భర్తకు దూరంగా మరో ఊరిలో ఉంటోంది ఆ పోలీస్ అధికారిణి. ఇద్దరు బిడ్డలతో అద్దె ఇంట్లో దిగింది. కానీ, ఇల్లు నడవడం ఆమెకు తెగ ఇబ్బందిగా అనిపించిందట. అందుకే.. ఓ నిర్ణయం తీసుకుంది. ‘అందుకు రూల్స్ ఒప్పుకోవు మేడమ్’ అని సిబ్బంది వారించినా వినలేదు. మొండిగా ముందుకు వెళ్లింది. కానీ గంటల వ్యవధిలోనే ఆమె వ్యవహారం ఉన్నతాధికారులకు తెలిసిపోయింది. అప్పటి నుంచి తప్పించుకుంటూ తిరిగిన ఆమెను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు.
దివ్య చౌద్రీ (37) రాజస్థాన్‌లోని అజ్మీర్ సెంట్రల్ జైలులో జైలర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. అయితే, ఇప్పుడు పరిస్థితి తలకిందులైంది. ఖైదీలను పర్యవేక్షించాల్సిన ఆమెనే అదే జైలులో రిమాండ్ ఖైదీగా ఉండాల్సి వచ్చింది. దివ్య భర్త కూడా జైలు శాఖలో పనిచేస్తున్నారు. ఆయన కోటాలో విధులు నిర్వహిస్తుండటంతో.. దివ్య మాత్రం తన ఇద్దరు చిన్నారులతో కలిసి అజ్మీర్‌లోని అద్దె ఇంట్లో ఉంటున్నారు. ఉద్యోగ బాధ్యతలతో పాటు పిల్లల సంరక్షణ, ఇంటి పనులను చక్కబెట్టుకోవడం కష్టంగా మారడంతో.. ఇంట్లో సాయం కోసం ఆమె ప్రయత్నించారు. అయితే, అందుకోసం ఎంచుకున్న మార్గమే చివరకు ఆమెను చిక్కుల్లో పడేసింది.
గేటు వద్ద సిబ్బంది అభ్యంతరం
ఇంటి పనుల కోసం జైలు ఖైదీలను ఉపయోగించుకోవాలని ఆమె అనుకున్నారు. కిరణ్ అలియాస్ సేథా, సనా అనే ఇద్దరు మహిళా ఖైదీలను వెంటబెట్టుకుని జైలు నుంచి బయటకు వెళ్లేందుకు దివ్య ప్రయత్నించారు. కిరణ్ జీవిత ఖైదు అనుభవిస్తుండగా.. సనా విచారణ ఖైదీగా ఉన్నారు. అయితే మహిళా జైలు ప్రధాన గేటు వద్ద విధుల్లో ఉన్న సిబ్బంది దీనిపై అభ్యంతరం తెలిపారు. అయినప్పటికీ దివ్య, ఆమె సహోద్యోగి, కానిస్టేబుల్ సోనియా చౌద్రీలు సిబ్బందిని బెదిరించి మరి వాళ్లను తీసుకెళ్లారు.
ఖైదీలను బయటకు తీసుకెళ్లిన విషయం కొద్దిసేపటికే ఉన్నతాధికారులకు తెలిసింది. దీంతో ఆ ఇద్దరు మహిళా ఖైదీలు గంటా రెండు గంటల వ్యవధిలోనే తిరిగి జైలుకు చేరుకున్నారు. అయితే అప్పటికే ఈ వ్యవహారం అధికారుల దృష్టికి వెళ్లింది. ఖైదీలను వ్యక్తిగత పనుల కోసం బయటకు తీసుకెళ్లడం చట్టవిరుద్ధం కావడంతో అధికారులకు చర్యలకు దిగారు.
కేసు నమోదు.. పరారీ
జైలు సిబ్బంది ఫిర్యాదు, అంతర్గత విచారణ ఆధారంగా ఆగస్టు 5న అజ్మీర్‌లోని సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. జైలు గార్డు మహిపాల్ మంగ్లోడా ఇచ్చిన నివేదికతో దర్యాప్తు ప్రారంభించారు. అయితే కేసు నమోదైన తర్వాత దివ్య అరెస్టు నుంచి తప్పించుకునేందుకు పరారైంది. ఆమె కోసం సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌వో శంభు సింగ్ ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీసు బృందాన్ని ఏర్పాటు చేశారు. సీసీటీవీ దృశ్యాలు, సాంకేతిక ఆధారాలు, ఇతర రికార్డులను పరిశీలించారు. సైబర్ సెల్ సాయంతో ఆమె ఆచూకీ కోసం గాలించారు. చివరకు అక్టోబర్ 6న కోటా జిల్లాలోని ఓ నివాస ఫ్లాట్‌లో ఆమెను అరెస్టు చేశారు. అక్కడ ఆమె భర్త అద్దెకు ఉంటున్నట్లు పోలీసులు వెల్లడించారు.
చివరకు అదే జైలులో..
తన ఇంటిని శుభ్రం చేసేందుకు సాయం కావాలని మాత్రమే కోరుకున్నానని, ఇందుకోసం ఓపెన్ జైలులోని మహిళలను తీసుకురావాలని తన కింద పనిచేసే సోనియాకు చెప్పానని, కానీ, ఆమె మాత్రం అలా చేసిందని దివ్య తన వాదనలో పేర్కొంది. ఖైదీల భద్రత, క్రమశిక్షణను పర్యవేక్షించాల్సిన జైలర్.. నిబంధనల ఉల్లంఘన ఆరోపణలతో అరెస్టయ్యారు. ఒకప్పుడు ఖైదీలకు కాపలాగా ఉన్న ఆమె ఇప్పుడు అదే అజ్మీర్ సెంట్రల్ జైలులో ఖైదీగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇదీ చదవండి: అమ్మ మధుమితా.. నువ్వూ దొంగవేనా?


