ప్రైవేటు ఉద్యోగాలలో కన్నడిగులకు వాటా
శివాజీనగర: రాష్ట్రంలో ప్రైవేట్ కర్మాగారాలు, కంపెనీలలో కన్నడిగులకే ఉద్యోగ ప్రాధాన్యతనివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం చట్టాన్ని జారీచేసేందుకు సిద్ధమైంది. గతంలో ఇలాంటి బిల్లును సిద్ధం చేసినా కూడా ముందుకు కదలలేదు. ఇప్పుడు మళ్లీ దుమ్ము దులిపి చట్టం చేయాలని సిద్దరామయ్య సర్కారు నిశ్చయించినట్లు తెలిసింది. శుక్రవారం జరగనున్న మంత్రిమండలి సమావేశంలో ప్రైవేటు రంగంలో కన్నడిగులకు ఉద్యోగ రిజర్వేషన్ బిల్లుపై చర్చించి ఆమోదించే అవకాశముంది. త్వరలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ఆ బిల్లును ప్రవేశపెట్టవచ్చు. కన్నడిగులకు ఉద్యోగాల రిజర్వేషన్ ఇవ్వని సంస్థలు, పరిశ్రమల మీద చర్యలు తీసుకునే అధికారం సర్కారుకు ఉంటుంది.
ఎవరు అర్హులంటే..
ఈ బిల్లు ప్రకారం కర్ణాటకలో జన్మించినవారు గానీ, కర్ణాటకలో 15 ఏళ్లు నివాసమున్నవారు, కన్నడ చదివేందుకు, రాసేందుకు మాట్లాడేందుకు వచ్చేవారిని కన్నడిగులుగా పరిగణిస్తారు. ఒకవేళ కర్ణాటకలో 15 ఏళ్లు జీవించినా, కన్నడ చదవడం, రాయడం రాకపోతే నోడల్ ఏజెన్సీ నిర్వహించే కన్నడ పరీక్షలు ఉత్తీర్ణులు కావాలి. ఈ బిల్లు అమలైతే రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ప్రైవేట్ ఉద్యోగాలను కొట్టేస్తున్నవారికి చెక్ పడుతుందని, మాకు ఉద్యోగాలు లేవు అనే కన్నడిగుల ఫిర్యాదులు తగ్గుతాయని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలో ప్రైవేటు ఉద్యోగాలు ఇతర ప్రాంతాల వారి పరమవుతున్నాయని కొన్ని సంవత్సరాలుగా కన్నడ సంఘాలు ఆరోపణలు చేస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తరాది నుంచి వస్తున్న వలస కార్మికులు చిరుద్యోగాలను కైవసం చేసుకుంటున్నారని అసంతృప్తి ఉంది.
బిల్లు తీసుకువస్తున్న సర్కారు
నేటి కేబినెట్ భేటీలో చర్చ


