2023 నుంచే పేలుడుపదార్థాలపై ఉమర్ ప్రయోగాలు
వెలుగులోకి కొత్త అంశాలు
న్యూఢిల్లీ: చరిత్రాత్మక ఎర్రకోట సమీపంలో కారుబాంబు పేల్చిన ఆత్మాహుతి బాంబర్ డాక్టర్ ఉమర్ నబీ, అతని ఉగ్రముఠా సభ్యుల మధ్య విభేదాలు మొదలు వాళ్ల గత వ్యూహరచనల దాకా ఎన్నో కొత్త అంశాలు దర్యాప్తువేళ వెలుగులోకి వస్తున్నాయి. ఉగ్రభావజాలం, నిధుల సమీకరణ, పేలుళ్లను అమలుచేసే వ్యూహాలపై డాక్టర్ ఉమర్, డాక్టర్ ముజామిల్ ఘనీ, అదీల్ రాఠర్, మౌల్వీ ముఫ్తీ ఇర్ఫాన్ వాగయ్‌ల మధ్య భేదాభిప్రాయాలు పొడచూపాయని వెల్లడైంది.
గొడవ కారణంగా అక్టోబర్‌లో డాక్టర్ రాఠర్ వివాహవేడుకకు డాక్టర్ ఉమర్ హాజరుకాలేదు. వైద్యురాలు షాహీన్ సయీద్ నుంచి నిధులను ఉమర్ విచ్చలవిడిగా ఖర్చుచేసేవాడని తోటి ముఠా సభ్యులు ఆరోపించేవారు. అయితే కశ్మీర్ లోయలో మతబోధకుడు వాగయ్‌ను అరెస్ట్‌చేశారని తెలియగానే ఉమర్ అప్రమత్తమయ్యాడు. అక్టోబర్ 18వ తేదీన ఖ్వాజీగండ్‌కు వెళ్లి తోటి ఉగ్రవాదులతో సయోధ్య కుదుర్చుకున్నాడు. గొడవలు పక్కనబెట్టి కలిసి పనిచేద్దామని ఒప్పించాడు.
అయితే ఘనీ, రాఠర్, వాగయ్‌లు అల్‌ఖైదా అంతర్జాతీయ ఉగ్రసంస్థ తరహాలో కార్యకలాపాలు చేయాలని ఆశించేవారు. ఉమర్ మాత్రం ఐసిసి ఉగ్రసంస్థ తరహాలో పనిచేయాలని పట్టుబట్టేవాడు. 2023 నుంచే శక్తివంతమైన పేలుడుపదార్థాల తయారీకోసం పలు రసాయనాలపై ఉమర్ ప్రయోగాలు చేసేవాడని విచారణ సందర్బంగా తోటి ఉగ్రవాదులు చెప్పారు. అల్‌ఖైదా అనేది పశ్చిమదేశాల సంస్కృతులను తప్పుబడుతూ శత్రుదేశాలపై దాడులు చేసేది. ఐసిస్ మాత్రం మతఛాందసవాదాన్ని ఎగదోస్తూ తమ ఉనికి ఉన్న దేశాల్లో ఇస్లామిక్ రాజ్యం(ఖలీఫేట్) స్థాపనకు ఉబలాటపడేది.
ఆరేళ్ల క్రితమే ఉగ్రభావజాలం మొదలు
డాక్టర్ ఉమర్, డాక్టర్ ఘనీ, డాక్టర్ రాఠార్, డాక్టర్ ముజఫర్‌లే 2019లో తొలిసారిగా విదేశీ హ్యాండ్లర్లయిన ఉకాసా, ఫైజాన్, హష్మీల దృష్టిలో పడ్డారు. 2019లో ఫేస్‌బుక్, ఎక్స్ సామాజిక మాధ్యమాల్లో ఉగ్రవాద భావజాలాన్ని ప్రోత్సహిస్తూ జరిగే చర్చాకార్యక్రమాల్లో వీళ్లంతా పాల్గొనేవారు. అలా తొలిసారిగా విదేశీ హ్యాండ్లర్లు వీళ్లను గుర్తించారు. తర్వాత వెంటనే ప్రైవేట్ టెలిగ్రామ్ గ్రూప్‌లోకి మారారు. ఆనాటి నుంచే ఉగ్రభావజాలాన్ని విదేశీ హ్యాండర్లు వీళ్లకు నూరిపోయడం మొదలైంది.
ఎర్రకోట ఘటనలో ఘనీ, అదిల్‌లను ఎన్‌ఐఏ అరెస్ట్‌చేయగా అంతకుముందే ఆగస్ట్‌లో ముజఫర్ అఫ్గానిస్తాన్‌కు పారిపోయాడు. ఉమర్ బృందం మొదట్నుంచీ యూట్యూబ్‌లో ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్(ఐఈడీ)ల తయారీ వీడియోలను విపరీతంగా చూసి వాటి తయారీపై అవగాహన పెంచుకున్నారు. ఉమర్ బృందసభ్యులను సంక్షోభ సిరియా, అఫ్గానిస్తాన్‌లలో తమ తరఫున పోరా డాలని హ్యాండ్లర్లు తొలుత సూచించారు. తర్వాత అది కార్యరూపం దాల్చలేదు. భారత్‌లోనూ ఉంటూ విద్వంసం సృష్టించాలని హ్యాండ్లర్ల నుంచి ఆదేశాలు రావడంతో ఈ ముఠాసభ్యులు ఇక్కడే ఉండిపోయి పేలుళ్లకు పథకరచన చేశారు.


