breaking news
kalasham
-
కలశం దొరికింది
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ‘ఆగస్ట్ 15 పార్కు’లో సెపె్టంబర్ 3వ తేదీన జరిగిన జైన ఉత్సవం సమయంలో రూ.కోటిన్నర విలువైన బంగారు కలశం మాయం కావడం తెల్సిందే. సంచలనం సృష్టించిన ఈ ఘటనపై ముమ్మరంగా దర్యాప్తు చేపట్టిన ఢిల్లీ పోలీసులు ప్రధాన నిందితుడు భూషణ్ వర్మ సహా ముగ్గురిని అరెస్ట్ చేశారు. చోరీకి గురైన బంగారు కలశం సహా సుమారు రూ.కోటిన్నర విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. సాంకేతిక ఆధారాల సాయంతో నిందితుడు హాపూర్‌లో ఉన్నట్లు గుర్తించారు. అక్కడికి వెళ్లిన ప్రత్యేక పోలీసు బృందం భూషణ్ వర్మను, అంకిత్, గౌరవ్ అనే వారిని వీరి నుంచి బంగారు కలశంతోపాటు, 150 గ్రాముల కరిగించిన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. సివిల్ లైన్స్‌కు చెందిన సు«దీర్ జైన్ అనే భక్తుడి వద్ద రూ.కోటి విలువైన వజ్రాలు, ఇతర విలువైన రాళ్లు పొదిగిన బంగారు కలశ పాత్ర ఉంది. ఈ కలశాన్ని ఆయన ఆగస్ట్ 28వ తేదీ నుంచి ఉత్సవాలకు తీసుకు వస్తున్నారు. అప్పటి నుంచి దానిపై కన్నేసిన భూషణ్ వర్మ రోజూ పూజా ప్రాంతంలోకి సాధారణ భక్తుడి వేషధారణలో వచ్చి రెక్కీ నిర్వహిస్తున్నాడు. సెప్టెంబర్ 3వ తేదీన స్టేజీపై ఉన్న వారంతా బిజీలో ఉండగా కలశం మాయం చేశాడు. అంతకుముందు కూడా అతడు అక్కడున్న పలు విలువైన వస్తువులను ఎత్తుకెళ్లాడు. వీటి మొత్తం విలువ రూ. కోటిన్నర పైమాటే. తాజాగా, వీటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
Daslakshan Mahaparv: వజ్రాలు పొదిగిన స్వర్ణకలశం చోరీ
న్యూఢిల్లీ: ఎర్రకోట ప్రాంగణం. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే దేశ రాజధానిలోని కీలక చారిత్రక ప్రాంతం. పోలీసుల వలయంగా వినతికెక్కిన అలాంటి చోట సైతం చోరకళను ప్రదర్శించాడు ఒక దొంగ. కోటి రూపాయల విలువైన బంగారు కలశాన్ని కొట్టేసే లక్ష్యంతో రంగంలోకి దిగిన ఆ దొంగ జైన గురువు వేషధారణలో వచ్చి అలవోకగా కలశాన్ని ఎత్తుకెళ్లిపోయాడు. సెప్టెంబర్ మూడో తేదీ ఉదయం జరిగిన ఈ చోరీ అంశం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విషయం తెల్సుకున్న పోలీసులు వెంటనే ఆ చోరశిఖామణి వేటలో తలమునకలయ్యారు. వజ్రవైడ్యూరాలు, రత్నాలు, కెంపులు వంటి అత్యంత విలువైన రాళ్లు పొదిగిన ఆ కలశాన్ని భుజానికున్న బ్యాగులో పెట్టుకుని ఉడాయించిన సీసీటీవీ ఫుటేజీ వీడియో ప్రస్తుతం సామాజికమాధ్యమాల్లో వైరల్‌గా మారింది. జంకులేకుండా వచ్చి మరీ.. ఎర్రకోట ప్రాంగణంలోని 15వ నంబర్ గేట్ వద్ద సెప్టెంబర్ మూడో తేదీ ఉదయం జైనుల సంబంధ మత కార్యక్రమం ‘దస్‌లక్షణ్ మహాపర్వ్’నిర్వహించారు. ఆగస్ట్ 28వ తేదీ నుంచి మొదలై సెప్టెంబర్ 9వ తేదీదాకా జరగనున్న ఈ కార్యక్రమం కోసం సివిల్ లైన్స్ ప్రాంతానికి చెందిన సుదీర్జైన్ అనే వ్యాపారి తన సొంత పుత్తడి కలశాన్ని ప్రతిరోజూ తీసుకొచ్చి పూజ తర్వాత ఇంటికి తీసుకెళ్తున్నారు. 