సేంద్రీయ సాగు దిశగా రైతులను మళ్లించడానికి ఏడాది క్రితం ‘నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫామింగ్’ను ప్రారంభించామని గుర్తుచేశారు. లక్షలాది మంది రైతులు దీనితో అనుసంధానమయ్యారని చెప్పారు. దక్షిణ భారతదేశ రైతులు పంచగవ్య, జీవామృతం, బీజామృతంతో పంటలు సాగు చేస్తున్నారని ప్రశంసించారు. భూమాతను కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని పిలుపునిచ్చారు.ఒక ఉద్యమంగా మారాలి ప్రకృతి వ్యవసాయం తన హృదయానికి దగ్గరైందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. 21వ శతాబ్దంలో ఈ తరహా సేద్యాన్ని భారీగా విస్తరింపజేయాల్సిన అవసరం ఉందన్నారు. ఆహారానికి డిమాండ్ పెరుగుతుండడంతో పంటల సాగులో రసాయనాల వాడకం మితి మీరుతోందని ఆందోళన వ్యక్తంచేశారు. రసాయన ఎరువులు, పురుగు మందుల వాడకం వల్ల భూసారం దెబ్బతింటోందని, పంటల సాగు వ్యయం కూడా విపరీతంగా పెరుగుతోందని పేర్కొన్నారు. అందుకే పంటల వైవిధ్యం, ప్రకృతి వ్యవసాయంపై రైతన్నలు దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేశారు. ప్రకృతి వ్యవసాయం మనకు కొత్తేమీ కాదని, ఇది మన సంప్రదాయాల మూలాల్లోనే ఉందని వివరించారు. మన దేశ వాతావరణానికి ఇది చక్కగా సరిపోతుందన్నారు. ప్రకృతి సేద్యం ఒక ఉద్యమంగా మారాలని ఆకాంక్షించారు. -
‘గ్రీన్ హైడ్రోజన్ హబ్’గా భారత్
సాక్షి, న్యూఢిల్లీ: 2070 నాటికి ‘నెట్ జీరో’ఉద్గారాలను సాధించే దిశగా, 2047 నాటికి ‘వికసిత్ భారత్’గా నిలిచే లక్ష్యంతో భారత్ తన ఇంధన ప్రణాళికల్లో ముందడుగు వేస్తోంది. శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గిస్తూ, స్వచ్ఛమైన ఇంధన ఉత్పత్తికి పెద్దపీట వేస్తోంది. ఇందులో భాగంగా పర్యావరణ హితమైన ‘గ్రీన్ హైడ్రోజన్’రంగాన్ని ప్రోత్సహించడానికి 2023లో ప్రారంభించిన జాతీయ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ (ఎన్జీహెచ్ఎం) ద్వారా భారత్‌ను ఈ రంగంలో గ్లోబల్ హబ్‌గా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలను వేగవంతం చేసింది. 2030 నాటికి ఏటా 5 మిలియన్ మెట్రిక్ టన్నుల(ఎంఎంటీ) గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిని సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తాజాగా ప్రకటించింది. గ్రీన్ హైడ్రోజన్ అంటే? సౌర, పవన విద్యుత్ వంటి పునరుత్పాదక ఇంధన వనరులను ఉపయోగించి, ‘ఎలక్ట్రోలసిస్’ప్రక్రియ ద్వారా నీటిని హైడ్రోజన్, ఆక్సిజన్‌గా విడదీయడం ద్వారా ఉత్పత్తి అయ్యే హైడ్రోజన్‌ను గ్రీన్ హైడ్రోజన్ అంటారు. ప్రతి కిలో హైడ్రోజన్ ఉత్పత్తికి రెండు కిలోలకు మించకుండా కార్బన్ డై ఆక్సైడ్ ఉద్గారాలు ఉంటేనే దానిని ‘గ్రీన్ హైడ్రోజన్’గా ప్రభుత్వం అధికారికంగా గుర్తిస్తుంది. మిషన్ ప్రధాన లక్ష్యాలు గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ద్వారా రూ.8 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులను ఆకర్శించవచ్చని కేంద్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. దీనివల్ల శిలాజ ఇంధనాల దిగుమతులు రూ.