పట్నా: నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డీఏ)కి ప్రోత్సాహాన్నిచ్చే విధంగా, చిరాగ్ పాశ్వాన్‌కి చెందిన లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తోంది. పాశ్వాన్ పార్టీ పోటీ చేసిన 28 సీట్లలో, 22 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇప్పటివరకు ఎన్‌డీఏకి బలమైన సహకార పార్టీలలో ఒకటిగా నిలిచింది.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల తాజా ట్రెండ్‌లలో అధికార ఎప్‌డీఏ 190 స్థానాల్లో ఆధిక్యంలో ఉందని ఎన్నికల సంఘం తెలిపింది. ప్రతిపక్ష ఇండియా బ్లాక్ చాలా వరకూ వెనుకబడి ఉంది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని జనతాదళ్ (యునైటెడ్) 82 సీట్లలో ఆధిక్యంతో ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరిస్తుండగా, దాని కీలక మిత్రపక్షమైన భారతీయ జనతా పార్టీ (బీజేపీ) 81 సీట్లలో ఆధిక్యంలో ఉంది. రాష్ట్రీయ లోక్ మోర్చా (ఆర్‌ఎల్‌ఎం), హిందుస్తానీ అవామ్ మోర్చా (హెచ్‌ఎఎం) సహా ఇతర ఎన్‌డిఎ భాగస్వాములు వరుసగా ఒకటి, నాలుగు సీట్లలో ఆధిక్యంలో ఉన్నాయి.
గట్టి భద్రతా ఏర్పాట్ల మధ్య శుక్రవారం బీహార్‌లోని 243 అసెంబ్లీ స్థానాలకు ఓట్ల లెక్కింపు జరుగుతోంది. రెండు దశల ఎన్నికల్లో పోలైన ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు 38 జిల్లాల్లోని 46 కేంద్రాలలో ప్రారంభమైంది. నవంబర్ 6, నవంబర్ 11 తేదీల్లో రెండు దశల్లో 243 సభ్యుల అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో 67.13 శాతం ఓటింగ్ నమోదయ్యింది.


