తిరువనంతపురం: తూర్పు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో కేరళను భారీ వర్షాలు ముంచెత్తనున్నాయి. దీంతో మూడు నుంచి నాలుగు రోజులు భారీ వర్షాలు తప్పవని భారతీయ వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది(IMD). శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం తలుపులు రేపు (నవంబర్ 16) సాయంత్రం 5 గంటలకు మండల పూజల కోసం తెరుచుకోనున్నాయి. వేలాది మంది భక్తులు పంబా, నిలక్కల్ ప్రాంతాలకు చేరుకునే అవకాశం ఉంది. వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగం భక్తులను అప్రమత్తం చేస్తోంది.
రాబోయే మూడు రోజులు నవంబర్ 16 నుంచి 18 దాకా కేరళలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఐఎండీ పేర్కొంది. ఇడుక్కి, కొట్టాయం, పత్తనంతిట్ట జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ ప్రాంతాల్లో 64.5 మిల్లీమీటర్ల నుండి 115.5 మిల్లీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తోంది.
దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. శబరిమల యాత్రకు వచ్చే భక్తులు ఈ వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
అధికారుల సూచనలు:
భక్తులు రెయిన్‌కోట్, టార్చ్‌లైట్, మెడికల్ కిట్ వంటి అవసరమైన వస్తువులు వెంట ఉంచుకోవాలి
వర్షాల కారణంగా మార్గాల్లో మట్టి జారే ప్రమాదం ఉండవచ్చు.. అప్రమత్తంగా ఉండాలి
పంబా, ఎరుగుమలై, నిలక్కల్ ప్రాంతాల్లో వాతావరణ హెచ్చరికలపై అప్రమత్తంగా ఉండాలి
అంతేకాదు.. కల్లకడల(Kallakkadal) కారణంగా(సముద్రంలో అలజడి) ఆలప్పుఝా, ఎర్నాలకుం, త్రిస్సూర్, మలప్పురం, కోజికోడ్, కన్నూర్ తీరప్రాంతాల్లో సముద్రం ముందుకు వచ్చే అవకాశం ఉందని, అలలు ఎగసిపడే నేపథ్యంలో మత్య్సకారులు, తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తోంది.
శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం రేపు (నవంబర్ 16) సాయంత్రం 5 గంటలకు మండల-మకరవిళక్క యాత్రా కాలానికిగానూ తలుపులు తెరుచుకోనుంది. ఈ పవిత్ర యాత్రా కాలం జనవరి 20 వరకు కొనసాగనుంది. అధికార యంత్రాంగం తగిన ఏర్పాట్లు చేపట్టింది. దేశంలో వరుసగా తొక్కిసలాట ఘటనలు జరుగుతున్న క్రమంలో.. భక్తుల ప్రవేశాన్ని నియంత్రిస్తున్నారు. రోజుకు 90,000 భక్తులకు రోజువారీ పరిమితి విధించారు. నిలక్కల్, పంబా ప్రాంతాల్లో తాత్కాలిక గుడిసెలు, పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశారు.


