బీజేపీ 501 కేజీల లడ్డూల ఆర్డర్
జేడీ(యూ) అభ్యర్థి ’మటన్’ పార్టీ!
ఫలితాలకు ముందే పార్టీల ఏర్పాట్లు
బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు మొదలవ్వడానికి ఇంకా రెండు రోజులు ఉండగానే పార్టీలన్నీ పండగ వాతావరణంలో మునిగిపోయాయి! ఫలితం అధికారికంగా
రాకముందే, గెలుపు సంబరాల కోసం బీజేపీ ఏకంగా 501 కేజీల లడ్డూలు ఆర్డర్ చేసిందట. ఇదెక్కడి ఓవర్ కాని్ఫడెన్స్ అనుకుంటున్నారా?
ఖుషీఖుషీగా కమలదళం
ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఎన్డీఏకే పట్టం కట్టడంతో, కమలదళం నాయకులకు ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ‘కౌంటింగ్ రోజు మాకు హోలీ, దసరా, దీపావళి, ఈద్.. అన్ని పండగలూ ఒకేసారి వచ్చేస్తాయి!’.. అంటూ బీజేపీ కార్యకర్త కృష్ణ కుమార్ కల్లూ తెగ సంబరపడుతున్నారు. ఈ భారీ లడ్డూల ఆర్డర్ రావడం నిజమేనని పట్నాలోని మిఠాయి కొట్టు యజమాని కూడా ధ్రువీకరించారు. ఏకంగా 501 కేజీల లడ్డూలను నవంబర్ 14 ఉదయం డెలివరీ చేయాల్సి ఉందట. అంటే.. బీజేపీ కార్యాలయాలు మిఠాయి దుకాణలను తలపించబోతున్నాయన్నమాట!
మర్డర్ కేసు అభ్యర్థి ’మాంసం’ విందు!
ఇదొక్కటే కాదు.. ఈసారి గెలుపుపై ఆశలు పెట్టుకున్న మరో కీలక అభ్యర్థి సంబరం ఇంకాస్త ’గట్టిగా’ ఉంది. జేడీ(యూ)కి చెందిన మోకామా అభ్యర్థి అనంత్ సింగ్, ఒక హత్య కేసులో జైలులో ఉన్నప్పటికీ, తన విజయాన్ని ఘనంగా జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు. అనంత్ సింగ్‌కు ఇప్పటికే ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రికార్డు ఉంది. అందుకే, ఆయన ఈసారి తన మద్దతుదారులు, ఓటర్ల కోసం నవంబర్ 14న పటా్నలో భారీ విందు ఏర్పాటు చేశారు. అంతా ఊహించినట్టే జరిగితే, ఆ రోజు అక్కడ పెద్ద మటన్ బిర్యానీ పార్టీ జరిగే అవకాశం ఉంది!
‘లడ్డూలు వెర్సెస్ మటన్’ వార్
మొత్తానికి, ఓట్ల లెక్కింపు ముందే బిహార్‌లో ’లడ్డూలు వెర్సెస్ మటన్’ వార్ మొదలైందన్నమాట! ఈ అతి విశ్వాసాన్ని చూసి ఆర్జేడీ యువనేత తేజస్వీ యాదవ్ నవ్వుకుంటున్నారు. ఎగ్జిట్ పోల్స్ అన్నీ బీజేపీ అత్యున్నత నాయకత్వం కనుసన్నల్లోనే వస్తున్నాయని కొట్టిపారేస్తున్నారు! నవంబర్ 14న కౌంటింగ్ తర్వాత ఈ 501 కేజీల లడ్డూలు అందరి నోరు తీపి చేస్తాయో లేక ఈ భారీ ’స్వీట్’ ఆర్డర్ చూసి మిగిలిన పార్టీలు కన్నీరు పెట్టుకుంటాయో చూడాలి.
– సాక్షి, నేషనల్ డెస్క్