లక్ష కోట్లకు పైగా తగ్గుతాయని, 6 లక్షలకు పైగా ఉద్యోగాలను సృష్టించగలమని భావిస్తోంది. అంతేకాకుండా 2030 నాటికి ఏటా సుమారు 50 ఎంఎంటీ గ్రీన్హౌస్ వాయువుల ఉద్గారాలను నివారించవచ్చని, తద్వారా పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుందని చెబుతోంది. గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కోసం 2029–2030 ఆర్థిక సంవత్సరం వరకు కేంద్రం రూ.19,744 కోట్లు కేటాయించింది. ఇందులో రూ.17,490 కోట్లను ‘స్ట్రాటజిక్ ఇంటర్వెన్షన్స్ ఫర్ గ్రీన్ హైడ్రోజన్ ట్రాన్సిషన్ (ఎస్ఐజీహెచ్టీ) కార్యక్రమానికి కేటాయించారు. దీనిద్వారా గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి కీలకమైన ఎలక్ట్రోలైజర్ల తయారీకి ఆర్థిక ప్రోత్సాహకాలను అందిస్తారు. దీంతోపాటు పైలట్ ప్రాజెక్టులకు రూ.1,466 కోట్లు, పరిశోధన–అభివృద్ధి కోసం రూ.400 కోట్లు కేటాయించారు.రంగాలవారీగా పైలట్ ప్రాజెక్టులు → ఈ మిషన్‌లో భాగంగా ఇప్పటికే పలు రంగాల్లో పైలట్ ప్రాజెక్టులు ఊపందుకున్నాయి. భారత్‌లో తొలిసారిగా పోర్ట్ ఆధారిత గ్రీన్ హైడ్రోజన్ పైలట్ ప్రాజెక్టును వి.ఓ.చిదంబరనార్ పోర్ట్‌లో (తమిళనాడు) ఈ ఏడాది సెప్టెంబర్‌లో ప్రారంభించారు. దీంతోపాటు దీనదయాళ్ (గుజరాత్), పారాదీప్(ఒడిశా) పోర్టులను కూడా గ్రీన్ హైడ్రోజన్ హబ్‌లుగా అభివృద్ధి చేస్తున్నారు. → 10 వేర్వేరు మార్గాల్లో 37 ఫ్యూయల్ సెల్, హైడ్రోజన్ ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ వాహనాలతో (బస్సులు, ట్రక్కులు) మొబిలిటీ పైలట్ ప్రాజెక్టులను ప్రారంభించారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో (లేహ్, 3,650 మీటర్లు) గ్రీన్ హైడ్రోజన్ మొబిలిటీ ప్రాజెక్టును సైతం ఎన్టీపీసీ 2024 నవంబర్‌లో ప్రారంభించింది. → ఉక్కు తయారీలో గ్రీన్ హైడ్రోజన్ వాడకంపై ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలతో కలిసి ఐదు పైలట్ ప్రాజెక్టులను చేపట్టారు. → ఎరువుల తయారీకి శిలాజ ఇంధన ఆధారిత ఫీడ్‌స్టాక్‌లకు బదులుగా గ్రీన్ అమ్మోనియా వాడకాన్ని ప్రోత్సహిస్తున్నారు. → అంతేకాకుండా ఈ రంగంలో ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులను, నైపుణ్యాలను ఆకర్శించేందుకు భారత్ పలు దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకుంటోంది. యూ రోపియన్ యూనియన్(ఈయూ), యూ కే, జర్మనీ(ఏ2 గ్లోబల్), సింగపూర్ వంటి దేశాలతో కలిసి ప్రమాణాలు, సాంకేతికత, మార్కెట్ల అభివృద్ధికి భారత్ కృషి చేస్తోంది. -