760 గ్రాముల బరువైన ఈ కలశానికి చుట్టూతా 150 గ్రాముల బరువైన, అత్యంత విలువైన వజ్రాలు, కెంపులు, మరకతాలు అందంగా అద్ది ఉంటాయి. ఎప్పటిలాగే ఆయన కలశాన్ని తీసుకురాగా ఉదయం 9 గంటల 26 నిమిషాలకు కొందరు ప్రముఖులు కార్యక్రమానికి వచ్చారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా సైతం వచ్చి జైన గురువుల ఆశీర్వాదాలు తీసుకున్నారు. దీంతో కలశ యజమానిసహా తదితరులు పక్కకు వెళ్లారు. అదే అదునుగా భావించి ఒక దొంగ జైన గురువు వేషధారణలో శ్వేతవర్ణ దుస్తులు ధరించి కార్యక్రమంలో చొరబడ్డాడు. ఎవరూ గమనించని సమయంలో ఆ కలశంతోపాటు మరో కొబ్బరికాయ ఆకారంలోని పాత్ర, మరో బంగారు పాత్రను దొంగ ఎత్తుకుపోయాడు. ఈ తతంగం అంతా అక్కడి గదిలోని సీసీటీవీలో రికార్డయింది. కార్యక్రమం నిర్వాహకుడు పునీత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసి గాలింపు చేపట్టారు. అయితే ఈ దొంగ గతంలో ఇదే ఎర్రకోట ప్రాంగణంలో మూడుసార్లు చోరీలు చేసి చాకచక్యంగా తప్పించుకున్నట్లు తెలుస్తోంది. దొంగను గుర్తించామని త్వరలనే అతడిని పట్టుకుంటామని ఢిల్లీ పోలీసులు శనివారం తెలిపారు. అయినప్పటికీ ఎర్రకోట ప్రాంగణంలో సరైన పోలీసు భద్రత లేదనే ఆరోపణ మరోసారి తెరమీదకొచ్చింది. ఇటీవల ఎర్రకోట సమీపంలో స్వాతంత్య్రదినోత్సవ వేడుకలకు సన్నాహకాల వేళ ఉత్తుత్తి బాంబును సైతం గుర్తించడంలో విఫలమైన కానిస్టేబుల్సహా ఏడుగురు ఢిల్లీ పోలీసులను సస్పెండ్ చేయడం తెల్సిందే. -
Meri Maati Mera Desh: దేశ రాజధానికి చేరుకున్న తెలుగునేల మట్టి కలశాలు
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని నలు మూలల నుంచి సేకరించిన మట్టి కలశాలు ఆదివారం ప్రత్యేక రైలులో ఢిల్లీకి చేరుకున్నాయి. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా నా నేల నా మట్టి కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని వందలాది గ్రామాల నుంచి సేకరించిన మట్టిని తీసుకొచ్చారు. ఈ క్రమంలో ప్రత్యేక రైలులో ఏపీ నుంచి 800 మంది, తెలంగాణ నుంచి 150 మంది వచ్చారు. సోమవారం ఇండియా గేట్ దగ్గర నిర్వహించే కార్యక్రమంలో ఉంచే కలశంలో ఈ మట్టిని పోస్తారు. తర్వాత ఆజాదీ కా మహోత్సవ్ గుర్తుగా చేపట్టే నిర్మాణాల్లో ఈ మట్టిని వినియోగించనున్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన వారికి నిజాముద్దీన్ రైల్వేస్టేషన్లో ఏపీ భవన్ అదనపు రెసిడెంట్ కమిషనర్ హిమాన్షు కౌశిక్ ఆధ్వర్యంలో సిబ్బంది సంప్రదాయ దుస్తులతో çఘన స్వాగతం పలికారు. ఏపీ ప్రభుత్వం వారందరికీ వసతి, బస సౌకర్యాలు ఏర్పాటు చేసింది. లైజన్ ఆఫీసర్ సురేశ్‌బాబు, ఓఎస్డీ రవిశంకర్, జీవీఆర్ మురళి పాల్గొన్నారు. -
కనవయ్యా.. మహానందీశా!
- ఒరిగిపోయిన గర్భాలయ గోపుర కలశం - అపచారం జరగకముందే అధికారులు మేల్కోవాలి మహానంది: ‘‘గోపుర కలశాన్ని దర్శించుకుంటే కోటిరెట్ల పుణ్యం లభిస్తుందని భావిస్తారు. ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకోలేని వారు గోపుర కలశాన్ని దర్శించుకుంటే చాలని చెబుతారు. అంతటి ప్రాధాన్యం ఉన్న గర్భాలయ గోపుర కలశం పరిరక్షణపై మహానంది పుణ్యక్షేత్రంలో నిర్లక్ష్యం రాజ్యమేలుతోంది. స్వామివారి గర్భాలయ గోపురానికి ఎంతో విశిష్టత ఉంది. చాళుక్యుల కాలంలో నిర్మించినట్లు కళింగ ఆర్కిటెక్చర్ నిర్మాణశైలిని పోలి ఉన్నట్లు చరిత్రకారులు, పురావస్తుశాఖవారు చెబుతున్నారు. అలాంటి గోపురం పైభాగంలోని కలశం ఓ వైపునకు ఒరిగి పడిపోయేందుకు సిద్ధంగా ఉంది. అపచారం జరగకముందే కొత్త కలశాన్ని ఏర్పాటు చేయాల్సిన ఆలయ యాజమాన్యం పాతదానికే కడ్డీలు కట్టి మరీ బిగించి ఉంచడం గమనార్హం. ఇటీవలే మహానంది దేవస్థానానికి వచ్చిన కమిషనర్ అనురాధ, అధికారులు త్వరలో కలశ ప్రతిష్టాపన ఉంటుందని ప్రకటించినా ముహూర్తం నిర్ణయించకపోవడం గమనార్హం. నూతన కలశం సిద్ధంగా ఉంది : రవిశంకర అవధాని, వేదపండితులు ప్రస్తుతం ఉన్న కలశం స్థానంలో నూతనంగా ప్రతిష్టించేందుకు కొత్త కలశాన్ని తీసుకువచ్చాం. కంచికామకోటి పీఠాధిపతి చేత ప్రతిష్టకు చర్యలు తీసుకుంటున్నాం. మాఘ మాసం లేదా శివరాత్రి పర్వదినాల్లో కార్యక్రమం పూర్తి చేస్తాం. -
కనుల పండువగా కలశ ప్రతిష్టాపన
– గర్భాలయ శిలా మండపానికి వాస్తు పూజ – స్వర్ణ లేపన గోపుర ప్రారంభోత్సవం మంత్రాలయం : శ్రీమఠంలో శనివారం స్వర్ణ లేపన శిఖర ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కనుల పండువగా నిర్వహించారు. శిలా మండపానికి వాస్తు పూజ కానిచ్చారు. ముందుగా పీఠాధిపతి సుభుదేంద్ర తీర్థులు స్వహస్తాలతో మంగళవాయిద్యాల మధ్య గోమాత, అశ్వ, గజరాజు పూజలు గావించారు. శ్రీమఠం మాడ వీధులు చుట్టేసుకుంటూ గర్భాలయ ద్వారాలకు విశేష పూజలు చేశారు. మూలబృందావనం చేరుకునే ద్వారం గుండా ముందుగా గో ప్రవేశం చేయించారు. అనంతరం గర్భాలయంలో వాస్తు, శాంతి హోమాల్లో పీఠాధిపతి తరించారు. అనంతరం కలశంతో శ్రీమఠం వీధుల్లో భారీ ఊరేగింపుగా బయలు దేరారు. పండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల సుస్వరాలు, భక్తుల హర్షద్వానాల మధ్య బంగారు లేపనంతో నిర్మించిన శిఖరం చేరుకుని విశేష పూజల అనంతరం కలశ ప్రతిష్టాపనకు అంకురార్పణ పలికారు. కలశ శిఖరాన కపిరాజు విజయ ధ్వజారోహణ చేశారు. వేలాదిగా భక్తులు తరలివచ్చి ప్రతిష్టాపనోత్సవాన్ని తిలకించారు. కార్యక్రమంలో ఆప్తకార్యదర్శి సుయమీంద్రాచార్, ఏఏవో మాధవశెట్టి, మేనేజర్ శ్రీనివాసరావు, జోనల్ మేనేజర్ శ్రీపతి ఆచార్, అసిస్టెంట్ మేనేజర్ ఐపీ నరసింహమూర్తి, ధార్మిక సహాయ అధికారి వ్యాసరాజాచార్, ద్వారపాలక అనంతస్వామి పాల్గొన్నారు.