
విలువ రూ.40 లక్షలు
ఢిల్లీలోని జైన దేవాలయంలో ఘటన
న్యూఢిల్లీ: ఈశాన్య ఢిల్లీలోని జ్యోతి నగర్ ప్రాంతంలో జైన దేవాలయం గోపురం నుండి సుమారు రూ.40 లక్షల విలువైన బంగారు పూత కలశం చోరీ అయ్యింది. ఆలయంలో అమర్చిన సీసీటీవీ కెమెరాల్లో నమోదైన చోరీకి సంబంధించిన రెండు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పోలీసులు ఆదివారం తెలిపిన వివరాలివి. జ్యోతి నగర్ ప్రాంత నివాసితులు శుక్రవారం అర్ధరాత్రి భారీ ఎత్తున కర్వా చౌత్ వేడుకల్లో నిమగ్నమై ఉన్నప్పుడు ఈ సంఘటన జరిగింది. నిందితుడు విద్యుత్తీగల ఆధారంగా ఆలయం పైకప్పు ఎక్కి, గోపురం పైకి చేరుకున్నాడు. అక్కడున్న బంగారు పూత కలశాన్ని చోరీ చేసి పారిపోయాడు.
అష్ట ధాతువులతో కలశం తయారీ
చోరీ అయిన కలశం ’అష్ట ధాతువులు’ (ఎనిమిది లోహాల మిశ్రమం)తో తయారైంది. దీని తయారీకి సుమారు 200 గ్రాముల బంగారం వినియోగించారు. కలశం విలువ సుమారు రూ.35–40 లక్షలు ఉంటుందని అంచనా. కలశం సుమారు 25 నుండి 30 కిలోగ్రాముల రాగి, బంగారు పూతతో తయారైందని పోలీసులు
తెలిపారు. చోరీపై ఆలయ కమిటీ అధ్యక్షుడు నీరజ్ జైన్ శనివారం ఉదయం ఈస్ట్ జ్యోతి నగర్ పోలీస్ స్టేషన్‌లో చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. నిందితుడిని పట్టుకోవడానికి గాలింపు బృందాలను ఏర్పాటు చేశామని, అతని కదలికలను తెలుసుకోవడానికి సాంకేతిక నిఘా ఉపయోగిస్తున్నామని పోలీసులు తెలిపారు.