సేవలకు అంతర్జాతీయ కేంద్రంగా భారత్
సేవల ఎగుమతులకు భారత్ అంతర్జాతీయ కేంద్రంగా వేగంగా ఎదుగుతున్నట్టు ఎన్ఎస్ఈ ముఖ్య ఆర్థికవేత్త తీర్థాంకర్ పట్నాయక్ అన్నారు. గత మూడు దశాబ్దాల కాలంలో ఏటా 14.8 శాతం చొప్పున సేవల ఎగుమతులు పెరిగినట్టు చెప్పారు. ఇదే కాలంలో వస్తు ఎగుమతుల వార్థిక వృద్ధి 9.8 శాతంగానే ఉన్నట్టు గుర్తు చేశారు. నిర్మాణాత్మక సంస్కరణలు, యువ జనాభా అధికంగా ఉండడం వంటి అనుకూలతలను ప్రస్తావించారు.‘అంతర్జాతీయంగా సేవల ఎగుమతుల్లో భారత్ వాటా 4.3 శాతంగా ఉంది. 7వ స్థానంలో నిలిచింది. టెలికం, ఐటీ, వ్యాపార సేవల వాటా మొత్తం సేవల ఎగుమతుల్లో 75 శాతంగా ఉంది. 2024–25లో ఒక్క టెక్నాలజీ ఎగుమతులే 200 బిలియన్ డాలర్ల మేర ఉన్నాయి. అంతర్జాతీయ సామర్థ్య కేంద్రాలకు (జీసీసీలు) భారత్ అతిపెద్ద కేంద్రంగా ఉంది. 2018–19లో వీటి సంఖ్య 1,430 ఉంటే, 2023–24 నాటికి 1,700కు పెరిగాయి. 2029–30 నాటికి 2,200కు చేరుకోవచ్చన్నది అంచనా. 26 లక్షల మంది నిపుణులకు ఇవి అవకాశాలు కల్పించనున్నాయి’అని పట్నాయక్ వివరించారు. 2019 మార్చి నాటికి 40 బిలియన్ డాలర్లుగా ఉన్న జీసీసీల మార్కెట్ పరిమాణం 2030 మార్చి నాటికి 100 బిలియన్ డాలర్లకు చేరుకోవచ్చన్న డేటాను ప్రస్తావించారు.ఇదీ చదవండి: ప్రయాణికుల వాహన ఎగుమతులు అప్ -
రేపటి నుంచి వరల్డ్ ఫుడ్ ఇండియా ఈవెంట్
న్యూఢిల్లీ: నాలుగో విడత వరల్డ్ ఫుడ్ ఇండియా కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సెపె్టంబర్ 25న (రేపు) ప్రారంభించనున్నారు. దేశీయంగా ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలోకి భారీగా పెట్టుబడులను ఆకర్షించడం, కొత్త ఆవిష్కరణలకు గ్లోబల్ హబ్‌గా భారత్‌ను తీర్చిదిద్దడం లక్ష్యంగా ఈ మెగా ఈవెంట్‌ను నిర్వహిస్తున్నట్లు కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ శాఖ మంత్రి చిరాగ్ పాశ్వాన్ తెలిపారు. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో నాలుగు రోజుల పాటు జరిగే కార్యక్రమంలో రష్యన్ ఫెడరేషన్ ఉప ప్రధాని దిమిత్రీ ప్యాట్రిòÙవ్తో పాటు కేంద్ర రహదారి రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తదితరులు పాల్గోనున్నారు. న్యూజిలాండ్, సౌదీ అరేబియా భాగస్వామ్యంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో 21 దేశాలు పాల్గొంటున్నాయి. 2023లో నిర్వహించిన ఈవెంట్లో రూ. 33,000 కోట్ల విలువ చేసే అవగాహన ఒప్పందాలు (ఎంవోయూ) కుదిరాయి. 2024లో ప్రధానంగా టెక్నాలజీ బదలాయింపు ఒప్పందాలపై దృష్టి పెట్టారు. గత ఎడిషన్ల దన్నుతో ఈసారి మరింత భారీగా పెట్టుబడులు వస్తాయని అంచనా వేస్తున్నట్లు పాశ్వాన్ తెలిపారు. ప్రాసెస్డ్ ఆహారం వల్ల స్థూలకాయం, ఇతరత్రా అనారోగ్యాలు వస్తాయనే అపోహలను పారద్రోలేందుకు ఉద్దేశించిన బుక్‌లెట్‌ను ఆవిష్కరించారు. -
