క్యూ2లో 4,45,884 యూనిట్లు
18 శాతం వృద్ధి నమోదు
ముందంజలో మారుతి
ప్రయాణికుల వాహన ఎగుమతులు సెప్టెంబర్ త్రైమాసికంలో (2025–26 క్యూ2) జోరందుకున్నాయి. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన గణాంకాలతో పోల్చి చూస్తే ఏకంగా 18 శాతం పెరిగి 4,45,884 యూనిట్లకు చేరాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో ఎగుమతులు 3,76,679 యూనిట్లుగా ఉండడం గమనార్హం.
ప్యాసింజర్ కార్ల జోరు
ప్యాసింజర్ కార్ల ఎగుమతులు 2,29,281 యూనిట్లుగా నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో ఎగుమతులు 2,05,091 యూనిట్లతో పోల్చి చూస్తే 12 శాతం పెరిగాయి. యుటిలిటీ వాహన ఎగుమతులు ఏకంగా 26 శాతం వృద్ధి చెంది 2,11,373 యూనిట్లకు చేరాయి. వ్యాన్‌ల ఎగుమతులు 36.5 శాతం పెరిగి 5,230 యూనిట్లుగా ఉన్నాయి.
మారుతి 40 శాతం వృద్ధి
ప్యాసింజర్ వాహన ఎగుమతుల్లో మారుతి సుజుకీ ఒక్కటే 2,05,763 యూనిట్లను ఎగుమతి చేసింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో సంస్థ ఎగుమతులు 1,47,063 యూనిట్లుగానే ఉన్నాయి. దీంతో పోల్చి చూస్తే 40 శాతం వృద్ధి నమోదైంది. హ్యాందాయ్ మోటార్ ఇండియా 99,540 యూనిట్లను ఎగుమతి చేసింది. క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 17 శాతం అధికంగా ఎగుమతి చేసింది. నిస్సాన్ మోటార్ ఇండియా 37,605 యూనిట్లను ఎగుమతి చేసింది. క్రితం ఏడాది ఇదే కాలంలో సంస్థ ఎగుమతులు 33,059 యూనిట్లుగా ఉన్నాయి. ఫోక్స్‌వ్యాగన్ ఇండియా 28,011 యూనిట్లు, టయోటా కిర్లోస్కర్ మోటార్ 18,880 యూనిట్లు, కియా ఇండియా 13,666 యూనిట్లు, హోండా కార్స్ ఇండియా 13,243 యూనిట్లు చొప్పున సెప్టెంబర్ త్రైమాసికంలో ఎగుమతి చేశాయి.
స్థిరమైన డిమాండ్
అంతర్జాతీయంగా స్థిరమైన డిమాండ్ వల్లే ఎగుమతులు బలంగా నమోదైనట్టు ఆటోమొబైల్ తయారీదారుల సంఘం (సియామ్) ప్రకటించింది. ముఖ్యంగా మధ్యప్రాచ్యం, ల్యాటిన్ అమెరికా ప్రాంతాల్లో బలమైన డిమాండ్ ఉన్నట్టు తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల కాలంలో భారత ఆటోమొబైల్ సంస్థలు 24 దేశాలకు సంబంధించి ఎగుమతుల పరంగా సానుకూల వృద్ధిని నమోదు చేయడం దీన్ని సూచిస్తున్నట్టు పేర్కొంది.
ఇదీ చదవండి: అగ్ని ప్రమాదంలో ఆస్తి నష్టం.. క్లెయిమ్ ప్రాసెస్ ఎలా?


