సీబీఎస్‌ఈ ప్రక్షాళన! | CBSE Chairman And Secretary Transferred Amid Class 12 Evaluation Row and Probe Panel Formed | Sakshi
Sakshi News home page

సీబీఎస్‌ఈ ప్రక్షాళన!

Jun 3 2026 5:02 AM | Updated on Jun 3 2026 5:02 AM

CBSE Chairman And Secretary Transferred Amid Class 12 Evaluation Row and Probe Panel Formed

రాహుల్‌సింగ్‌ , హిమాన్షు గుప్తా

చైర్మన్, సెక్రెటరీపై బదిలీ వేటు 

12వ తరగతి పరీక్షల్లో అవకతవకల 

నేపథ్యంలో కేంద్రం చర్యలు  

ఓఎస్‌ఎం సేవల కాంట్రాక్ట్‌పై విచారణకు ఏకసభ్య కమిటీ  

న్యూఢిల్లీ: సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌(సీబీఎస్‌ఈ) 12వ తరగతి పరీక్షల ప్రక్రియకు సంబంధించిన డిజిటల్‌ మూల్యాంకన వ్యవస్థలో అవకతవకల నేపథ్యంలో ఆ సంస్థ చైర్మన్‌ రాహుల్‌ సింగ్, సెక్రెటరీ హిమాన్షు గుప్తాపై ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. వారిద్దరినీ మంగళవారం జాతీయ విద్యా బోర్డు నుంచి బదిలీ చేసింది. ఆన్‌- స్క్రీన్‌ మార్కింగ్‌ (ఓఎస్‌ఎం) వ్యవస్థలో లోపాలపై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేసిన తమ జవాబు పత్రాల కాపీలు తమ చేతిరాతతో సరిపోలడం లేదని పునర్‌మూల్యాంకనం కోసం దరఖాస్తు చేసుకున్న కొంతమంది 12వ తరగతి విద్యార్థులు ఆందోళన వ్యక్తంచేశారు.

ఈ వ్యవహారం వివాదాస్పదంగా మారింది. సీబీఎస్‌ఈ పనితీరుపై విమర్శలు వ్యక్తమయ్యాయి. పరీక్షల ప్రక్రియలో సాంకేతిక లోపాలు, చెల్లింపుల వ్యవస్థ వైఫల్యాలు, ధ్రువీకరణ, పునర్‌ మూల్యాంకన ప్రక్రియలో జాప్యం వంటి అంశాలపై బోర్డు విమర్శలను ఎదుర్కొంది. పారదర్శకత, జవాబుదారీతనం కోసం డిమాండ్లు వెల్లువెత్తాయి. సీబీఎస్‌ఈ చైర్మన్‌ రాహుల్‌ సింగ్‌ పరీక్షలు, విద్యావిషయాలు, విధానాల అమలు, ప్రధాన సంస్కరణలతో సహా బోర్డు మొత్తం పనితీరును పర్యవేక్షించారు. కార్యదర్శి హిమాన్షు గుప్తా పరిపాలన, ఆర్థికం, అనుబంధ విధులకు నేతృత్వం వహించారు. దేశవ్యాప్తంగా ఉన్న సీబీఎస్‌ఈ పాఠశాలలు, పరీక్షల వ్యవస్థ రోజువారీ కార్యకలాపాలు, విధానాల అమలులో కీలకపాత్ర పోషించారు. వివాదం మొదలైనప్పటి నుంచి ప్రభుత్వ తీసుకున్న పరిపాలనా చర్యలలో ఒకటిగా సీబీఎస్‌ఈ చైర్మన్, కార్యదర్శి బదిలీని 
పరిగణిస్తున్నారు.  

ఎస్‌.రాధా చౌహాన్‌ నేతృత్వంలో కమిటీ  
సీబీఎస్‌ఈ ఆన్‌- స్క్రీన్‌ మార్కింగ్‌ సిస్టమ్‌ సేవల సేకరణకు సంబంధించిన అంశాలపై విచారణ జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు కేబినెట్‌ సెక్రటేరియట్‌ మంగళవారం ప్రకటన విడుదల చేసింది. కెపాసిటీ బిల్డింగ్‌ కమిషన్‌ చైర్‌పర్సన్‌ ఎస్‌.రాధా చౌహాన్‌ ఈ కమిటీకి నేతృత్వం వహిస్తారని వెల్లడించింది. ఈ కమిటీ నెల రోజుల్లోగా తమ నివేదికను కేంద్ర సిబ్బంది, శిక్షణ శాఖకు అందజేయనున్నట్లు పేర్కొంది. అవసరమైనప్పుడు ఇతర శాఖల సహాయం పొందేందుకు రాధా చౌహాన్‌కు అధికారం కట్టబెట్టారు. సీబీఎస్‌ఈ ఆన్‌- స్క్రీన్‌ మార్కింగ్‌ సిస్టమ్‌ సేవల కాంట్రాక్ట్‌ను కోఎంప్ట్‌ ఎడ్యూ టెక్‌కు అప్పగించిన సంగతి తెలిసిందే.  

కేంద్ర బిందువు కోఎంప్ట్‌ ఎడ్యూ టెక్‌  
సీబీఎస్‌ఈ ఆన్‌- స్క్రీన్‌ మార్కింగ్‌ సిస్టమ్‌పై నెలకొన్న వివాదానికి హైదరాబాద్‌కు చెందిన కోఎంప్ట్‌ ఎడ్యూ టెక్‌ అనే సంస్థ కేంద్ర బిందువుగా మారింది. సీబీఎస్‌ఈ పరీక్షల డిజిటల్‌ మూల్యాంకన సేవల ఈ కాంట్రాక్టును ఈ సంస్థ దక్కించుకుంది. ఈ ఒప్పందం విలువ రూ.384 కోట్లు. గతంలో తెలంగాణలోనూ కోఎంప్ట్‌ ఎడ్యూ టెక్‌పై పలు ఆరోపణలు వచ్చాయి. సీబీఎస్‌ఈ సాంకేతిక మదింపులో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌(టీసీఎస్‌)ను స్వల్ప తేడాతో అధిగమించి, తక్కువ ఆర్థిక బిడ్‌ను సమరి్పంచి డిజిటల్‌ మూల్యాంకన కాంట్రాక్టును కోఎంప్ట్‌ దక్కించుకుంది.

టెక్నికల్‌ ఎవాల్యూయేషన్‌లో 100 పాయింట్లకు గాను కోఎంప్ట్‌ 91 పాయింట్లు, టీసీఎస్‌ 89 పాయింట్లు సాధించాయి. ఫైనాన్షియల్‌ బిడ్‌ను కోఎంప్ట్‌ తక్కువగా సమరి్పంచింది. ఒకోఆన్సర్‌ బుక్‌లెట్‌ను మూల్యాంకనం చేయడానికి టీసీఎస్‌ రూ.53 నుంచి రూ.65 వరకు కోట్‌ చేసింది. కోఎంప్ట్‌ మాత్రం కేవలం రూ.24.75 నుంచి రూ.25.74 వరకు తీసుకోవడానికి ముందుకొచ్చింది. దాంతో ఆ సంస్థకే కాంట్రాక్టు దక్కింది. టెక్నాలజీ దిగ్గజమైన టీసీఎస్‌ను చిన్నపాటి సంస్థ అయిన కోఎంప్ట్‌ వెనక్కి నెట్టడం గమనార్హం.   

Advertisement
 
Advertisement
Advertisement