జీనోమ్ వ్యాలీలో జుబ్లియెంట్ కేంద్రం
సాక్షి, హైదరాబాద్: స్థానికంగా నైపుణ్యం కలిగిన మానవ వనరులకు ప్రయోజనం చేకూరేలా హైదరాబాద్ జీనోమ్ వ్యాలీలో అత్యాధునిక వసతుల కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఫార్మా, లైఫ్‌సైన్సెస్ రంగాల్లో అంతర్జాతీయంగా పేరొందిన జుబ్లియెంట్ భార్తియా గ్రూప్ ప్రకటించింది. బయో ఆసియా సదస్సులో భాగంగా ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌తో జుబ్లియెంట్ భార్తియా వ్యవస్థాపకుడు, కో–చైర్మన్ హరి ఎస్. భార్తియా శనివారం భేటీ అయ్యారు. ఫార్మా, పరిశోధన, విలక్షణ ఔషధాలు, లైఫ్‌సైన్సెస్, వ్యవసాయ ఉత్పత్తులు సహా అనేక రంగాల్లో ఉన్న తమ గ్రూప్ ఆసియాలో హైదరాబాద్‌ను అత్యాధునిక వసతుల కేంద్రం ఏర్పాటుకు ఎంపిక చేసుకుందన్నారు. ఇప్పటికే లైఫ్‌సైన్సెస్ పరిశోధన రాజధానిగా ఉన్న హైదరాబాద్‌కు జుబ్లియెంట్ రాకతో క్లినికల్ రీసెర్చ్ సంస్థలకు మరింత ఊతం లభిస్తుందని కేటీఆర్ చెప్పారు. రాష్ట్రంలో సనోఫీ ‘గ్లోబల్ మెడికల్ హబ్’ అంతర్జాతీయంగా ఆరోగ్య సంరక్షణలో పేరొందిన ‘సనోఫీ’తెలంగాణలో గ్లోబల్ మెడికల్ హబ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. బయో ఆసియా సదస్సులో భాగంగా మంత్రి కేటీఆర్‌తో భేటీ సందర్భంగా సనోఫీ గ్రూప్ ఆఫ్ సైట్స్ హెడ్ మాథ్యూ చెరియన్ ఈ మేరకు ప్రకటన చేశారు. ఆరోగ్య సంరక్షణ రంగంలో తెలంగాణను అగ్రస్థానంలో నిలిపేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు అనుగుణంగా తాము గ్లోబల్ మెడికల్ హబ్ ఏర్పాటు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం, సనోఫీ మధ్య కుదిరిన భాగస్వామ్యంతో ప్రపంచస్థాయి పెట్టుబడులు, భాగస్వామ్యాలు పెరుగుతాయని మాథ్యూ చెరియన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ‘2025– ఆ తర్వాత’అనే విజన్‌లో భాగంగా ఏర్పాటయ్యే గ్లోబల్ మెడికల్ హబ్‌లో ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన ఆవిష్కరణలు, పరిశోధన అభివృద్ధికి పెద్దపీట వేస్తామన్నారు. -
ఆభరణాల మరమ్మతుల మార్కెట్‌గా భారత్: జీజేఈపీసీ డిమాండ్
ముంబై: ఆభరణాల మరమ్మతుల (బాగు చేయడం/రీపేర్) సేవలకు ఔట్‌సోర్స్ మార్కెట్‌గా భారత్ అవతరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక విధానాన్ని తీసుకు రావాలని జెమ్స్ అండ్ జ్యుయలరీ ఎగుమతుల ప్రోత్సాహక మండలి (జీజేఈపీసీ) డిమాండ్ చేసింది. విధానపరమైన ప్రోత్సాహంతో అంతర్జాతీయ జ్యులయరీ రిపేర్ మార్కెట్లో భారత్ వాటాను 10-20 శాతానికి తీసుకెళ్లొచ్చని సూచించింది. 