కొత్త సంతోషాల సాగరం
బుధవారం అర్ధరాత్రి బెంగళూరులో బ్రిగేడ్ రోడ్డులో ఉత్సాహం
బనశంకరి: భారత సిలికాన్ వ్యాలీలో న్యూ ఇయర్ సంబరాలు అంబరాన్ని తాకాయి. 2025 ఏడాదికి వీడ్కోలు చెబుతూ ఎన్నో ఆకాంక్షలతో 2026 కు విందులు, చిందులతో యువత, ప్రజలు ఘన స్వాగతం పలికారు. బుధవారం సాయంత్రం నుంచే టపాసులు కాల్చుతూ, పార్టీలు చేసుకుంటూ మజాగా గడిపారు. గురువారం తెల్లవారుజాము వరకూ ఉత్సవ వాతావరణం నెలకొంది. ఈ రోజు మిస్సయితే మరో సంవత్సరం వరకూ ఆగలేమంటూ స్థోమత కొద్దీ ఎంజాయ్ చేశారు.
ఇక్కడ మామూలు రద్దీ కాదు
నగరంలో వేడుకలకు పేరుపొందిన ఎంజీ రోడ్డు, బ్రిగేడ్‌రోడ్డు, చర్చ్ స్ట్రీట్, కోరమంగల, ఇందిరానగర, వైట్‌ఫీల్డ్ తదితర ప్రాంతాల్లో అట్టహాసం నెలకొంది. చెదురుమదురు సంఘటనలు మినహా ప్రశాంతంగా జరిగాయి. ఎంజీ రోడ్డు, చర్చ్ స్ట్రీట్ యువ జంటలతో నిండిపోయింది. విద్యుద్దీప కాంతుల్లో రోడ్లపై మ్యూజిక్ వింటూ నృత్యాలు చేశారు. రాత్రి 12 గంటలు కాగానే హ్యాపీ న్యూ ఇయర్ అంటూ 2026 ఏడాదికి ఘనస్వాగతం పలికారు. కేక్‌లు, మిఠాయిలు తినిపించుకుని ఆలింగనాలతో మైమరచిపోయారు.
అట్టహాసంగా పార్టీలు
బెంగళూరులో హోటళ్లు, రిసార్టులు, పబ్‌లలో పెయిడ్ పార్టీలు హోరెత్తాయి. భారీ టికెట్ల ధరలను లెక్కచేయకుండా శ్రీమంతులు, టెక్కీలు పాల్గొన్నారు. తెల్లవారుజాము వరకు మ్యూజిక్, మద్యం, విందు చిందులతో ఆడిపాడారు. ఫంక్షన్ హాళ్లు, ఫాంహౌస్‌లలోనూ పార్టీలు హోరెత్తాయి. సెలబ్రిటి డీజే సంగీతం, ఫ్యాషన్ షోలు, బెల్లీ డ్యాన్స్, మిడ్‌నైట్ ఫైర్ షో ఇలా ఎన్నో వైరెటీ థీమ్‌లు ఆహూతులను హుషారెత్తించాయి. టపాసులు మిరుమిట్లు గొలిపాయి. 200 కు పైగా స్టార్‌హోటల్స్‌లో డీజే.మ్యూజిక్, నృత్యాలు, అన్‌లిమిటెడ్ డ్రింక్స్ పార్టీలు నిర్వహించారు. ఆర్టిస్టుల డ్యాన్సులు, లేజర్ షోలతో ఆర్భాటం ఉట్టిపడింది.
హాట్‌స్పాట్‌గా కోరమంగల
సిటీలో ఈసారి సంబరాలకు కేంద్రబిందువుగా కోరమంగల నిలిచింది. ఎంజీ.రోడ్డు, బ్రిగేడ్ రోడ్డు ను కాదని ఇక్కడ ఎక్కువమంది జనం వచ్చారు. యువత, జనం కిలోమీటర్ల మేర చేరడంతో అదుపుచేయడం పోలీసులకు సవాల్‌గా మారింది.
సిలికాన్ సిటీలో మిన్నంటిన న్యూ ఇయర్ వేడుకలు


