చింతామణి: శిథిలావస్ధలో ఉన్న అంగన్‌వాడీ కేంద్రం పైకప్పు కూలి నలుగురు చిన్నారులు తీవ్రంగా గాయపడగా, వీరిలో ఒకరి పరిస్ధితి ఆందోళనకరంగా ఉన్న ఘటన రూరల్ పోలీసు స్షేషన్ పరిధిలోని దొడ్డబొమ్మనహళ్లి గ్రామంలో శుక్రవారం చోటు చేసుకొంది. ఉదయం పిల్లలతో ఉన్న అంగన్‌వాడీ కేంద్రంలో ఉన్నట్టుండి పైకప్పు సిమెంట్ పెంకులు పడిపోవడంతో జీవిక, రితీషాతో పాటు నలుగురు చిన్నారులు గాయపడ్డారు. తక్షణమే గాయపడిన వారిని దగ్గరలో ఉన్న కురుబూరు ఆస్పత్రి, చింతామణి ఆస్పత్రులకు తరలించారు. వీరికి డాక్టర్లు ప్రధమ చికిత్స నిర్వహించారు. జీవికను కోలారు ఆస్పత్రికి రెఫర్ చేశారు. ఘటనపై గ్రామస్తులు మాట్లాడుతూ శిథిలావస్ధలో ఉన్న అంగన్‌వాడీ కేంద్రానికి మరమ్మతులు చేపట్టాలని ఫిర్యాదులు చేసినా సంబంధిత అధికారులు పట్టించుకోలేదని, అధికారుల నిర్లక్ష్యమే ఇందుకు కారణమని, వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విషయం తెలియగానే తాలూకా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి మహేష్ ఘటనా స్ధలానికి చేరుకోగా ఆయనపై ప్రజలు మండిపడ్డారు.
నలుగురు చిన్నారులకు తీవ్రగాయాలు
వీరిలో ఒకరి పరిస్ధితి విషమం


