ఆటో డ్రైవర్‌ నిజాయితీ | - | Sakshi
Sakshi News home page

ఆటో డ్రైవర్‌ నిజాయితీ

Aug 15 2026 1:45 AM | Updated on Aug 15 2026 1:45 AM

రూ.5 లక్షల నగదు బ్యాగ్‌ అందజేత

మైసూరు: ప్రయాణికురాలు మరచిపోయిన నగదు బ్యాగును తిరిగి అందజేసి ఆటో డ్రైవర్‌ నిజాయితీని చాటిన ఘటన మైసూరులో జరిగింది. ఒక యువతి తన పెళ్లి ఖర్చుల కోసం స్నేహితులు, పరిచయస్తుల నుంచి రూ.5 లక్షలు సేకరించింది. దుస్తులు కొనడానికి ఆటోలో విజయనగరలోని దుకాణానికి వెళ్లగా, డ్రైవర్‌ పవన్‌ కుమార్‌ టీ తాగడానికి వెళ్లాడు. తిరిగి వచ్చిన యువతికి ఆటో కనిపించకపోవడంతో షాక్‌కు గురైంది. మరో ఆటోలో విజయనగర పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. ఇంతలో పవన్‌ కుమార్‌ టీ తాగి వస్త్ర దుకాణం వద్దకు వెళ్లగా ఒక పోలీసు అధికారి పవన్‌ను గమనించి ఆరా తీశారు. ఆటోలో యువతి బ్యాగ్‌ మరచిపోయిందని, ఆమె కోసం గాలిస్తున్నట్లు తెలిపాడు. దీంతో పోలీసులు పవన్‌ను స్టేషన్‌కు తీసుకెళ్లి బ్యాగ్‌లోని వస్తువులను తనిఖీ చేశారు. అందులో రూ.5 లక్షల నగదు భద్రంగా ఉంది. అనంతరం నగదు బ్యాగును యువతికి అందజేశారు. యువతి ఆటో డ్రైవర్‌కు ధన్యవాదాలు తెలిపింది.

బద్దె పురుగుల కాటుతో బాలుడు మృతి

శివమొగ్గ: కర్ణాటకలోని శివమొగ్గ జిల్లా సాగర తాలూకా హెగ్గోడు సమీపంలోని అత్తిసార గ్రామంలో బద్దె పురుగుల కాటుతో ఎనిమిదేళ్ల బాలుడు మృతి చెందాడు. వారి ఇంటి వెనుక ఉన్న అరటి చెట్టులో బద్దె పురుగుల గూడు ఉండటం వల్ల వెంకటేష్‌, అతని కుమారుడు నిషిత్‌పై బద్దె పురుగులు దాడి చేశాయి. కుటుంబ సభ్యులు వెంటనే బాలుడిని, అతని తండ్రిని హెగ్గోడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లి, అనంతరం తదుపరి చికిత్స కోసం శివమొగ్గలోని మెగ్గాన్‌ ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ బాలుడు నిషిత్‌ మరణించాడు. అతని తండ్రి వెంకటేష్‌ మెగ్గాన్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన సాగర రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది.

వారం రోజులైనా

దక్కని టెక్కీ ఆచూకీ

దొడ్డబళ్లాపురం: నెలమంగల తాలూకా శివగంగ కొండమీద కనబడకుండా పోయిన బెంగళూరు కాడుగోడి నివాసి టెక్కీ అద్వైత్‌ ఆచూకీ ఇంకా లభించలేదు. వారం రోజులుగా ఎన్‌డీఆర్‌ఎఫ్‌, దాబస్‌పేటె పోలీసులు, అటవీ శాఖ బృందాలు, చిత్రదుర్గ మంకీ మ్యాన్‌ జ్యోతిరాజ్‌, స్థానికులు అందరూ కలిసి అద్వైత్‌ ఆచూకీ కోసం గాలించారు. అయినా జాడ కానరాలేదు. ఈ నేపథ్యంలో గాలింపు కార్యాచరణ నిలిపివేశారు. దాబస్‌పేటె పోలీసులు పూర్తి సమాచారాన్ని కాడుగోడి పోలీసులకు అందించారు. ఇంత వెదికినా అద్వైత్‌ జాడ లేకపోవడంతో పోలీసులు అతడి ప్రవర్తనపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అద్వైత్‌ తాను వివాహం చేసుకోబోయే యువతిని బెదిరించడానికి లేదా ప్రచారం కోసం ఇదంతా చేస్తున్నాడా? అనే అనుమానాలు కలుగుతున్నాయి.

ఎస్సైపై ఎమ్మెల్యే కుమార్తె దాడి

మండ్య: భీముని అమావాస్య నాడు వీఐపీ పాస్‌తో ఆలయానికి వచ్చిన బీజేపీ ఎమ్మెల్యే కుమార్తె ఐశ్వర్య దర్శనానికి ఆలస్యం కావడంతో అక్కడ విధుల్లో ఉన్న మహిళా ఎస్‌ఐ సవితా పాటిల్‌పై దాడి చేసిన ఘటన జరిగింది. తాను ఎమ్మెల్యే కుమార్తెనని, డీఎస్పీ భార్యనని, తనకు వెంటనే దర్శనానికి వదలాలని ఐశ్వర్య డిమాండ్‌ చేసింది. మిమ్మల్ని ఒక్కర్ని వదిలితే మిగతా భక్తులు గొడవ చేస్తారని మహిళా ఎస్‌ఐ అడ్డుకోవడంతో కోపంతో ఆమెను దుర్భాషలాడి, చెంపదెబ్బ కొట్టింది. తన విధులకు ఆటంకం కలిగించి, తనపై దాడి చేసినందుకు ఐశ్వర్యపై బాధిత ఎస్సై క్యాతనహళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కుమార్తె ప్రవర్తనపై ఎమ్మెల్యే క్షమాపణ

దొడ్డబళ్లాపురం: విధి నిర్వహణలో ఉన్న మహిళా పోలీస్‌ ఎస్సైపై చేయి చేసుకున్న తన కుమార్తె ప్రవర్తనపై బీజేపీ ఎమ్మెల్యే బీ.సురేశ్‌గౌడ క్షమాపణ చెప్పారు. శుక్రవారంనాడు విధానసౌధ ముందు మీడియాతో మాట్లాడిన ఆయన తన కుమార్తె ఐశ్వర్య తన ఇద్దరు చిన్న పిల్లలతో శ్రీరంగపట్టణలోని ఆరతి ఉక్కడ ఆలయానికి వెళ్లిందన్నారు. అక్కడ విధి నిర్వహణలో ఉన్న పోలీస్‌ సబ్‌ఇన్స్‌పెక్టర్‌ ఆమెను ఆలయం లోపలకు వెళ్లకుండా అడ్డుకోవడంతో వాగ్వాదం జరిగి కోపం పట్టలేక ఐశ్వర్య ఎస్సైపై చేయి చేసుకుందన్నారు. అందుకు తాను బహిరంగంగా క్షమాపణ చెబుతున్నానన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement