ఎడారి ఇసుక దీవుల్లో బైక్ రైడింగ్ చేయడమంటే అందరికీ సరదానే. కానీ అదే సరదా ఇప్పుడు ప్రాణాల మీదకు తెస్తోంది. ఇటీవల అబుదాబి ఎడారి ఇసుక దిబ్బలలో బైక్ నడుపుతుండగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల్లో దాదాపు 9 మంది గాయపడ్డారు. గత గురువారం ఒక్కరోజే ఏడు వేర్వేరు ప్రమాదాల్లో బైక్ రైడింగ్ చేస్తున్న వ్యక్తులు గాయపడ్డారని అబుదాబి పోలీసులు తెలిపారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వెల్లడించారు. మితిమీరిన వేగం, భద్రతా నియమాలను పాటించకపోవడం వల్లే ప్రమాదాలు సంభవించాయని పోలీసులు నిర్ధారించారు.
ఎడారిలో బైక్ రైడింగ్‌కు వెళ్లే పిల్లలతో తల్లిదండ్రులు తప్పనిసరిగా వెళ్లాలని పోలీసు అధికారులు ఆదేశించారు. జనావాసాలు లేని ఇసుక ప్రాంతాలలో పిల్లలు నిర్లక్ష్యంగా బైక్‌లు నడపకుండా నిరోధించడానికి తల్లిదండ్రుల సహకారం చాలా అవసరమన్నారు. హెల్మెట్ లేకపోవడం నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వల్ల పెద్ద ప్రమాదాలు సంభవిస్తాయని అధికారులు హెచ్చరించారు.
ఎడారిలో రహదారి నియమాలు అందరికీ సమానంగా వర్తిస్తాయని ట్రాఫిక్, పెట్రోల్స్ డైరెక్టరేట్ డైరెక్టర్ బ్రదర్ మహమూద్ యూసఫ్ అల్ బలూషి అన్నారు. బైక్ రైడర్లు హెల్మెట్, తగిన భద్రతా దుస్తులను ధరించాలని కోరారు. బయలుదేరే ముందు బైక్ టైర్లు, లైట్లు పని చేస్తున్నాయో లేదో నిర్ధారించుకోవాలని సూచించారు. ప్రథమ చికిత్స వస్తు సామగ్రి,అనుమతి కలిగిన భద్రతా పరికరాలను తీసుకెళ్లడం చాలా అవసరమని తెలిపారు. రద్దీగా ఉండే ప్రాంతాలలో వేగాన్ని తగ్గించాలని, ట్రాఫిక్ సిగ్నల్స్ సూచించిన లేన్‌లలో మాత్రమే ప్రయాణించాలని వాహనదారులకు గుర్తు చేశారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించేవారిని పట్టుకోవడానికి పోలీసులు అంతర్గత రోడ్లు, హైవేలపై నిఘాను కఠినతరం చేశామని హెచ్చరించారు.


