breaking news
Kisan Sammelan
-
సేంద్రియ వ్యవసాయంలో గ్లోబల్ హబ్‌గా భారత్
సాక్షి, చెన్నై/కోయంబత్తూరు: సేంద్రియ వ్యవసాయ రంగంలో మన దేశం గ్లోబల్ హబ్‌గా మారడం ఖాయమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టంచేశారు. సేంద్రియ సాగు మన సంప్రదాయమేనని గుర్తుచేశారు. ప్రకృతి హిత సేద్యానికి భారత్ పుట్టినిట్లు అని పేర్కొన్నారు. ఈ విషయంలో ప్రపంచానికి కేంద్రంగా మారే దిశగా వేగంగా దూసుకెళ్తోందని వెల్లడించారు. నేటి యువత వ్యవసాయ రంగంపై మక్కువ చూపుతున్నారని, ఆధునిక, లాభదాయక ఉపాధి అవకాశంగా భావిస్తున్నారని తెలిపారు. వ్యవసాయంలోకి యువత ఎక్కువగా ప్రవేశిస్తే గ్రామీణ ఆర్థిక రంగానికి ఎంతగానో మేలు జరుగుతుందని ఉద్ఘాటించారు. బుధవారం తమిళనాడులోని కోయంబత్తూరులో ‘దక్షిణభారత సహజ సాగు సదస్సు–2025’ను, ప్రదర్శనను ప్రధాని మోదీ ప్రారంభించారు. సేంద్రియ వ్యవసాయ రంగంలో ఉత్తమ సేవలను అందిస్తున్న వారికి అవార్డులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా పీఎం–కిసాన్ సమ్మాన్ నిధి 21వ విడత సొమ్మును ప్రధానమంత్రి విడుదల చేశారు. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 9 కోట్ల మందికిపైగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకి రూ.18 వేల కోట్లకుపైగా నిధులు జమ చేశారు. పీఎం–కిసాన్ సమ్మాన్ నిధి కింద ఇప్పటిదాకా రూ.4 లక్షల కోట్లకుపైగా సొమ్మును రైతులకు అందజేసినట్లు వెల్లడించారు. భూమాతను కాపాడుకుందాం.. గత 11 ఏళ్లలో మన సాగు రంగం ఎన్నో మార్పులకు లోనైందని ప్రధాని మోదీ గుర్తుచేశారు. మన దేశం నుంచి వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులకు రెండు రెట్లు పెరిగాయని చెప్పారు. వ్యవసాయ ఆధునీకరణకు ప్రభుత్వం కృషి చేస్తోందని, రైతాంగానికి అన్ని విధాలుగా సహకరిస్తోందని అన్నారు. కిసాన్ క్రెడిట్ కార్డు(కేసీసీ) పథకం ద్వారా ఈ ఏడాది రైతులకు రూ.10 లక్షల కోట్ల సాయం అందినట్లు పేర్కొన్నారు. జీవ ఎరువులపై జీఎస్టీ తగ్గింపుతో అన్నదాతలకు లబ్ధి చేకూరుతోందని హర్షం వ్యక్తంచేశారు. సేంద్రీయ సాగు దిశగా రైతులను మళ్లించడానికి ఏడాది క్రితం ‘నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫామింగ్’ను ప్రారంభించామని గుర్తుచేశారు. లక్షలాది మంది రైతులు దీనితో అనుసంధానమయ్యారని చెప్పారు. దక్షిణ భారతదేశ రైతులు పంచగవ్య, జీవామృతం, బీజామృతంతో పంటలు సాగు చేస్తున్నారని ప్రశంసించారు. భూమాతను కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని పిలుపునిచ్చారు.ఒక ఉద్యమంగా మారాలి ప్రకృతి వ్యవసాయం తన హృదయానికి దగ్గరైందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. 21వ శతాబ్దంలో ఈ తరహా సేద్యాన్ని భారీగా విస్తరింపజేయాల్సిన అవసరం ఉందన్నారు. ఆహారానికి డిమాండ్ పెరుగుతుండడంతో పంటల సాగులో రసాయనాల వాడకం మితి మీరుతోందని ఆందోళన వ్యక్తంచేశారు. రసాయన ఎరువులు, పురుగు మందుల వాడకం వల్ల భూసారం దెబ్బతింటోందని, పంటల సాగు వ్యయం కూడా విపరీతంగా పెరుగుతోందని పేర్కొన్నారు. అందుకే పంటల వైవిధ్యం, ప్రకృతి వ్యవసాయంపై రైతన్నలు దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేశారు. ప్రకృతి వ్యవసాయం మనకు కొత్తేమీ కాదని, ఇది మన సంప్రదాయాల మూలాల్లోనే ఉందని వివరించారు. మన దేశ వాతావరణానికి ఇది చక్కగా సరిపోతుందన్నారు. ప్రకృతి సేద్యం ఒక ఉద్యమంగా మారాలని ఆకాంక్షించారు. -
పసుపు రైతుల 40 ఏళ్ల కలను నెరవేర్చాం: అమిత్ షా
-
రైతు వ్యతిరేక చట్టాలు వద్దేవద్దు
