ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా ఢిల్లీలో సాగుతున్న నిరసనలు ఉద్రిక్తంగా మారిన వేళ.. ఓ మహిళా ఐపీఎస్ అధికారి అందరి దృష్టిని ఆకర్షించారు. జెన్‌జీ యువత ఆవేశం, నినాదాలతో అశోక్ రోడ్డు హోరెత్తిన సమయంలో.. ఆందోళనకారులతో నేరుగా మాట్లాడి పరిస్థితిని అదుపులో ఉంచేందుకు ప్రయత్నించారు. నిరసనల మధ్య ఆమె సంయమనంతో వ్యవహరించిన తీరు, ఆందోళనకారులతో మాట్లాడిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో నెటిజన్లు ఆమెను లాఠీ ఝళిపించని ‘లేడీ సింగం’ అంటూ ప్రశంసిస్తున్నారు.
ఆ ఐపీఎస్ పేరు ఐశ్వర్య సింగ్. వయసు 31 సంవత్సరాలు. 2022 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. ప్రస్తుతం ఢిల్లీ పోలీసు విభాగంలో దక్షిణ ఢిల్లీ అదనపు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏడీసీపీ)గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆమె తండ్రి జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్ కూడా సీనియర్ ఐపీఎస్ అధికారి కావడం విశేషం.
జెన్‌జీ ఆవేశం నడుమ ఆమె..
అక్టోబర్ 8న ఢిల్లీలో ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా నిరసనలు జరిగాయి. ఎన్నికల ప్రక్రియ, ఎన్నికల సంఘం తీరుపై అసంతృప్తితో ఆందోళనకు దిగిన నిరసనకారులు నినాదాలతో హోరెత్తించారు. ఈ క్రమంలో అశోక్ రోడ్డులో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. యువత ఆవేశం, నిరసనల తీవ్రత మధ్య పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు.
లాఠీకి బదులు మాటలతో..
ఈ సమయంలో ఐశ్వర్య సింగ్ ఆందోళనకారులను అడ్డుకున్నారు. నేరుగా మాట్లాడిన తీరు ప్రత్యేకంగా నిలిచింది. పరిస్థితి మరింత ఉద్రిక్తం కాకుండా చూడటంతోపాటు, నిరసనకారులను అదుపు చేసేందుకు ఆమె ప్రయత్నించిన దృశ్యాలు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అయ్యాయి. ఆవేశంతో ఉన్న నిరసనకారుల మధ్య ఆమె చూపిన ఆత్మవిశ్వాసం, సంయమనం నెటిజన్ల ప్రశంసలు అందుకున్నాయి. అందుకే ఆమెను ‘లేడీ సింగం’ అంటూ పలువురు అభివర్ణిస్తున్నారు.
Kudos to @aishwarya_ips for displaying tremendous courage, restraint and leadership amidst immense pressure https://t.co/qUCf1LhXww
— Sameer (@BesuraTaansane) October 8, 2026
ఇరువైపులా ఆరోపణలు
అయితే ఈ నిరసనల సందర్భంగా పోలీసులపై దాడులు జరిగాయని అధికారులు ఆరోపించగా, కొందరు ఆందోళనకారులు పోలీసులు తమ పట్ల దురుసుగా వ్యవహరించారని విమర్శించారు. ఇలాంటి పరస్పర ఆరోపణల మధ్య ఐశ్వర్య సింగ్ వ్యవహారశైలి చర్చనీయాంశంగా మారింది. నిరసనల సమయంలో పోలీసుల బాధ్యత కేవలం గుంపును చెదరగొట్టడమే కాకుండా, పరిస్థితులు అదుపు తప్పకుండా చూడటం కూడా. ఈ నేపథ్యంలో ‘జెన్‌జీ’ ఐశ్వర్య సింగ్ వీడియోలు వైరల్ కావడం, ఆమెకు ప్రశంసలు రావడం ఆసక్తికరంగా మారింది.
ఇదీ చదవండి: కటకటాల్లోకి జైలర్ దివ్య


