Railway Children India వీళ్లు పిల్లల్ని రక్షిస్తారు | Railway Children India NGO For Street Children India | Sakshi
Sakshi News home page

Railway Children India వీళ్లు పిల్లల్ని రక్షిస్తారు

Jan 3 2026 3:16 PM | Updated on Jan 3 2026 3:16 PM

Railway Children India NGO For Street Children India

తల్లిదండ్రుల మీద కోపంతోనో, చదువుకోవడం నచ్చకో, ఇతరేతర కారణాలతో చిన్నపిల్లలు ఇల్లు వదిలి పారితుంటారు. మరికొందరు ప్రయాణాల సందర్భాల్లో తల్లిదండ్రుల నుంచి తప్పిపోతుంటారు. అటువంటివారు ఎక్కడెక్కడో తిరిగి రైల్వేస్టేషన్‌కు చేరుకుంటారు. వారిలో కొందరు తిరిగి సొంతవారిని చేరుకుంటే, చాలామంది అక్కడే జీవిస్తుంటారు. సొంతవారిని చేరుకోలేక దూరమయ్యేవారు కొందరైతే, అసాంఘిక శక్తుల చేతిలో పడి బాలకార్మికులుగా, బిచ్చగాళ్లుగా మారేవారు చాలామంది ఉంటారు. మరి వారికి ఎవరు రక్షణ కల్పిస్తారు? అలాంటి వారి కోసం ఓ సంస్థ ఉందని మీకు తెలుసా? అదే ‘రైల్వే చిల్డ్రన్‌’. 


‘రైల్వే చిల్డ్రన్‌ ఇండియా’ (railway children india) అనేది 2013లో ప్రారంభించిన ఎన్జీవో. ’ఏ బిడ్డ కూడా వీధుల్లో నివసించాల్సిన అవసరం లేని ప్రపంచాన్ని సృష్టించడం’ అనే లక్ష్యంతో ఈ సంస్థను  ప్రారంభించారు. భారతదేశంలో ప్రతి ఐదు నిమిషాలకు ఒక పిల్లవాడు రైల్వే స్టేషన్‌ కు ఒంటరిగా వస్తున్నాడని నిపుణులు అంచనా వేస్తున్నారు. అటువంటివారు దోపిడీదారుల బారిన పడి అక్రమ రవాణాకు గురవుతున్నట్లు గుర్తించిన కొందరు ఈ సంస్థను  ప్రారంభించారు. ఈ సంస్థ దేశవ్యాప్తంగా 50 వేల మంది రైల్వే సిబ్బందికి శిక్షణ ఇచ్చింది.ఇప్పటివరకు సుమారు 15 లక్షల మంది పిల్లలను రక్షించింది. వారంతా ఇంట్లో సురక్షితంగా ఉన్నారు. చదువుకుంటూ తమ బంగారు భవితకు బాటలు వేసుకుంటున్నారు. 

ముందుగా వీరు రోడ్ల మీద, స్టేషన్‌ ప్లాట్‌ఫాంల మీద ఒంటరిగా ఉన్న చిన్నారుల్ని గుర్తిస్తారు. వారితో మాట్లాడతారు. వారి కుటుంబసభ్యుల వివరాలు సేకరిస్తారు. వారు వచ్చేలోగా పిల్లలకు తిండి, బట్టలు అందిస్తారు. వారు ఉండేందుకు ఏర్పాట్లు చేస్తారు. తల్లిదండ్రులు వచ్చాక వారికి కౌన్సిలింగ్‌ నిర్వహించి పిల్లల్ని అప్పగిస్తారు. ఇలా నిత్యం వందలాది మంది చిన్నారుల్ని రక్షిస్తున్నారు. స్టేషన్‌ లో తప్పిపోయిన పిల్లలెవరైనా వీరిని సంప్రదిస్తే వారు వివరాలు వెతికి పిల్లల్ని తమ తల్లిదండ్రుల వద్దకు చేరుస్తారు. దీంతోపాటు నిరుపేద చిన్నారులకు చదువు చెప్పడం, వారి హక్కుల కోసం పోరాడటం, వారి ఆరోగ్య కోసం పాటుపడటం చేస్తుంటారు. ఈ సంస్థ ప్రధాన కార్యాలయం దిల్లీలో ఉంది. అక్కడి నుంచి దేశవ్యాప్తంగా ఉన్న సభ్యుల ద్వారా వారు సేవలందిస్తున్నారు. ప్రజల నుంచి విరాళాలు సేకరించి సంస్థను నడుపుతున్నారు. వారి వల్ల ఎంతోమంది చిన్నారులు చెడ్డవారి నుంచి తప్పించుకొని అమ్మానాన్నల్ని చేరుకున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement