
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలోగల ఒక న్యాయ కళాశాలలో యువతిపై జరిగిన అత్యాచారాన్ని మరచిపోకముందే, ఇక్కడి ఐఐఎం కళాశాలలో ఇటువంటి ఉదంతం చోటుచేసుకుంది. హరిదేవ్ పూర్ పోలీస్ స్టేషన్‌లో బాధితురాలు చేసిన ఫిర్యాదు ఆధారంగా నిందితుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్-కలకత్తాలో చదువుకుంటున్న ఒక విద్యార్ధినిపై బిజినెస్ స్కూల్ హాస్టల్‌లో ఒక విద్యార్థి అత్యాచారం చేశాడని పోలీసులు తెలిపారు. హరిదేవ్ పూర్ పోలీస్ స్టేషన్‌లో బాధితురాలు ఫిర్యాదు చేసిందని వారు పేర్కొన్నారు. బాధితురాలు పోలీసులకు అందించిన ఫిర్యాదులోని వివరాల ప్రకారం.. ఆమెను కౌన్సెలింగ్ కోసం బాలుర హాస్టల్‌కు పిలిచారు. ఆ తర్వాత ఆమెచేత ఏదో పానీయం తాగించాక, ఆమె అపస్మారక స్థితికి చేరుకుంది. స్పృహలోకి వచ్చిన తర్వాత తనపై అత్యాచారం జరిగిందని ఆ యువతి గ్రహించిందని పోలీసులు తెలిపారు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని నిందితుడు తనను బెదిరించాడని కూడా ఆమె ఆరోపించిందని పోలీసులు చెప్పారు. కేసు నమోదుచేసిన కొద్ది గంటలకే నిందితుడిని అరెస్ట్ చేశామని, కేసు దర్యాప్తు జరుగుతున్నదని పోలీసులు పేర్కొన్నారు.