మావోయిస్టుల సిద్ధాంతంతో అధోగతే
వారు లొంగిపోతుండటం శుభపరిణామం
రాజ్యాంగాన్ని స్వీకరించి, శాంతి మార్గంలో నడుస్తుండటం హర్షణీయం
ఛత్తీస్‌గఢ్ పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెల్లడి
రాష్ట్ర అసెంబ్లీ నూతన భవనం ప్రారంభం
రాయ్‌పూర్: దేశంలో నక్సలిజం పూర్తిగా అంతమయ్యే రోజు ఇక ఎంతో దూరంలో లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. మావోయిస్టుల ప్రభావం ఇప్పటికే చాలావరకు తగ్గిపోయిందని చెప్పారు. ఆయన శనివారం ఛత్తీస్‌గఢ్‌లో పర్యటించారు. రూ.14,260 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభించారు. ఛత్తీస్‌గఢ్ అవతరించి 25 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో నవ రాయ్‌పూర్‌లో నిర్వహించిన ‘రజత్ మహోత్సవ్’లో పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రగతి ప్రయాణం తనకు ఆనందం కలిగిస్తోందని అన్నారు. 25 ఏళ్ల క్రితం నాటిన విత్తనం ఇప్పుడు వటవృక్షంగా మారిందని ఉద్ఘాటించారు. ఛత్తీస్‌గఢ్ 25 ఏళ్ల ప్రయాణం స్ఫూర్తిదాయకమని ప్రశంసించారు. ఒకప్పుడు నక్సలైట్ల హింసాకాండకు, వెనుకబాటుతనానికి ప్రతీక అయిన రాష్ట్రం నేడు అభివృద్ధి, భద్రత, స్థిరత్వానికి మారుపేరుగా మారిందని హర్షం వ్యక్తంచేశారు. నక్సల్స్ హింసాకాండ నుంచి రాష్ట్రం విముక్తి పొందడం ఎంతో సంతృప్తినిస్తోందని తెలిపారు. మావోయిస్టుల సిద్ధాంతం వల్ల అధోగతే తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు.
మావోయిస్టులు ఆయుధాలు వదిలేసి లొంగిపోతుండడం శుభపరిణామం అని అభివరి్ణంచారు. వారు భారత రాజ్యాంగం స్వీకరించి, శాంతి మార్గంలో నడుస్తున్నారని పేర్కొన్నారు. శాసనసభ అంటే కేవలం చట్టాలు చేసే వేదిక కాదని.. రాష్ట్ర భవిష్యత్తును గొప్పగా తీర్చిదిద్దే మహోన్నత క్షేత్రమని ప్రధాని మోదీ స్పష్టంచేశారు. ఛత్తీస్‌గఢ్ రాజధాని నవ రాయ్‌పూర్ అటల్ నగర్‌లో రాష్ట్ర అసెంబ్లీ నూతన భవనాన్ని ప్రధాని మోదీ శనివారం ప్రారంభించారు. అసెంబ్లీ ప్రాంగణంలోనే ఉన్న దివంగత ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి విగ్రహాన్ని కూడా నరేంద్ర మోదీ ఆవిష్కరించారు.
రామచరిత మానస్ పఠనం
16వ శతాబ్దంలో తులసీదాస్ రచించిన రామచరిత మానస్‌లోని ఓ శ్లోకాన్ని ప్రధాని మోదీ పఠించారు. సుపరిపాలనకు శ్రీరాముడి ఆశయాలే నాంది అని తెలిపారు. ‘అభివృద్ధి చెందిన భారత్’ అనే దార్శనికతకు ఆయనే స్ఫూర్తి అని పేర్కొన్నారు. శ్రీరాముడి తల్లి జన్మస్థలం ఛత్తీస్‌గఢ్‌లోనే ఉందన్నారు. ఛత్తీస్‌గఢ్‌కు రాముడు ప్రియమైన మేనల్లుడు అని వ్యాఖ్యానించారు. సామాజిక సామరస్యం, సమానత్వానికి శ్రీరాముడి ఆశయాలే పునాది అని ఉద్ఘాటించారు. సమాజంలో వివక్ష అంతం కావాలని, అందరికీ సామాజిక న్యాయం దక్కాలని అకాంక్షించారు.
శాంతి శిఖర్ ధ్యాన కేంద్రం ప్రారంభం
అంతర్జాతీయంగా ఎలాంటి సంక్షోభం తలెత్తినా మొదట భారత్ ప్రతిస్పందిస్తోందని ప్రధానమంత్రి మోదీ తెలిపారు. బాధితులకు తగిన సాయం అందించేందుకు దేశం ముందుకు వస్తోందని అన్నారు. నవ రాయ్‌పూర్‌లో బ్రహ్మకుమారీలకు సంబంధించిన శాంతి శిఖర్ సెంటర్ ఫర్ స్పిరిచ్యువల్ లెర్నింగ్ అండ్ మెడిటేషన్‌ను ఆయన శనివారం ప్రారంభించారు. రాష్ట్రాల అభివృద్ధి ద్వారా దేశాభివృద్ధి సాధించాలన్నదే తమ ప్రభుత్వ విధానమని పేర్కొన్నారు. ప్రతి మనిíÙలో మనం శివుడిని దర్శిస్తున్నామని చెప్పారు.
ప్రపంచం సౌభాగ్యంతో విలసిల్లాలని, అందరిలోనూ మానవత్వం నెలకొనాలని కోరుకోవడం మన సంప్రదాయమని తెలిపారు. అభివృద్ధి చెందిన భారత్ అనే ఆశయ సాధనకు తోడ్పాడు అందించాలని బ్రహ్మకుమారీలకు ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు. ఛత్తీస్‌గఢ్ అవతరించి ఈ రోజుతో 25 ఏళ్లు పూర్తయ్యాయని, ఇది చాలా ప్రత్యేకమైన దినమని చెప్పారు. జార్ఖండ్, ఉత్తరాఖండ్ కూడా 25 ఏళ్లు పూర్తి చేసుకున్నాయని గుర్తుచేశారు. మరికొన్ని రాష్ట్రాలు కూడా అవతరణ దినోత్సవం నిర్వహించుకుంటున్నాయని పేర్కొన్నారు. ఆయా రాష్ట్రాలకు శుభాభినందనలు ప్రధానమంత్రి తెలియజేశారు.
శ్రీసత్యసాయి సంజీవని ఆసుపత్రి సందర్శన
నవ రాయ్‌పూర్‌లో శ్రీసత్యసాయి సంజీవని హాస్పిటల్‌ను ప్రధాని మోదీ సందర్శించారు. సత్యసాయి బాబా విగ్రహానికి పూజలు చేశారు. ‘గిఫ్ట్ ఆఫ్ లైఫ్’ కార్యక్రమంలో భాగంగా ఈ ఆసుపత్రిలో గుండెకు సంబంధించిన శస్త్ర చికిత్సలు చేయించుకున్న చిన్నారులతో మాట్లాడారు. వారికి ధ్రువపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కూడా పాల్గొన్నారు.


