ఇక సుదృఢ ఆర్థిక బంధం | India and Japan sign defence pact as PM Modi holds talks with Takaichi | Sakshi
Sakshi News home page

ఇక సుదృఢ ఆర్థిక బంధం

Jul 3 2026 5:24 AM | Updated on Jul 3 2026 5:24 AM

India and Japan sign defence pact as PM Modi holds talks with Takaichi

భారత్, జపాన్‌ మధ్య కీలక ఒప్పందాలు  

ప్రధాని నరేంద్ర మోదీతో జపాన్‌ ప్రధానమంత్రి తకాయిచీ భేటీ

న్యూఢిల్లీ: ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకొనే దిశగా భారత్, జపాన్‌ కీలకమైన కార్యక్రమాలు, ఒప్పందాలను ప్రకటించాయి. ఆర్థిక భాగస్వామ్య చట్రం, సైనిక పరికరాలను సంయుక్తంగా అభివృద్ధి చేసేందుకు రక్షణ ఒప్పందం సహా చమురు సంక్షోభాలను ఎదుర్కోవడానికి ఇంధన సంబంధాలను పెంపొందించే చర్యలు చేపట్టాలని నిర్ణయానికి వచ్చాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ, జపాన్‌ ప్రధానమంత్రి సనే తకాయిచీ గురువారం ఢిల్లీలోని హైదరాబాద్‌ హౌస్‌లో సమావేశమయ్యారు. వాణిజ్యం, పెట్టుబడులు, ఆర్థిక భద్రత, ఇంధనం, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు, రక్షణ, ప్రజల మధ్య సంబంధాల వంటి అంశాల్లో భారత్‌–జపాన్‌ సంబంధాలపై సమగ్ర సమీక్ష జరిపారు.

ఇరుదేశాల భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు చేపట్టాల్సిన చర్యలపై విస్తృతంగా చర్చించారు. ఆర్థిక భద్రత, కృత్రిమ మేధ(ఏఐ) రంగంలో సహకారం, ఇంధన సరఫరా వ్యవస్థలో భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవాలని తీర్మానించారు. ఇండో–పసిఫిక్‌ పరిస్థితులపై అభిప్రాయాలు పంచుకున్నారు. అక్కడ చైనా సైనిక ప్రాబల్యం పెరుగుతుండడంపై చర్చించారు. నౌకా నిర్మాణం, విమానయానం, సరుకు రవాణా(లాజిస్టిక్స్‌) రంగాల్లో సహకారాన్ని సులభతరం చేయడానికి భారత్, జపాన్‌ ఒక మొబిలిటీ ఫ్రేమ్‌వర్క్‌ను ఖరారు చేశాయి. ఆర్థిక భద్రత, క్లీన్‌ ఎనర్జీ, కీలక సాంకేతికతలు, పరిశోధన–అభివృద్ధిపై ఇరుదేశాల మధ్య పలు ఒప్పందాలపై ఈ సందర్భంగా సంతకాలు జరిగాయి. భేటీ అనంతరం మోదీ, తకాయిచీ ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు.   

ఇండో–పసిఫిక్‌లో శాంతి, పురోగతికి మార్గం  
నేటి అనిశ్చిత పరిస్థితుల్లో ఆర్థిక, ఇంధన భద్రతల ప్రాముఖ్యతను భారత్, జపాన్‌ పూర్తిగా అర్థం చేసుకున్నాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని ఆర్థిక భద్రత కోసం ఒక ఉమ్మడి రోడ్‌మ్యాప్‌ రూపొందించామని తెలిపారు. దీనిద్వారా సెమీకండక్టర్లు, క్వాంటమ్‌ టెక్నాలజీ, అడ్వాన్స్‌డ్‌ మెటీరియల్స్‌ వంటి వ్యూహాత్మక రంగాల్లో సప్లై చైన్లను పటిష్టం చేయబోతున్నామని వివరించారు.

స్వేచ్ఛాయుతమైన, సుసంపన్నమైన, నియమ–ఆధారిత ఇండో–పసిఫిక్‌ ప్రాంతం తమ ఉమ్మడి ప్రాధాన్యత అని ఉద్ఘాటించారు. ఈ ప్రాంతంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య, మార్కెట్‌ ఆర్థిక వ్యవస్థలుగా ఈ రోజు అనేక కీలకమైన కార్యక్రమాలను ప్రారంభించామని వివరించారు. వీటి ద్వారా ఈ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం, పురోగతికి మార్గం సుగమం చేస్తామన్నారు. ఇంధన భద్రత రంగంలో కూడా ఇరుదేశాలు అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నాయని మోదీ పేర్కొన్నారు. 

భారత్, జపాన్‌ సంబంధాల పునాది..  
రెండు దేశాల మధ్య గత ఏడాది కాలంలో 100కు పైగా కొత్త వాణిజ్య ఒప్పందాలు కుదిరాయని, వీటి ద్వారా భారత్‌కు జపాన్‌ నుంచి 10 బిలియన్‌ డాలర్లకు పైగా పెట్టుబడులు రానున్నాయని ప్రధాని మోదీ స్పష్టంచేశారు. రాబోయే పదేళ్లలో జపాన్‌ నుంచి భారత్‌కు 10 ట్రిలియన్ల జపాన్‌ యేన్ల పెట్టుబడులను ఆకర్శించడం, భారత్‌లో జపనీస్‌ కంపెనీల సంఖ్యను రెట్టింపు చేయడమే తమ లక్ష్యమని తేలి్చచెప్పారు. 

17 వ్యూహాత్మక రంగాల్లో పెట్టుబడులు  
పెట్టుబడులు, ఆవిష్కరణల రంగంలో సహకారం ద్వారా ఆర్థిక వృద్ధిని సాధించడంపై భారత్, జపాన్‌ ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నాయని సనే తకాయిచీ వివరించారు. 17 వ్యూహాత్మక రంగాల్లో పెట్టుబడుల ద్వారా బలమైన ఆర్థిక వ్యవస్థను రూపొందించడం, జపాన్‌ సప్లై చైన్లు, సాంకేతిక సామర్థ్యాలను మెరుగుపరచడం తన ధ్యేయమని ప్రకటించారు. భవిష్యత్తులో పరస్పర సహకారం, పెట్టుబడుల ద్వారా మన దేశాలను బలోపేతం చేసుకుందామని పిలుపునిచ్చారు. భారత్, జపాన్‌ సంబంధాలకు 2027లో 75 ఏళ్లు పూర్తికాబోతున్నాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని ఇరుదేశాలు నిర్ణయానికొచ్చాయి.  

తకాయిచీ నా చిట్టి చెల్లెలు  
జపాన్‌ ప్రధాని తకాయిచీని నరేంద్ర మోదీ తన చిట్టి చెల్లెలుగా అభివర్ణించారు. ఆమె గొప్ప దార్శనిక, ప్రజాదరణ కలిగిన నాయకురాలు అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. ద్వైపాక్షిక చర్చల అనంతరం మోదీ, తకాయిచీ మీడియాతో మాట్లాడారు. భారత్‌–జపాన్‌ వార్షిక శిఖరాగ్ర సమావేశం కోసం భారత్‌కు తొలిసారిగా విచ్చేసిన తకాయిచీకి  స్వాగతం పలకడం తనకు ఎంతో సంతోషాన్నిస్తోందని వివరించారు. ఆమె  జపాన్‌లోని నారా ప్రాంతానికి చెందినవారని, ఈ ప్రాంతం భారత్, జపాన్‌ల ఉమ్మడి బౌద్ధ వారసత్వానికి అత్యంత ముఖ్యమైన కేంద్రంగా నిలుస్తోందని తెలిపారు.

మోదీ తనను చెల్లెలుగా భావిస్తూ సంబోధించడం పట్ల తకాయిచీ ఆనందం వ్యక్తంచేశారు. అన్నాచెల్లెళ్లుగా పనిచేస్తూ భారత్, జపాన్‌ భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తామన్నారు. నిర్దేశించుకున్న ఉమ్మడి లక్ష్యాలను సాధించుకోవాలని, రెండు దేశాల మధ్య వ్యూహాత్మక సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని అంగీకారానికి వచ్చినట్లు స్పష్టంచేశారు. భారత్‌లో తనకు అద్భుతమైన ఆతిథ్యం లభిస్తోందన్నారు. మోదీకి, భారత ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని వెల్లడించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement