బళ్లారి కేంద్ర కారాగారం
● ఈ జైలులోనే జాతీయ నాయకుల నిర్బంధం
● 1884లో కేంద్ర కారాగారం నిర్మాణం
● స్వాతంత్య్ర సమరయోధుల జ్ఞాపకార్థం
శిలాఫలకాల ఏర్పాటు
బళ్లారి రూరల్: బళ్లారి కేంద్ర కారాగారం (బళ్లారి సెంట్రల్ జైలు) బ్రిటిష్ కాలం నుంచి చారిత్రక ప్రాముఖ్యత ఉంది. స్వాతంత్య్రోద్యమ సమయంలో చాలా మంది దేశభక్తులు, జాతీయ నాయకులను ఈ జైలులో నిర్భందించారు. నాటి మద్రాసు ప్రెసిడెన్సీ పరిధిలో కీలకమైన ఈ కారాగారం భారత స్వాతంత్య్ర పోరాటంలో చెరగని ముద్ర వేసింది. బళ్లారిలో 1884లో కేంద్ర కారాగారం ఏర్పాటు చేశారు. చిత్తూరు, కడప, అనంతపురం, బళ్లారి ప్రాంతాలు మద్రాసు ప్రెసిడెన్సీ పాలనలో ఉండేవి. స్వాతంత్య్ర ఉద్యమంలో భాగం సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్న దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వందలాది మందిని ఆంగ్లేయులు బళ్లారి కేంద్ర కారాగారానికి తరలించే వారు. ఇందులో భాగంగా 1930 నవంబర్ 6 నుంచి 1930 నవంబర్ 27 వరకు బాబు రాజేంద్ర ప్రసాద్ (రాజాజీ) బళ్లారి సెంట్రల్ జైల్లో ఉన్నట్లు రికార్డులు ఉన్నాయి. స్థానికులు బీహెచ్ కృష్ణప్ప, బి.వెంకోబ, బి.గోపాల్, హెచ్. వెంకట నారాయణ, బీవీ తంబ్రపరని, జేవీ శేషగిరిరావు, ఐదుకల్లు సదాశివ, రసూల్ సాహెబ్, ఎం.రాఘవేంద్ర రావు తదితరులు బళ్లారి సెంట్రల్ జైలు, అల్లిపురం జైలులో గడిపినట్లు రికార్డుల్లో ఉన్నాయి. అల్లిపురం జైలులో 657 మంది ఉన్నట్లు రికార్డు ఉంది.
ఉద్యమాలకు అగ్రగణ్యుడు టేకూరి సుబ్రమణ్యం
బళ్లారి వాసుడుగా, ప్రముఖ స్వాంతంత్య్ర సమరయోధుడుగా టేకూరి సుబ్రమణ్యం పేరు పొందారు. కర్నూలు జిల్లా శ్రీశైలంకు 80 కిలోమీటర్ల దూరంలో టేకూరు గ్రామం ఉంది. టేకూరి సుబ్రమణ్యం పూర్వీకులు 18వ శతాబ్దానికి పూర్వం బళ్లారిలో స్థిరపడ్డారు. ఆగస్టు 9, 1900 సంవత్సరంలో టేకూరి సుబ్రమణ్యం జన్మించాడు. బళ్లారిలో స్వాతంత్య్ర పోరాట ఉద్యమాలకు అగ్రగణ్యుడిగా నిలిచారు. నాటి మహాత్మా గాంధీ, రాజాజీ, తదితర ప్రముఖ జాతీయ నాయకులతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపే వారు. స్వాతంత్య్రం సాధించాక కీలక పదవులు అలంకరించారు. బళ్లారి చరిత్రలో చిరస్థాయిగా టేకూరి సుబ్రమణ్యం నిలిచారు.