న్యూఢిల్లీ: రైతు వ్యతిరేక చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని 14 ప్రతిపక్షాల నేతలు డిమాండ్ చేశారు. మూడు కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అన్నదాతలు సాగిస్తున్న పోరాటానికి సంఘీభావంగా వారు శుక్రవారం ఢిల్లీలో జంతర్‌మంతర్ వద్ద కిసాన్ సంసద్‌లో (రైతుల పార్లమెంట్) పాల్గొన్నారు. అంతకముందు ప్రతిపక్ష నేతలంతా పార్లమెంట్ హౌస్ వద్ద కలుసుకొని, పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించుకున్నారు. అనంతరం బస్సులో జంతర్‌మంతర్‌కు చేరుకున్నారు. ‘నల్ల’ వ్యవసాయ చట్టాలను ప్రభుత్వం రద్దు చేయాలని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రైతులకు అండగా నిలవాలని ప్రతిపక్షాలు నిర్ణయించుకున్నట్లు చెప్పారు. దేశంలోని రైతులందరికీ తమ మద్దతు కొనసాగుతుందని హామీ ఇచ్చారు. నల్ల సాగు చట్టాలపై కేవలం చర్చలతో కాలయాపన చేస్తే సరిపోదని, వాటిని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. పెగసస్ నిఘా అంశాన్ని పార్లమెంట్లో ప్రస్తావించడానికి ప్రభుత్వం అనుమతించడం లేదని ఆరోపించారు. దేశంలో ప్రజల ఫోన్లపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిఘా పెట్టారని రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. కిసాన్ సంసద్‌లో కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే, శివసేన పార్టీ నాయకుడు సంజయ్ రౌత్, ఆర్జేడీ నేత మనోకుమార్ ఝా, సీపీఎం నుంచి ఎలమారమ్ కరీమ్, సీపీఐ నుంచి బినోయ్ విశ్వం, ఐయూఎంఎల్ నేత మహమ్మద్ బషీర్, డీఎంకే నాయకుడు తిరుచ్చి శివ తదితరులు పాల్గొన్నారు. టీఎంసీ, ఆప్ నేతలు ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. కిసాన్ సంసద్ వద్ద ప్రతిపక్ష నేతలతో కలిసి కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ -
రైతు సమస్యల పరిష్కారానికే ‘కిసాన్ సమ్మేళన్’: కోదండరామ్
హైదరాబాద్: ప్రస్తుతం తెలంగాణలో రైతులు ఎదుర్కొంటున్న పలు సమస్యలకు పరిష్కార మార్గాలు అన్వేషించేందుకు ఏప్రిల్‌లో జరగనున్న ‘కిసాన్ సమ్మేళన్’ దోహదపడగలదని రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. మన రాష్ట్ర ఉత్పత్తిలో 13 శాతం మాత్రమే వ్యవసాయం ఆదాయం ఉందని, దానిపైనే 61 శాతం మంది ఆధారపడి బతుకు గడుపుతున్నారని వెల్లడించారు. గ్రామాల్లోకి వెళ్తే కరువు పరిస్థితుల తీవ్రత తెలుస్తోందన్నారు. నీరులేక, పెట్టుబడులు మునిగిపోయి, తినడానికి గింజలులేక రైతులు దుర్భర స్థితిని ఎదుర్కొంటున్నారన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సందర్భంలో కిసాన్ స్వరాజ్ సమ్మేళనం హైదరాబాద్‌లో నిర్వహించడం వల్ల రైతు సమస్యలకు పరిష్కారం చూపవచ్చునన్నారు. ఏప్రిల్ 1 నుంచి 3వ తేదీ వరకు ‘అలయెన్స్ ఫర్ సస్టెయినబుల్ అండ్ హోలిస్టిక్ అగ్రికల్చర్ ’(ఎఎస్హెచ్ఎ), రైతు స్వరాజ్యవేదిక సంయుక్త ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వహించనున్న 3వ అఖిల భారత ‘కిసాన్ స్వరాజ్ సమ్మేళనం’ వివరాలను మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సంబంధిత సంఘాల ప్రతినిధులు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై కార్యక్రమ రిసెప్షన్ కమిటీ సభ్యుడు కోదండరామ్ మాట్లాడారు. సమావేశంలో రైతు స్వరాజ్య వేదిక ప్రతినిధులు కిరణ్ విస్సా, కన్నెగంటి రవి, మానవహక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు ఎస్. జీవన్ కుమార్, తెలంగాణ రైతు సంఘం ప్రతినిధి ప్రసాదరావులు మాట్లాడారు.


