
ప్రస్తుతం అమెరికా-పాకిస్తాన్‌ల మైత్రి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడు అయిన తర్వాత వీరి స్నేహ బంధం బలపడుతూ వచ్చింది. ప్రపంచ దేశాలపై విపరీతమైన సుంకాలు విధిస్తూ అమితానందాన్ని పొందుతున్న ట్రంప్.. పాకిస్తాన్ విషయంలో ఆచితూచి అడుగలు వేస్తున్నారు. భారత్‌తో ఉన్న బంధాన్ని కాలరాసుకున్న ట్రంప్.. ఇక చేసేది లేక పాక్‌తో మాత్రం జబ్బలు రాసుకుంటూ తిరుగుతున్నారు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్‌ను అమెరికా పర్యటనలకు పలుమార్లు పిలవడమే ఇందుకు ఉదాహరణ.
గత నెలలో ఐక్యరాజ్యసమితి సమావేశాల్లో భాగంగా అమెరికా పర్యటనకు వెళ్లిన పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సైతం.. డొనాల్డ్ ట్రంప్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వీరు భేటీలో ఏం జరిగిందనేది బయటకు చెప్పకపోయినా.. భారత్ గురించి కచ్చితంగా వీరి మధ్య ప్రస్తావన వచ్చే ఉంటుందనే విషయాన్ని ఊహించుకోవచ్చు. అయితే కొన్ని రోజుల క్రితం పాకిస్తాన్‌ను పొగడ్తలతో ముంచెత్తారు ట్రంప్. గాజాలో శాంతి నెలకొల్పేందుకు ఆ దేశ నాయకులు చేస్తున్న కృషి అమోఘం అంటూ కొనియాడారు.
అయితే దీనిపై పాకిస్తాన్ తాజాగా స్పందించింది. ఇందులో తాము చేసేంది కాస్తే అయినా ట్రంప్ గాజాలో శాంతి కోసం చేస్తున్న కృషి వెలకట్టలేదని అంటూ పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ ప్రశంసించారు. గాజాలో శాంతి కోసం తమకు 20 పాయింట్లతో కూడిన ముసాయిదాను తమకు ట్రంప్ పంపారని, ఇందులో కొన్ని సరిచేసి పంపామన్నారు దార్.
‘ట్రంప్ బహిరంగంగా ప్రకటించిన ఈ 20 అంశాలు మావి కావని నేను స్పష్టం చేశాను. ఇవి మావి కావు. మాకు సంబంధమున్న ముసాయిదాలో, కొన్ని మార్పులు చేసామని మాత్రమే నేను చెబుతున్నాను. ఈ క్రెడిట్ అంతా ట్రంప్‌దే’ అంటూ కొనియాడారు దార్.
అయితే ఇరు దేశాల మైత్రి నెటిజన్లు కాస్త వ్యంగ్యంగా స్పందిస్తున్నారు. ‘నాక నువ్వు-నీకు నేను అన్నట్లుగా ఉంది మీ పరిస్థితి.అంటూ పలువురు స్పందించగా, ‘తాను మునిగి, మిగతా వారిని కూడా ముంచుతున్న ట్రంప్‌తో పాక్ మైత్రి బాగుంది బ్రదర్’ అంటూ మరొకరు కౌంటరిచ్చారు.