2026 నాటికి భారత మార్కెట్ వాటా 5.75 బిలియన్ డాలర్లకు (రూ.47,150 కోట్లు) చేరుకోవచ్చని అంచనా వేసింది. ‘‘ప్రస్తుతం ఈ మార్కెట్లో అంతర్జాతీయంగా భారత్ కేవలం 3 శాతం వాటా కలిగి ఉంది. కేవలం 196.8 మిలియన్ డాలర్ల మేర విక్రయాలు ఉన్నాయి. కానీ, ఇదే మార్కెట్లో అమెరికాకు 30 శాతం వాటా ఉంటే, చైనా 9.2 శాతం వాటా కలిగి ఉంది. చేతితో తయారు చేసే ఆభరణాల్లో భారత్‌కు సహజ సిద్ధంగా ఉన్న నైపుణ్యాల దృష్ట్యా జ్యుయలరీ రిపేర్ రంగంలోనూ భారత్ తన సత్తా చూపించగలదు. ఇందుకు సంబంధించి తగిన విధానాన్ని తీసుకొస్తే ప్రపంచ మార్కెట్లో మన వాటాను 10-20 శాతానికి తీసుకెళ్లొచ్చు. బిలియన్ డాలర్ల పెట్టుబడులతోపాటు ఎన్నో ఉపాధి అవకాశాలను ఇది తీసుకొస్తుంది’’అని జీజేఈపీసీ చైర్మన్ విపుల్‌షా తెలిపారు. మరమ్మతుల విధానాన్ని ప్రకటించినట్టయితే ప్రముఖ బ్రాండ్లు భారత్‌లో తమ సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తాయన్నారు. ప్రస్తుతం ఇవి ఎక్కువగా దుబాయి, టర్కీ, హాంగ్‌కాంగ్ తదితర ప్రాంతాల్లో ఉన్నట్టు చెప్పారు. అన్ని రకాల జ్యుయలరీని దిగుమతి చేసుకుని, మరమ్మతులు చేయాలంటే అందుకు దేశీయంగా ఆభరణాల తయారీ పరిశ్రమలో టెక్నాలజీ ఉన్నతీకరణ అవసరపడుతుందని జీజేఈపీసీ తెలిపింది. పెద్ద ఎగుమతిదారులు తమ కస్టమర్లకు సంబంధించిన మరమ్మతుల అవసరాలను తీర్చే అవకాశం లభిస్తుందని పేర్కొంది. -
అభివృద్ధి కోసం అన్ని రంగాల్లో సంస్కరణలు
మైసూర్: ఈ దశాబ్దాన్ని భారతదేశ దశాబ్దంగా మార్చడం, దేశ పురోభివృద్ధే లక్ష్యంగా అన్ని రంగాల్లో అవసరమైన సంస్కరణలకు శ్రీకారం చుట్టామని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఉన్నత విద్యకు భారత్‌ను గ్లోబల్ హబ్‌గా మార్చడానికి, మన యువతలో పోటీతత్వాన్ని పెంచడానికి అన్ని స్థాయిల్లో ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. సోమవారం మైసూర్ విశ్వవిద్యాలయం శతాబ్ది స్నాతకోత్సవంలో మోదీ వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రసంగించారు. గత 7 నెలలుగా సంస్కరణల్లో వేగం పెరగడాన్ని మీరు గమనించే ఉంటారని అన్నారు. వ్యవసాయం, అంతరిక్షం, రక్షణ, విమానయానం, కార్మిక.. ఇలా అన్ని రంగాల్లో సంస్కరణలు ఊపందుకున్నాయని, ఈ ప్రయత్నమంతా దేశ ప్రగతి కోసమేనని ఉద్ఘాటించారు. కోట్లాది మంది యువత ఆకాంక్షలను నెరవేర్చడమే లక్ష్యమని అన్నారు. మన పునాదులను పటిష్టంగా మార్చుకుంటేనే ఈ దశాబ్దం భారతదేశ దశాబ్దంగా మారుతుందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ప్రస్తుత దశాబ్దం దేశంలోని యువతకు అపారమైన అవకాశాలు కల్పించిందని గుర్తుచేశారు. ఇప్పుడు అన్ని రంగాల్లో అమలవుతున్న సంస్కరణలు గతంలో ఎప్పుడూ అమలుకు నోచుకోలేదని పేర్కొన్నారు. గతంలో ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు ఏదో ఒక రంగానికే పరిమితం అయ్యేవని, ఇతర రంగాలను పక్కన పెట్టేవారని చెప్పారు. ఇండియాలో గత ఆరేళ్లుగా బహుళ రంగాల్లో బహుళ సంస్కరణలు అమలయ్యాయని వివరించారు. ఆరోగ్య రక్షణలో కేంద్ర స్థానంలో భారత్ శాస్త్ర సాంకేతిక రంగాల్లో అధికంగా పెట్టుబడులు పెడుతూ నూతన ఆవిష్కరణలకు ప్రోత్సాహం అందించే దేశాలే భవిష్యత్తును నిర్దేశిస్తాయని మోదీ వ్యాఖ్యానించారు. ఆయన సోమవారం గ్రాండ్ చాలెంజెస్ వార్షిక సమావేశంలో ఆన్లైన్ ద్వారా ప్రసంగించారు. శాస్త్రీయ పరిశోధనా సంస్థలే భారత్‌కు అతిపెద్ద ఆస్తి అని చెప్పారు. ఆరోగ్య రక్షణ విషయంలో ఇండియా ప్రపంచంలోనే కేంద్ర స్థానంలో నిలుస్తోందని మోదీ పేర్కొన్నారు. వైద్య రంగంలో భారత్ అనుభవం, పరిశోధనల్లో నైపుణ్యాలే ఇందుకు కారణమని వివరించారు. వైద్య రంగంలో ఇతర దేశాలకు సహకారం అందిస్తామన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉపయోగిస్తున్న మొత్తం టీకాల్లో 60 శాతానికిపైగా టీకాలు భారత్‌లోనే ఉత్పత్తి అవుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. ప్రభుత్వ విధాన నిర్ణేతలు, పరిశోధకులను ఉమ్మడి వేదికపైకి తీసుకొచ్చి పరిష్కార మార్గాలు కనిపెట్టడమే చాలెంజెస్ లక్ష్యం. -
16 బిలియన్ డాలర్లకు అనలిటిక్స్ పరిశ్రమ: నాస్కామ్
హైదరాబాద్: దేశీ అనలిటిక్స్ పరిశ్రమ 2025 నాటికి 16 బిలియన్ డాలర్లకి చేరుతుందని నాస్కామ్ అంచనా వేసింది. ప్రస్తుతం ఇది 2 బిలియన్ డాలర్లుగా ఉంది. భారత్‌లో 600కు పైగా అనలిటిక్స్ సంస్థలు (వీటిలో 400 వరకు స్టార్టప్స్ ఉన్నాయి) ఉన్నాయని, దేశాన్ని అనలిటిక్స్ సొల్యూషన్స్‌కు సంబంధించి గ్లోబల్ హబ్‌గా మార్చే సత్తా వీటికి ఉందని నాస్కామ్ వైస్ ప్రెసిడెంట్ కె.ఎస్.విశ్వనాథన్ తెలిపారు. ఆయన ‘బిగ్ డేటా అండ్ అనలిటిక్స్ సమిట్ 2016’ నాల్గవ ఎడిషన్ సందర్భంగా గురువారం మీడియాతో మాట్లాడారు. అంతర్జాతీయంగా అనలిటి క్స్ సొల్యూషన్స్‌ను అందించే టాప్-10 దేశాల్లో భారత్ ఒకటన్నారు. 2025 నాటికి ఇండియా టాప్-3లోకి చేరాలనేది తమ కోరికని తెలిపారు. అనలిటిక్స్ పరిశ్రమ వృద్ధితో దేశంలో ఉపాధి కూడా పెరుగుతుందని చెప్పారు. ప్రస్తుతం 90,000ల మంది అనలిటిక్స్ ప్రొఫెషనల్స్ హెచ్ఆర్, మార్కెటింగ్, హెల్త్‌కేర్, రిటైల్ వంటి విభాగాల్లో పనిచేస్తున్నారని తెలిపారు. వృద్ధి అంచనాలను పరిశీలిస్తే.. త్వరలోనే భారత్ ప్రపంచంలోనే బిగ్ డేటా అండ్ అనలిటిక్స్ హబ్‌గా అవతరించనుందని నాస్కామ్ మాజీ చైర్మన్ బీవీఆర్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఐటీ ఇంజినీర్ల కన్నా అధిక సంపాదన.. దేశంలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ల కన్నా డేటా అనలిస్ట్‌లే ఎక్కువ సంపాదిస్తున్నారు. డిమాండ్-సప్లై మధ్య అంతరం ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణమని కోక్యూబ్స్ టెక్నాలజీస్ తన నివేదికలో తెలిపింది. ప్రారంభ స్థాయిలో సగటున డేటా అనలిస్ట్‌ల వార్షిక వేతనం రూ.7 లక్షలుగా ఉంటే.. సాఫ్ట్వేర్ ఇంజినీర్ల జీతం రూ.3.2 లక్షలుగా ఉందని పేర్కొంది.


