భారత్‌ బాస్‌ అంబానీయేనా? | Elon Musk asks is Ambani the real boss of India | Sakshi
Sakshi News home page

భారత్‌ బాస్‌ అంబానీయేనా?

Oct 9 2026 5:15 AM | Updated on Oct 9 2026 5:15 AM

Elon Musk asks is Ambani the real boss of India

అన్ని చట్టాలను పాటిస్తున్నా లైసెన్సు 

ఎందుకు ఇవ్వడం లేదు? 

స్టార్‌లింక్‌ చీఫ్‌ ఎలాన్‌ మస్క్‌ ప్రశ్న

న్యూఢిల్లీ: భారత్‌లో స్టార్‌లింక్‌ ఇంటర్నెట్‌ సర్వీసులకు సంబంధించి ఆ సంస్థ చీఫ్‌ ఎలాన్‌ మస్క్‌, కేంద్ర ప్రభుత్వం మధ్య వివాదం మరింతగా ముదురుతోంది. భారత్‌లో కొన్ని వ్యాపార శక్తులు తమను రానివ్వకుండా అడ్డుకుంటున్నాయంటూ బుధవారం నాడు పరోక్షంగా ఆరోపణలు చేసిన మస్క్‌ ..తాజాగా గురువారం నాడు నేరుగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీని టార్గెట్‌ చేశారు. 

భారత్‌కి అసలైన బాస్‌ అంబానీయేనా అని ప్రశ్నిస్తూ ఎటాక్‌కి దిగారు. ‘స్టార్‌లింక్‌కి 165 పైగా దేశాల్లో లైసెన్సులు ఉన్నాయి. భారత ప్రభుత్వం నిర్దేశించిన ప్రతి చట్టాన్ని, ప్రతి నిబంధనను గత ఐదేళ్లుగా పాటిస్తూనే వస్తున్నాం. అయినా సరే ఇప్పటివరకు లైసెన్సు ఎందుకివ్వలేదు? భారత్‌కి అసలైన బాస్‌ అంబానీయేనా?’అంటూ సోషల్‌ మీడియా సైట్‌ ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేశారు. తమ గుత్తాధిపత్యానికి ముప్పు కలుగుతుందనే భయంతో కొన్ని వ్యాపార శక్తులు భారత్‌లో స్టార్‌లింక్‌ సర్వీసులను అడ్డుకుంటున్నాయంటూ మస్క్‌ చేసిన ఆరోపణలను కేంద్రం ఖండించిన నేపథ్యంలో ఆయన మళ్లీ దాడికి దిగడం ప్రాధాన్యం సంతరించుకుంది.  

ఆరోపణలు ఖండించిన కేంద్రం.. 
శాటిలైట్‌ కమ్యూనికేషన్స్‌ కంపెనీలన్నింటికీ ఒకే తరహా రెగ్యులేటరీ, భద్రత నిబంధనలు ఉంటాయని, వాటిని అన్ని సంస్థలు పాటించి తీరాల్సిందేనని టెలికం శాఖ స్పష్టం చేసింది. శాట్‌కామ్‌ కంపెనీలన్నిటికీ టెలికం శాఖ ఇప్పటికే లైసెన్సులు, ప్రొవిజనల్‌ స్పెక్ట్రం ఇచ్చిందని, తదుపరి సెక్యూరిటీ క్లియరెన్స్‌ కేంద్ర హోంశాఖ దగ్గర పెండింగ్‌లో ఉందని, ఈ విషయంలో ఏ సంస్థ ప్రమేయమూ లేదని ఇండియా మొబైల్‌ కాంగ్రెస్‌లో పాల్గొన్న సందర్భంగా కమ్యూనికేషన్స్‌ శాఖ సహాయ మంత్రి చంద్రశేఖర్‌ పెమ్మసాని చెప్పారు. 

అయితే, టెలికం శాఖ వివరణ ఇచ్చిన కొద్ది గంటల వ్యవధిలోనే మస్క్‌ మళ్లీ తీవ్ర ఆరోపణలు చేశారు. స్టార్‌లింక్‌ సర్వీసులను మణిపూర్‌లో మిలిటెంట్లు ఉపయోగించారన్న ఆరోపణలను ఖండిస్తూ.. భారత్‌లో తమ ఉపగ్రహ సిగ్నల్స్‌ స్విచ్చాఫ్‌ చేసి ఉన్నప్పుడు వాటిని ఉపయోగించుకోవడానికి ఉండదని తెలిపారు. ‘భారత్‌లో స్టార్‌లింక్‌ వస్తే, ప్రస్తుత ధరలను భరించలేని వారికి, హైస్పీడ్‌ ఇంటర్నెట్‌ కనెక్టివిటీని చౌకగా అందించేందుకు వీలవుతుంది’అని మస్క్‌ చెప్పారు. మరోవైపు తమ సొంత శాటిలైట్‌ ఇంటర్నెట్‌ సేవల సంస్థ వన్‌వెబ్‌ కోసం తాము కూడా రెగ్యులేటరీ అనుమతుల కోసం ఎదురుచూస్తున్నామని భారతి ఎయిర్‌టెల్‌ చైర్మన్‌ సునీల్‌ మిట్టల్‌ తెలిపారు.

 కాగా మస్క్‌ తొలుత చేసిన వ్యాఖ్యలపై స్పందించడానికి జియో ప్లాట్‌ఫామ్స్‌ ఎండీ ఆకాశ్‌ అంబానీ నిరాకరించారు. వాటిని తాను చూడలేదని పేర్కొన్నారు. భారత్‌లో శాటిలైట్‌ సేవలను అందించడానికి సంబంధించి స్టార్‌లింక్, రిలయన్స్‌ జియోకి చెందిన జియో శాట్‌కామ్, భారతి ఎయిర్‌టెల్‌ పెట్టుబడులు ఉన్న యూటెల్‌శాట్‌ వన్‌వెబ్‌కి ప్రభుత్వం లైసెన్సులు ఇచ్చినప్పటికీ.. భద్రత, స్పెక్ట్రం పరమైన అనుమతుల ప్రక్రియ ఇంకా పూర్తి కాకపోవడంతో ఏ కంపెనీ కూడా ఇంకా సరీ్వసులను ప్రారంభించలేదు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement