
విలువ రూ. కోటిపైనే..
జైనుల మత గురువులా వచ్చి మాయం చేసిన వైనం
ఆలస్యంగా వెలుగుచూసిన చోరీ ఘటన
మారువేష మాయగాడి కోసం మొదలైన పోలీసుల వేట
న్యూఢిల్లీ: ఎర్రకోట ప్రాంగణం. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే దేశ రాజధానిలోని కీలక చారిత్రక ప్రాంతం. పోలీసుల వలయంగా వినతికెక్కిన అలాంటి చోట సైతం చోరకళను ప్రదర్శించాడు ఒక దొంగ. కోటి రూపాయల విలువైన బంగారు కలశాన్ని కొట్టేసే లక్ష్యంతో రంగంలోకి దిగిన ఆ దొంగ జైన గురువు వేషధారణలో వచ్చి అలవోకగా కలశాన్ని ఎత్తుకెళ్లిపోయాడు.
సెప్టెంబర్ మూడో తేదీ ఉదయం జరిగిన ఈ చోరీ అంశం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విషయం తెల్సుకున్న పోలీసులు వెంటనే ఆ చోరశిఖామణి వేటలో తలమునకలయ్యారు. వజ్రవైడ్యూరాలు, రత్నాలు, కెంపులు వంటి అత్యంత విలువైన రాళ్లు పొదిగిన ఆ కలశాన్ని భుజానికున్న బ్యాగులో పెట్టుకుని ఉడాయించిన సీసీటీవీ ఫుటేజీ వీడియో ప్రస్తుతం సామాజికమాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
జంకులేకుండా వచ్చి మరీ..
ఎర్రకోట ప్రాంగణంలోని 15వ నంబర్ గేట్ వద్ద సెప్టెంబర్ మూడో తేదీ ఉదయం జైనుల సంబంధ మత కార్యక్రమం ‘దస్‌లక్షణ్ మహాపర్వ్’నిర్వహించారు. ఆగస్ట్ 28వ తేదీ నుంచి మొదలై సెప్టెంబర్ 9వ తేదీదాకా జరగనున్న ఈ కార్యక్రమం కోసం సివిల్ లైన్స్ ప్రాంతానికి చెందిన సుదీర్‌జైన్ అనే వ్యాపారి తన సొంత పుత్తడి కలశాన్ని ప్రతిరోజూ తీసుకొచ్చి పూజ తర్వాత ఇంటికి తీసుకెళ్తున్నారు.
760 గ్రాముల బరువైన ఈ కలశానికి చుట్టూతా 150 గ్రాముల బరువైన, అత్యంత విలువైన వజ్రాలు, కెంపులు, మరకతాలు అందంగా అద్ది ఉంటాయి. ఎప్పటిలాగే ఆయన కలశాన్ని తీసుకురాగా ఉదయం 9 గంటల 26 నిమిషాలకు కొందరు ప్రముఖులు కార్యక్రమానికి వచ్చారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా సైతం వచ్చి జైన గురువుల ఆశీర్వాదాలు తీసుకున్నారు. దీంతో కలశ యజమానిసహా తదితరులు పక్కకు వెళ్లారు.
అదే అదునుగా భావించి ఒక దొంగ జైన గురువు వేషధారణలో శ్వేతవర్ణ దుస్తులు ధరించి కార్యక్రమంలో చొరబడ్డాడు. ఎవరూ గమనించని సమయంలో ఆ కలశంతోపాటు మరో కొబ్బరికాయ ఆకారంలోని పాత్ర, మరో బంగారు పాత్రను దొంగ ఎత్తుకుపోయాడు. ఈ తతంగం అంతా అక్కడి గదిలోని సీసీటీవీలో రికార్డయింది.
కార్యక్రమం నిర్వాహకుడు పునీత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసి గాలింపు చేపట్టారు. అయితే ఈ దొంగ గతంలో ఇదే ఎర్రకోట ప్రాంగణంలో మూడుసార్లు చోరీలు చేసి చాకచక్యంగా తప్పించుకున్నట్లు తెలుస్తోంది.
దొంగను గుర్తించామని త్వరలనే అతడిని పట్టుకుంటామని ఢిల్లీ పోలీసులు శనివారం తెలిపారు. అయినప్పటికీ ఎర్రకోట ప్రాంగణంలో సరైన పోలీసు భద్రత లేదనే ఆరోపణ మరోసారి తెరమీదకొచ్చింది. ఇటీవల ఎర్రకోట సమీపంలో స్వాతంత్య్రదినోత్సవ వేడుకలకు సన్నాహకాల వేళ ఉత్తుత్తి బాంబును సైతం గుర్తించడంలో విఫలమైన కానిస్టేబుల్‌సహా ఏడుగురు ఢిల్లీ పోలీసులను సస్పెండ్ చేయడం తెల్సిందే.