నన్ను రమ్మని పిలిచారు అంతే.. నాకు ఇంకేమీ తెలీదు: సీఎం సిద్ధరామయ్య | Did Not Organise It, KSCA Invited Me Only CM Siddaramaiah | Sakshi
Sakshi News home page

నన్ను రమ్మని పిలిచారు అంతే.. నాకు ఇంకేమీ తెలీదు: సీఎం సిద్ధరామయ్య

Jun 8 2025 8:38 PM | Updated on Jun 8 2025 8:38 PM

Did Not Organise It, KSCA Invited Me Only CM Siddaramaiah

బెంగళూరు:  ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) 2025 టైటిల్‌ను గెలిచిన సందర్భంలో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఆటగాళ్ల సన్మానం కార్యక్రమం.. పెను విషాదాన్ని మిగిల్చింది. గతవారం చిన్నస్వామి స్టేడియంలో జరిగిన  ఆ ఈవెంట్‌లో తొక్కిసలాట జరిగి 11 మంది మృత్యువాత పడగా, 48 మంది వరకూ గాయపడ్డారు. దీనిపై ప్రతిపక్ష బీజేపీ.. అధికార కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు గుప్పించింది. ప్రభుత్వం తప్పిదం వల్లే  ఈ ఘోరం జరిగిందంటూ ధ్వజమెత్తింది. దీనిపై కర్ణాటక ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టినా అది ప్రభుత్వ వైఫల్యం అని విమర్శ ప్రధానంగా వినిపిస్తోంది. 

దీనిపై తాజాగా కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మాట్లాడుతూ.. ‘ఆర్సీబీకి సంబంధించిన ఈవెంట్‌ను తాము నిర్వహించలేనప్పుడు ప్రభుత్వ వైఫల్యం ఎలా అవుతుందని అంటున్నారు.  ‘నన్ను ఆ ఈవెంట్‌కు రమ్మని కర్ణాటక రాష్ట్ర క్రికెట్‌ అసోసియేషన్‌(కేఎస్‌సీఏ) ఆహ్వానించింది. నా వద్దకు వచ్చి మరీ కేఎస్‌సీఏ పెద్దలు నన్ను ఆహ్వానించారు.  గవర్నర్‌ కూడా ఆ ఈవెంట్‌కు వస్తున్నారని నాకు చెప్పారు. నేను కూడా ఆ  ఈవెంట్‌కు వెళ్లా. అంతేకానీ మేము ఆ ఈవెంట్‌ను నిర్వహించలేదు. నన్ను రమ్మన్నారు.. వెళ్లాను.. అంతకుమించి నాకైతే ఏమీ తెలీదు’ అని స్పష్టం చేశారు.  ఆ కార్యక్రమాన్ని కర్ణాటక రాష్ట్ర క్రికెట్‌ అసోసియేషన్‌ నిర్వహించిందని సిద్ధరామయ్య పేర్కొన్నారు. 

ఐపీఎల్‌ టైటిల్‌ను సాధించాలనే చిరకాల కోరిక ఆర్సీబీకి ఎట్టకేలకు లభించడంతో ఆ జట్టును ఘనంగా సన్మానించాలనుకున్నారు. దాంతో ఆదరా బాదరగా ఈవెంట్‌ను ఏర్పాటు చేశారు. దీనికి పెద్ద ఎత్తున అభిమానులు రావడంతో తొక్కిసలాట జరిగింది. లక్షల్లో అభిమానల హాజరుకావడంతో ఆ ఈవెంట్‌ కాస్తా విషాదంగా మారిపోయింది. ఈ నేపథ్యంలో ఆర్సీబీ, కేఎస్‌సీఏలతో పాటు కర్ణాటక ప్రభుత్వంపై కూడా విమర్శలు వెల్లువెత్తాయి. ఒక ఐపీఎల్‌ ఫ్రాంచైజీ టీమ్‌ పెద్ద ఈవెంట్‌ను నిర్వహిస్తంటే ప్రభుత్వం ఏం చేస్తుందంటూ విమర్శల వర్షం కురిసింది. దీనికి ప్రభుత్వం బాధ్యత వహించాలని బీజేపీ డిమాండ్‌ చేస్తోంది. ఈ క్రమంలోనే సీఎం సిద్ధరామయ్యతో పాటు డిప్యూటీ సీఎం  డీకే శివకుమార్‌లు సంజాయిషీలు ఇస్తూనే వస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement