
ఇటీవల మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో దగ్గుమందు వికటించి 11 మంది చిన్నారుల వరకూ మృత్యువాత పడటంతో కేంద్రం అప్రమత్తమైంది. దగ్గుమందును రెండేళ్ల లోపు పిల్లలకు దగ్గుమందు వాడొద్దని తెలిపిన కేంద్రం.. అలాగే ఐదేళ్ల లోపు చిన్నారులకు సైతం దగ్గమందును డాక్టర్లు సిఫార్సు చేయకూడదని స్పష్టం చేసింది. ఈ మేరకు అన్ని రాష్ట్ర హెల్త్ డిపార్ట్‌మెంట్‌లకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ లేఖ ద్వారా వెల్లడించింది.
కొన్నిరోజుల క్రిత మధ్యప్రదేశ్‌లో 9 మంది చిన్నారులు, రాజస్థాన్‌లో 2 చిన్నారులు మృత్యువాత పడ్డారు. దగ్గమందు వికటించే ఇలా జరిగిందని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కేంద్ర పలు మార్గదర్శకాలు జారీ చేసింది.
చిన్నారులకు దగ్గు మందులపై మార్గదర్శకాలు
2 ఏళ్ల లోపు పిల్లలకు దగ్గు సిరప్ ఇవ్వొద్దు: ఈ వయస్సులో శరీరం మందుల ప్రభావానికి అధికంగా స్పందించవచ్చు.
5 ఏళ్ల లోపు పిల్లలకు దగ్గు మందులు సిఫార్సు చేయరాదు: సాధారణ దగ్గు, జలుబు పరిస్థితుల్లో సహజ చికిత్సలు, డాక్టర్ సూచనలతో ముందుకు వెళ్లాలి.
డెక్స్‌ట్రోమెథోర్ఫాన్ ఆధారిత ఫార్ములా: ఇది చిన్నారులకు సురక్షితంగా ఉండదని కేంద్రం స్పష్టం చేసింది.
కిడ్నీ ఫెయిల్యూర్‌కు కారణమైన మందులు: ‘కోల్డ్రిఫ్’ వంటి కొన్ని సిరప్‌లపై అనుమానాలు వ్యక్తమయ్యాయి, అయితే కేంద్రం నిర్వహించిన పరీక్షల్లో విష రసాయనాలు కనుగొనబడలేదు.
గతంలోనే ఎగుమతులపై చర్యలు
దగ్గు మందు ఎగుమతులకు ప్రభుత్వ ల్యాబ్ అనుమతి తప్పనిసరి: 2023 జూన్ 1 నుంచి అమల్లోకి వచ్చిన నిబంధనల ప్రకారం, ఎగుమతికి ముందు ల్యాబ్ పరీక్షలు తప్పనిసరి చేశారు.
డబ్యూహెచ్‌వో హెచ్చరికల నేపథ్యంలో చర్యలు: గాంబియా, ఇండోనేషియా, ఉజ్బెకిస్థాన్ వంటి దేశాల్లో భారతీయ దగ్గు మందుల వల్ల చిన్నారుల మరణాలు సంభవించడంతో ఈ చర్యలు తీసుకున్నారు.
ప్రజలకు సూచనలు
చిన్నారులకు దగ్గు వచ్చినప్పుడు తక్షణమే డాక్టర్‌ను సంప్రదించాలి.
OTC (ఓవర్ ది కౌంటర్) దగ్గు మందులు దయచేసి వాడకూడదు.
సహజ చికిత్సలు (తేనె, తులసి, గోరువెచ్చని నీరు) డాక్టర్ సూచనతో మాత్రమే వాడాలి.
ఈ మార్గదర్శకాలు పిల్లల ఆరోగ్యాన్ని కాపాడేందుకు తీసుకున్న కీలక చర్యలు. మీ ఇంట్లో చిన్నారులు ఉంటే, దగ్గు మందుల వాడకంపై అత్యంత జాగ్రత్తగా వ్యవహరించండి.
ఇదీ చదవండి:
అమెరికా-పాక్‌లు! నాకు నువ్వు.. నీకు నేను!