ఢిల్లీలో ఇండియా కూటమి ఎంపీల ఆందోళన కొనసాగింపు... | India Bloc MPs Protest Delhi | Sakshi
Sakshi News home page

ఢిల్లీలో ఇండియా కూటమి ఎంపీల ఆందోళన కొనసాగింపు...

Oct 9 2026 2:40 AM | Updated on Oct 9 2026 2:45 AM

India Bloc MPs Protest Delhi

న్యూఢిల్లీ: కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ ఙానేష్‌ కుమార్‌కు వ్యతిరేకంగా ఇండియా కూటమి ఎంపీల ఆందోళనలు నేడు కూడా కొనసాగనున్నాయి. ‘ఓట్‌ చోరీ’ ఆరోపణలు, స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (SIR) అంశంపై ప్రతిపక్షాలు తమ నిరసనలను కొనసాగిస్తున్నాయి. గత రెండు రోజులుగా ఢిల్లీలో చేపట్టిన ఆందోళనల నేపథ్యంలో.. ఈరోజు (శుక్రవారం) కూడా నిరసన కార్యక్రమాలు నిర్వహించేందుకు ఇండియా కూటమి ఎంపీలు సిద్ధమయ్యారు. ఙానేష్‌ కుమార్‌ రాజీనామా చేయాలన్న డిమాండ్‌తో ఆందోళనలను కొనసాగించనున్నట్లు ప్రతిపక్ష నేతలు చెబుతున్నారు.

ఇందులో భాగంగా శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్‌ (సంవిధాన్‌ సదన్‌)లో ఇండియా కూటమి ఎంపీలు సమావేశం కానున్నారు. దీంతో సమావేశం అనంతరం తదుపరి నిరసన కార్యక్రమంపై నిర్ణయం తీసుకోనున్నారు. పార్లమెంట్‌ నుంచి రాష్ట్రపతి భవన్‌కు ర్యాలీగా వెళ్లే అవకాశం ఉన్నట్లు కూటమి నేతలు తెలిపారు.

అయితే రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును కలిసేందుకు ఇండియా కూటమి ఇప్పటికే సమయం కోరింది. అక్టోబర్‌ 2న తొలిసారి లేఖ పంపగా, అనంతరం అక్టోబర్‌ 5న నేతల పేర్లతో మరోసారి అభ్యర్థన పంపినట్లు కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ తెలిపారు. రాష్ట్రపతి భవన్‌ నుంచి ఇంకా సమాధానం రాలేదని ఆయన చెప్పారు. 

అలాగే ఇండియా కూటమి నేతలు మీడియా సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. ఙానేష్‌ కుమార్‌కు వ్యతిరేకంగా చేపడుతున్న ఆందోళనలు, SIR అంశంపై తమ తదుపరి కార్యాచరణను నేతలు ఈ సందర్భంగా వివరించే అవకాశం ఉంది. గురువారం రాజ్‌ఘాట్‌ వద్ద ఇండియా కూటమి ఎంపీలు నిరసన చేపట్టారు. అంతకుముందు రెండు రోజులుగా జరిగిన ఆందోళనల్లో పలువురు ప్రతిపక్ష నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో శుక్రవారం జరగనున్న సెంట్రల్‌ హాల్‌ సమావేశం, అనంతరం చేపట్టే నిరసన కార్యక్రమాలపై ఉత్కంఠ నెలకొంది.

ఇదీ చదవండి: భారత్‌లో స్టార్‌లింక్.. ఐదేళ్లుగా అదే ట్విస్ట్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement