ఏటా 15 శాతం మేర వృద్ధి
ఆర్థికవేత్త పట్నాయక్
సేవల ఎగుమతులకు భారత్ అంతర్జాతీయ కేంద్రంగా వేగంగా ఎదుగుతున్నట్టు ఎన్‌ఎస్‌ఈ ముఖ్య ఆర్థికవేత్త తీర్థాంకర్ పట్నాయక్ అన్నారు. గత మూడు దశాబ్దాల కాలంలో ఏటా 14.8 శాతం చొప్పున సేవల ఎగుమతులు పెరిగినట్టు చెప్పారు. ఇదే కాలంలో వస్తు ఎగుమతుల వార్థిక వృద్ధి 9.8 శాతంగానే ఉన్నట్టు గుర్తు చేశారు. నిర్మాణాత్మక సంస్కరణలు, యువ జనాభా అధికంగా ఉండడం వంటి అనుకూలతలను ప్రస్తావించారు.
‘అంతర్జాతీయంగా సేవల ఎగుమతుల్లో భారత్ వాటా 4.3 శాతంగా ఉంది. 7వ స్థానంలో నిలిచింది. టెలికం, ఐటీ, వ్యాపార సేవల వాటా మొత్తం సేవల ఎగుమతుల్లో 75 శాతంగా ఉంది. 2024–25లో ఒక్క టెక్నాలజీ ఎగుమతులే 200 బిలియన్ డాలర్ల మేర ఉన్నాయి. అంతర్జాతీయ సామర్థ్య కేంద్రాలకు (జీసీసీలు) భారత్ అతిపెద్ద కేంద్రంగా ఉంది. 2018–19లో వీటి సంఖ్య 1,430 ఉంటే, 2023–24 నాటికి 1,700కు పెరిగాయి. 2029–30 నాటికి 2,200కు చేరుకోవచ్చన్నది అంచనా. 26 లక్షల మంది నిపుణులకు ఇవి అవకాశాలు కల్పించనున్నాయి’అని పట్నాయక్ వివరించారు. 2019 మార్చి నాటికి 40 బిలియన్ డాలర్లుగా ఉన్న జీసీసీల మార్కెట్ పరిమాణం 2030 మార్చి నాటికి 100 బిలియన్ డాలర్లకు చేరుకోవచ్చన్న డేటాను ప్రస్తావించారు.
ఇదీ చదవండి: ప్రయాణికుల వాహన ఎగుమతులు అప్


