టెలిగ్రామ్‌పై నిషేధం సబబే | Delhi HC upholds temporary ban on Telegram aap | Sakshi
Sakshi News home page

టెలిగ్రామ్‌పై నిషేధం సబబే

Jun 20 2026 4:45 AM | Updated on Jun 20 2026 4:45 AM

Delhi HC upholds temporary ban on Telegram aap

నీట్‌ పేపర్‌ లీకేజీ నివారణే లక్ష్యం

కేంద్రం నిర్ణయాన్ని సమర్థించిన ఢిల్లీ హైకోర్టు

టెలిగ్రామ్‌ సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌ కొట్టివేత

సాక్షి, న్యూఢిల్లీ: నీట్‌ రీ–ఎగ్జామ్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ టెలిగ్రామ్‌పై తాత్కాలిక నిషేధం విధిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఢిల్లీ హైకోర్టు సమర్థించింది. పేపర్‌ లీకేజీలను నివారించేందుకు జూన్‌ 22 వరకు యాప్‌ను బ్యాన్‌ చేస్తూ కేంద్రం జారీ చేసిన ఆదేశాలను సవాల్‌ చేస్తూ టెలిగ్రామ్‌ సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం శుక్రవారం కొట్టివేసింది. 

జస్టిస్‌ తేజస్‌ కరియా సారథ్యంలోని ఏకసభ్య ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది. విచారణ సందర్భంగా కేంద్రం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదనలు వినిపించారు. టెలిగ్రామ్‌ యాప్‌లోని సాంకేతిక ఫీచర్ల ద్వారా ఆటోమేటెడ్‌ బాట్‌ అకౌంట్లను సష్టించి, ఒకేసారి పెద్ద ఎత్తున సమాచారాన్ని బదిలీ చేసే అవకాశం ఉందన్నారు. ఒక బాట్‌ను బ్లాక్‌ చేస్తే, దానంతటదే మరో బాట్‌కు సమాచారం బదిలీ అయ్యే (మిర్రర్‌ ఛానల్‌) వ్యవస్థ ఇందులో ఉందని వివరించారు. 

21న జరిగే నీట్‌ రీ–ఎగ్జామినేషన్‌ నేపథ్యంలో నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్టీఏ), కేంద్ర ఉన్నత విద్యా శాఖ సిఫార్సుల మేరకే తాత్కాలికంగా బ్లాక్‌ చేసినట్లు వివరించారు. అయితే, నీట్‌కు సంబంధించి చట్టవిరుద్ధంగా ఉన్న 900 పైగా లింకులను ఏఐ సాంకేతికత ద్వారా ఇప్పటికే తొలగించామని టెలిగ్రామ్‌ వాదించింది. కొందరు చేసిన తప్పులకు 15 కోట్లకు పైగా ఉన్న సాధారణ యూజర్లను శిక్షించడం వారి హక్కులను హరించడమేనని పేర్కొంది. 

కేవలం ఒక వర్గానికి చెందిన అభ్యర్థులు పరీక్ష రాస్తున్నారనే కారణంతో, ఏ సంబంధం లేని 15 కోట్ల మంది సాధారణ యూజర్ల యాప్‌ వినియోగాన్ని ఎలా నిరోధిస్తారని ఈ సందర్భంగా ధర్మాసనం కేంద్రాన్ని మౌఖికంగా ప్రశ్నించింది. వాదనల అనంతరం టెలిగ్రామ్‌ పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు జస్టిస్‌ తేజస్‌ కరియా తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో ఐటీ చట్టంలోని సెక్షన్‌ 69ఏ కింద ఒక సామాజిక మాధ్యమ వేదికను బ్లాక్‌ చేసే అధికారం కేంద్రానికి ఉందని స్పష్టం చేశారు. జరగబోయే నష్టాన్ని నివారించేందుకు కేంద్రం అనుసరించిన విధానంపై సంతృప్తి వ్యక్తం చేశారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement