హెబ్బాళ నుంచి సొరంగమార్గం నిర్మిస్తాం: డీకే
బనశంకరి: కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి అనుసంధానం కల్పించే మార్గంలో ట్రాఫిక్‌ను తగ్గించడానికి హెబ్బాళ నుంచి ఒకటిన్నర కిలోమీటర్ల పొడవు సొరంగమార్గం రహదారిని నిర్మిస్తామని డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్ తెలిపారు. దీనికి మేక్రి సర్కిల్ వద్ద కుడి, ఎడమవైపు వాహనాల సంచారానికి పై వంతెన నిర్మాణంతో అనుసంధానం కల్పిస్తామని తెలిపారు. గురువారం హెబ్బాళ లో బీడీఏ నిర్మించిన ఫ్లై ఓవర్ లూప్‌ని డీసీఎం ప్రారంభించారు. 120 కిలోమీటర్ల కు పైగా పొడవు గల పెరిఫెరల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి ఇప్పటికే రైతులనుంచి భూస్వాధీనం చేసుకుంటున్నామని, తగిన పరిహారం చెల్లిస్తామని తెలిపారు. 12 ఉపనగరాల నిర్మాణానిక పథకం రూపొందించామని తెలిపారు. జీబీఏ పాలికెతో పాటు అన్ని స్థానిక సంస్థల ఎన్నికలను ఈ ఏడాది నిర్వహిస్తామని డీసీఎం తెలిపారు. ఊహించని రీతిలో నగరాన్ని అభివృద్ధి చేస్తామన్నారు.
డ్రంక్ అండ్ డ్రైవ్‌లో బైక్‌కు నిప్పు
దొడ్డబళ్లాపురం: డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తుండగా పోలీసుల ముందే ఒక యువకుడు బైక్‌కి నిప్పంటించి పరారైన సంఘటన బెంగళూరులోని మైసూరు రోడ్డులో చోటుచేసుకుంది. బుధవారం రాత్రి బ్యాటరాయనపుర ట్రాఫిక్ పోలీసులు కవిక జంక్షన్ వద్ద వాహనదారులను తనిఖీలు చేస్తున్నారు. బైక్‌పై వచ్చిన ఒక యువకుడు బ్రీత్ అనలైజర్ పరీక్షకు నిరాకరించాడు. పోలీసులు బలవంతం చేయడంతో గొడవ పెట్టుకున్నాడు. మత్తులో విచక్షణ కోల్పోయి తన బైక్‌కి నిప్పంటించి పరారయ్యాడు. పోలీసులు మంటలను ఆర్పివేశారు. బైకిస్టుని బీటీఎం లేఔట్ నివాసి వెంకటేశ్ గా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న వెంకటేశ్ కోసం గాలిస్తున్నారు.


