నవంబర్‌ 20 ఆ.. అదేంటో జ్యోతిష్కుడిని అడగండి | DK Shivakumar Reacts With Irritation to Leadership Change Speculation | Sakshi
Sakshi News home page

నవంబర్‌ 20 ఆ.. అదేంటో జ్యోతిష్కుడిని అడగండి

Nov 18 2025 7:20 AM | Updated on Nov 18 2025 7:27 AM

DK Shivakumar Reacts With Irritation to Leadership Change Speculation

సాక్షి, బెంగళూరు/ ఢిల్లీ: కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ మరోసారి మీడియా ముందు తన అసహనం వ్యక్తం చేశారు. ఆశలు కలిగి ఉండడంలో తప్పేముంది? అంటూ వ్యాఖ్యానించారు. కర్ణాటకలో నాయకత్వ మార్పు ఊహాగానాలు జోరందుకున్న వేళ.. ఆయన వ్యాఖ్యలు ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి ఇప్పుడు. 

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వాళ్లు.. త్యాగాలు చేసినవాళ్లు ఆశలు పెట్టుకోవడం సహజం.  అందులో తప్పేముంది? అని మీడియాను ఉద్దేశించి శివకుమార్‌ వ్యాఖ్యానించారు. నవంబర్‌ 20న నాయకత్వ మార్పు ప్రకటన ఉంటుందా? అనే ప్రశ్నకు.. అదేంటో జ్యోతిష్యుడినే అడగాలంటూ వ్యాఖ్యానించారాయన. అయితే.. 

నవంబర్‌ క్రాంతి, భ్రాంతి అలాంటేవీ లేవని కర్ణాటక కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నప్పటికీ.. తెరవెనుక మాత్రం భిన్నమైన ఆట సాగుతోంది. ఈ ఊహాగానాలన్నింటికీ నవంబర్‌ 20 డెడ్‌లైన్‌గా కనిపిస్తోంది. ఆ రోజుకు సీఎం సిద్దరామయ్య ప్రభుత్వం రెండున్నరేళ్ల పాలన కాలాన్ని పూర్తి చేసుకోనుంది. ఈ రెండున్నరేళ్ల కాలంలో ఇతర విషయాల కంటే కూడా ముఖ్యమంత్రి మార్పు అంశమే ఎంతో ముఖ్యమైన చర్చనీయాంశంగా మారింది.  సీఎం సిద్ధరామయ్య, డీసీఎం డీకే శివకుమార్‌ల ప్రకటనలు, ఢిల్లీ యాత్రలు మరింత సెగలను రాజేశాయి.   

అంతటా సస్పెన్స్‌   
నవంబర్‌ 20లోగానే రాజకీయ పెను మార్పులు సంభవిస్తాయని కొందరి వాదన అయితే, అలాంటిది ఏదీ ఉండకపోవచ్చని సీఎం వర్గీయులు చెబుతున్నారు. కానీ వారిలోనూ సస్పెన్స్‌ కలుగుతోంది. ఢిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి తన పీఠాన్ని భద్రం చేసుకోవడంతో పాటు అనుచరులకు  మంత్రి పదవులు కట్టటెట్టి శివకుమార్‌ వర్గానికి పెద్ద షాక్‌ ఇవ్వాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.  20 నుంచి రాహుల్‌ గాంధీ ముందు రెండు వర్గాలు తమ బల ప్రదర్శనకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ హైకమాండ్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందా అనే ఆసక్తి నెలకొంది. ఈ పరిణామాల మధ్య కర్ణాటకలో అధికారాన్ని నిలుపుకోవడంతో పాటు ప్రభుత్వాన్ని సజావుగా నడిపించడం రాహుల్‌గాంధీ శిబిరానికి అగి్నపరీక్ష అయ్యింది.   

ఢిల్లీలో డీకే మంత్రాంగం   
డీసీఎం డీ.కే.శివకుమార్‌ ఢిల్లీలో పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీని కలిశారు. సీఎం పదవి, మంత్రి పదవుల పంపిణీ గురించి, పార్టీ అంశాల మీద ఆయన చర్చించినట్లు చర్చ నడుస్తోంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కూడా కలిశారు. ఆ సమయంలో సోదరుడు డీకే సురేశ్‌ను ఆయన వెంటబెట్టుకెళ్లారు. ఖర్గేతో సుమారు 50 నిమిషాల పాటు చర్చలు జరిపారు. తన చేతిలో ఉన్న కేపీసీసీ అధ్యక్ష స్థానం చేజారకుండా డీకే పావులు కదపడంతో పాటు, ముఖ్యమంత్రి పదవి గురించి మనసులో మాట చెప్పారు. కాగా, సోమవారం ఢిల్లీలో సీఎం సిద్దరామయ్యను కూడా డీకే శివ కలిసి మాట్లాడి, ఆపై బెంగళూరుకు పయనమయ్యారు.    

వెంటనే సిద్దూ కూడా..
మంత్రిమండలి ప్రక్షాళన ముందుకు రావడంతో రాష్ట్ర కాంగ్రెస్‌లో కార్యకలాపాలు ఊపందుకున్నాయి. సీఎం సిద్దరామయ్య సోమవారం ఢిల్లీకి వెళ్లే ముందుగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆయనతో వరుసగా భేటీ అయ్యారు. అందులో అనేకమంది మంత్రి పదవుల ఆకాంక్షులు ఉన్నట్లు తెలిసింది. ఎమ్మెల్యేలు ప్రదీప్‌ ఈశ్వర్, అశోక్‌ పట్టణ్, కాశప్పనవర్,  ఏ.ఎస్‌.పొన్నణ్ణ, కే.ఎస్‌.రాజణ్ణ తదితరులు ఉన్నారు. రాజణ్ణతో చాలాసేపు మాట్లాడడం కుతుహలానికి దారితీసింది. ఓట్‌ చోరీ గురించి రాజణ్ణ వ్యతిరేకంగా మాట్లాడి మంత్రి పదవిని పోగొట్టుకోవడం తెలిసిందే. తన గురించి నాయకత్వానికి మంచిగా చెప్పాలని సిద్దరామయ్యను కోరినట్లు తెలిసింది. ఎమ్మెల్యే విజయానంద కాశప్పనవర్‌ మంత్రి పదవి ఇవ్వాలని మరీ మరీ కోరారు.  ఢిల్లీకి వెళ్లాక  ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను సీఎం కలిసినట్లు సమాచారం. ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి మార్పు వంటిది ఉండకుండా చూడాలని, ఆ మేరకు హైకమాండ్‌ను ఒప్పించాలని కోరినట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement