రైతన్నలు ప్రకృతి సేద్యంపై దృష్టి పెట్టాలి
రసాయన ఎరువులు, పురుగు మందుల వాడకంతో పెనుముప్పు
ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన
పీఎం–కిసాన్ సమ్మాన్ నిధి 21వ విడత సొమ్ము విడుదల
దేశవ్యాప్తంగా రైతుల ఖాతాలో రూ.18 వేల కోట్లకుపైగా జమ
సాక్షి, చెన్నై/కోయంబత్తూరు: సేంద్రియ వ్యవసాయ రంగంలో మన దేశం గ్లోబల్ హబ్‌గా మారడం ఖాయమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టంచేశారు. సేంద్రియ సాగు మన సంప్రదాయమేనని గుర్తుచేశారు. ప్రకృతి హిత సేద్యానికి భారత్ పుట్టినిట్లు అని పేర్కొన్నారు. ఈ విషయంలో ప్రపంచానికి కేంద్రంగా మారే దిశగా వేగంగా దూసుకెళ్తోందని వెల్లడించారు.
నేటి యువత వ్యవసాయ రంగంపై మక్కువ చూపుతున్నారని, ఆధునిక, లాభదాయక ఉపాధి అవకాశంగా భావిస్తున్నారని తెలిపారు. వ్యవసాయంలోకి యువత ఎక్కువగా ప్రవేశిస్తే గ్రామీణ ఆర్థిక రంగానికి ఎంతగానో మేలు జరుగుతుందని ఉద్ఘాటించారు. బుధవారం తమిళనాడులోని కోయంబత్తూరులో ‘దక్షిణభారత సహజ సాగు సదస్సు–2025’ను, ప్రదర్శనను ప్రధాని మోదీ ప్రారంభించారు.
సేంద్రియ వ్యవసాయ రంగంలో ఉత్తమ సేవలను అందిస్తున్న వారికి అవార్డులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా పీఎం–కిసాన్ సమ్మాన్ నిధి 21వ విడత సొమ్మును ప్రధానమంత్రి విడుదల చేశారు. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 9 కోట్ల మందికిపైగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకి రూ.18 వేల కోట్లకుపైగా నిధులు జమ చేశారు. పీఎం–కిసాన్ సమ్మాన్ నిధి కింద ఇప్పటిదాకా రూ.4 లక్షల కోట్లకుపైగా సొమ్మును రైతులకు అందజేసినట్లు వెల్లడించారు.
భూమాతను కాపాడుకుందాం..
గత 11 ఏళ్లలో మన సాగు రంగం ఎన్నో మార్పులకు లోనైందని ప్రధాని మోదీ గుర్తుచేశారు. మన దేశం నుంచి వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులకు రెండు రెట్లు పెరిగాయని చెప్పారు. వ్యవసాయ ఆధునీకరణకు ప్రభుత్వం కృషి చేస్తోందని, రైతాంగానికి అన్ని విధాలుగా సహకరిస్తోందని అన్నారు. కిసాన్ క్రెడిట్ కార్డు(కేసీసీ) పథకం ద్వారా ఈ ఏడాది రైతులకు రూ.10 లక్షల కోట్ల సాయం అందినట్లు పేర్కొన్నారు.
జీవ ఎరువులపై జీఎస్టీ తగ్గింపుతో అన్నదాతలకు లబ్ధి చేకూరుతోందని హర్షం వ్యక్తంచేశారు. సేంద్రీయ సాగు దిశగా రైతులను మళ్లించడానికి ఏడాది క్రితం ‘నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫామింగ్’ను ప్రారంభించామని గుర్తుచేశారు. లక్షలాది మంది రైతులు దీనితో అనుసంధానమయ్యారని చెప్పారు. దక్షిణ భారతదేశ రైతులు పంచగవ్య, జీవామృతం, బీజామృతంతో పంటలు సాగు చేస్తున్నారని ప్రశంసించారు. భూమాతను కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని పిలుపునిచ్చారు.
ఒక ఉద్యమంగా మారాలి
ప్రకృతి వ్యవసాయం తన హృదయానికి దగ్గరైందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. 21వ శతాబ్దంలో ఈ తరహా సేద్యాన్ని భారీగా విస్తరింపజేయాల్సిన అవసరం ఉందన్నారు. ఆహారానికి డిమాండ్ పెరుగుతుండడంతో పంటల సాగులో రసాయనాల వాడకం మితి మీరుతోందని ఆందోళన వ్యక్తంచేశారు. రసాయన ఎరువులు, పురుగు మందుల వాడకం వల్ల భూసారం దెబ్బతింటోందని, పంటల సాగు వ్యయం కూడా విపరీతంగా పెరుగుతోందని పేర్కొన్నారు. అందుకే పంటల వైవిధ్యం, ప్రకృతి వ్యవసాయంపై రైతన్నలు దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేశారు. ప్రకృతి వ్యవసాయం మనకు కొత్తేమీ కాదని, ఇది మన సంప్రదాయాల మూలాల్లోనే ఉందని వివరించారు. మన దేశ వాతావరణానికి ఇది చక్కగా సరిపోతుందన్నారు. ప్రకృతి సేద్యం ఒక ఉద్యమంగా మారాలని ఆకాంక్షించారు.


