ఏకీకృత వ్యవస్థ అవసరముందన్న హోం మంత్రి అమిత్ షా
న్యూఢిల్లీ: దేశంలోని పోలీసు వ్యవస్థ కోసం ఏటీఎస్(అప్లికెంట్ ట్రాకింగ్ సిస్టమ్)ను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని హోం మంత్రి అమిత్ షా చెప్పారు. అదేవిధంగా, యాంటీ టెర్రర్ గ్రిడ్‌ను కూడా అందుబాటులోకి తేవడం ద్వారా ఉగ్రదాడులను ప్రతి స్థాయిలోనూ ఉమ్మడిగా వేగంగా, సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వీలవుతుందని చెప్పారు. ‘వ్యవస్థీకృత నేరాలపై 360– డిగ్రీల దాడి’అనే కొత్త పథకాన్ని త్వరలో ప్రవేశ పెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.
జీరో టెర్రర్ పాలసీకి ఇది అత్యంత కీలకంగ మారనుందని ఆయన వివరించారు. దేశ రాజధానిలో శుక్రవారం మొదలైన రెండు రోజుల యాంటీ టెర్రరిజమ్ కాన్ఫరెన్స్–2025లో మంత్రి అమిత్ షా ప్రసంగించారు. ‘బలవంతంగా డబ్బు వసూలు చేయడమనే ఏకైక లక్ష్యంతో వ్యవస్థీకృత నేరగాళ్ల ముఠాలు ఏర్పడుతాయి. వాటి నేతలు విదేశాలకు పారిపోయి, అక్కడే స్థిరపడిపోయాక.. ఇక్కడుండే నెట్‌వర్క్ ఉగ్ర గ్రూపుల ఆ«దీనంలోకి వెళ్లిపోతున్నాయి.
అటు తర్వాత, ఆ నెట్‌వర్క్ ఉగ్రవాదం వేళ్లూనుకునేందుకు దోహదపడుతోంది’అని అమిత్ షా చెప్పారు. ఈ సందర్భంగా ఆయన ఆర్గనైజ్డ్ క్రైం నెట్‌వర్క్ డేటాబేస్, వెపన్స్ డేటా బేస్ ఫర్ లాస్ట్, లూటెడ్ అండ్ రికవరీ ఆరŠమ్స్‌కు సంబంధించిన రెండు డేటాబేస్‌లను ఆయన ప్రారంభించారు. జాతీయ దర్యాప్తు విభాగం(ఎన్‌ఐఏ) రూపొందించిన ఈ డేటాబేస్‌లను దేశవ్యాప్తంగా ఉన్న భద్రతా విభాగాలు ఉపయోగించుకునేందుకు వీలుందన్నారు. వీటితోపాటు ఉగ్రవాదులు, నేరగాళ్లకు సంబంధించిన డేటాబేస్‌లను కూడా రూపొందించాలని సూచించారు.


