వినాయకునికి వెన్నాభిషేకం
మండ్య: నూతన సంవత్సరం సందర్భంగా మండ్యలోని విద్యానగర్ లేఔట్‌లోని శ్రీ గణపతి ఆలయంలో స్వామివారికి గురువారం వెన్నతో అలంకరించారు. ఉదయాన్నే జలా భిషేకం చేసి వెన్నతో అలంకరించారు. వందలాది మంది భక్తులు విఘ్ననాథున్ని దర్శించుకుని పూజలు చేశారు.
కారు పల్టీలు కొట్టి బైక్‌ను ఢీ
● భార్య మృతి, భర్త పిల్లలకు గాయాలు
దొడ్డబళ్లాపురం: నూతన ఏడాది సమయంలో విషాదం సంభవించింది. కారు బోల్తాపడి బైక్‌ను ఢీకొన్న ప్రమాదంలో భార్య మరణించగా, భర్త, ఇద్దరు పిల్లలు తీవ్రంగా గాయపడ్డ సంఘటన మాగడి తాలూకా లక్కేనహళ్లి వద్ద చోటుచేసుకుంది. వివరాలు.. బుధవారం రాత్రి కుణిగల్ నుంచి నెలమంగల వైపు వస్తున్న కారు అదుపుతప్పి మూడు పల్టీలు కొట్టి ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొంది. దీంతో బైక్ ధ్వంసమైంది, అందులో ప్రయాణిస్తున్న రమేశ్ (34) తీవ్రంగా గాయపడగా భార్య అశ్విని (29) చనిపోయింది. యువన్ (11), కుమార్తె సాన్వి (7) కూడా గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను నెలమంగల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కారులో ఉన్న వారు బాగా తాగి ఉన్నట్లు తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేశారు.
గానవి బంధువులపై కేసు
యశవంతపుర: బెంగళూరులో నవ దంపతులు గానవి, సూరజ్‌లు వేర్వేరుగా ఆత్మహత్య చేసుకున్న ఘటన అలజడి కొనసాగుతోంది. గానవి కుటుంబం వల్లే సూరజ్ ఆత్మహత్య చేసుకున్నాడంటూ అతని వదిన విద్యారణ్యపుర పోలీసులకు ఫిర్యాదు చేసింది. గానవి తల్లి రాధా, బాబుగౌడ, కార్తీక్, మహదేవ్, గగన్, శశికుమార్, రుక్మిణి, అభిలాష్, అభిషేక్‌లపై పోలీసులు కేసు నమోదు చేశారు. గానవి హర్ష అనే యువకున్ని ప్రేమించిందని, అందువల్లే సంసారంలో గొడవలు జరిగాయని సూరజ్ బంధువులు ఆరోపించారు.
మత్తులో అల్లరిమూకల దాడి
బనశంకరి: న్యూ ఇయర్ పార్టీలో మద్యం మత్తులో గొడవ తారాస్థాయికి చేరుకుంది. నడిరోడ్డులో క్యాబ్‌డ్రైవరు పై 10 మందికి పైగా అల్లరిమూకలు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన సిటీలో కార్పొరేషన్ సర్కిల్‌లో జరిగింది. అల్లరి మూకల కారు క్యాబ్‌ను తగలడంతో ఎందుకు ఢీకొట్టారని క్యాబ్ డ్రైవర్ ప్రశ్నించాడు. కానీ యువకులు మద్యం మత్తులో దూషించడంతో పాటు చుట్టుముట్టి చితకబాదారు. అక్కడే ఉన్న క్యాబ్, కారుడ్రైవర్లు విడిపించడానికి యత్నించగా రభస మరింత పెరిగింది. యువకులను కొందరు చితకబాదడంతో ఉద్రిక్తత నెలకొంది. దాడిలో గాయపడిన క్యాబ్‌డ్రైవరును ఆసుపత్రికి తరలించారు. హలసూరు గేట్ పోలీసులు వచ్చి గొడవను అదుపు చేశారు.
వినాయకునికి వెన్నాభిషేకం


