
యూపీలో ముగ్గురి అరెస్టు
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ‘ఆగస్ట్ 15 పార్కు’లో సెపె్టంబర్ 3వ తేదీన జరిగిన జైన ఉత్సవం సమయంలో రూ.కోటిన్నర విలువైన బంగారు కలశం మాయం కావడం తెల్సిందే. సంచలనం సృష్టించిన ఈ ఘటనపై ముమ్మరంగా దర్యాప్తు చేపట్టిన ఢిల్లీ పోలీసులు ప్రధాన నిందితుడు భూషణ్ వర్మ సహా ముగ్గురిని అరెస్ట్ చేశారు. చోరీకి గురైన బంగారు కలశం సహా సుమారు రూ.కోటిన్నర విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.
సాంకేతిక ఆధారాల సాయంతో నిందితుడు హాపూర్‌లో ఉన్నట్లు గుర్తించారు. అక్కడికి వెళ్లిన ప్రత్యేక పోలీసు బృందం భూషణ్ వర్మను, అంకిత్, గౌరవ్ అనే వారిని వీరి నుంచి బంగారు కలశంతోపాటు, 150 గ్రాముల కరిగించిన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. సివిల్ లైన్స్‌కు చెందిన సు«దీర్ జైన్ అనే భక్తుడి వద్ద రూ.కోటి విలువైన వజ్రాలు, ఇతర విలువైన రాళ్లు పొదిగిన బంగారు కలశ పాత్ర ఉంది.
ఈ కలశాన్ని ఆయన ఆగస్ట్ 28వ తేదీ నుంచి ఉత్సవాలకు తీసుకు వస్తున్నారు. అప్పటి నుంచి దానిపై కన్నేసిన భూషణ్ వర్మ రోజూ పూజా ప్రాంతంలోకి సాధారణ భక్తుడి వేషధారణలో వచ్చి రెక్కీ నిర్వహిస్తున్నాడు. సెప్టెంబర్ 3వ తేదీన స్టేజీపై ఉన్న వారంతా బిజీలో ఉండగా కలశం మాయం చేశాడు. అంతకుముందు కూడా అతడు అక్కడున్న పలు విలువైన వస్తువులను ఎత్తుకెళ్లాడు. వీటి మొత్తం విలువ రూ. కోటిన్నర పైమాటే. తాజాగా, వీటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.