సాక్షి, ఢిల్లీ: భారీ పేలుడుతో దేశరాజధాని ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఎర్రకోట మెట్రో స్టేషన్ వద్ద పార్కింగ్ చేసిన కారులో సోమవారం సాయంత్రం పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 8మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. పేలుడు ధాటికి ఓ డెలివరీ బాయ్ మృతదేహం ఛిద్రమై గుర్తు పట్టని స్థితిలో పడి ఉంది. పలువురికి గాయాలయ్యాయి.
ఐబీ చీఫ్,ఢిల్లీ సీపీకి అమిత్‌షా ఫోన్
పేలుడు ఘటన జరిగిన వెంటనే కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఢిల్లీ పోలీస్ కమిషనర్‌తో పాటు ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్‌తో సంప్రదింపులు జరుపుతున్నారు.
కదులుతున్న కారులో పేలుడు
ఢిల్లీలో పేలుళ్లలపై ఢిల్లీ పోలీస్ కమిషనర్ ఐపీఎస్ సతీష్ గోల్చా మీడియాతో మాట్లాడారు. ఎర్రకోట వద్ద ‘రెడ్‌సిగ్నల్ దగ్గర ఆగిన కారులు పేలుడు సంభవించింది. నెమ్మదిగా కదులుతున్న కారులు పేలుడు సంభవించింది. ఆ కారులో ప్రయాణికులున్నారు. సాయంత్రం 6.52గంటలకు పేలుడు జరిగింది. పేలుడు ఘటనపై దర్యాప్తు చేస్తున్నాం. పేలుడుపై అనుమానితుణ్ని అదుపులోకి తీసుకున్నాం. ప్రస్తుతం అతణ్ని విచారిస్తున్నాం’ అని తెలిపారు.
ప్రధాని మోదీ ఆరా
ఢిల్లీ పేలుడుపై ప్రధాని మోదీ ఆరా తీశారు. అమిత్‌షాతో ప్రధాని మోదీ మాట్లాడారు. ఘటన గురించి అడిగి వివరాలు తీసుకున్నారు.

ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ నెంబర్ 1 వద్ద నిలిపి ఉంచిన కారు ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలింది. ఆ తర్వాత మంటలు పక్కన్న వాహనాలకు అంటుకున్నాయి. ఏడు ఫైరింజన్లు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నంలో ఉన్నాయి. గాయపడిన వాళ్లను లోక్‌నాయక్ జయ్ ప్రకాష్ ఆస్పత్రి (LNJP) ఆస్పత్రికి తరలించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

పేలుడు ధాటికి ఎనిమిది వాహనాలు ధ్వంసం అయినట్లు సమాచారం. ఢిల్లీ పోలీసులు, క్లూస్ టీం ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టాయి. మరోవైపు రంగంలోకి దిగిన బాంబ్ స్క్వాడ్ ఆ ప్రాంతంలో క్షుణ్ణంగా తనిఖీలు జరుపుతోంది. పేలుడుతో ఆ ప్రాంతమంతా బీతావహ వాతావరణం నెలకొంది.

సాయంత్రం 6.55గం. ప్రాంతంలో పేలుడు సంభవించినట్లు ఫైర్ డిపార్ట్‌మెంట్‌కు ఫోన్ కాల్ వచ్చింది. పేలుడుకు గల కారణాలు తెలియాల్సి ఉంది. అయితే ఘటన నేపథ్యంలో కేంద్రం ఢిల్లీతో పాటు దేశంలో పలు ప్రధాన నగరాల్లో హైఅలర్ట్ ప్రకటించింది. రాజధాని, చుట్టుపక్కల అంతటా భద్రత కట్టుదిట్టం చేశారు. జాతీయ దర్యాప్తు సంస్థ(NIA), నేషనల్ సెక్యూరిటీ గార్డ్(NSG) బృందాలు చేరుకున్నాయి. పోలీసులు సమీపంలో సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. అయితే సోమవారం ఎర్రకోట సందర్శనకు సెలవు దినం కావడంతో భారీ ఎత్తున ప్రాణనష్టం తప్పింది.
BREAKING: Explosion near Red Fort area in Old Delhi. Explosion near metro station.
Blasts on a day when there has been a major crackdown on terror modules plotting a strike on Delhi.
Details awaited. pic.twitter.com/tELxBP9bBh— Rahul Shivshankar (@RShivshankar) November 10, 2025


