త్రిభాషా తకరారు | Concerns over CBSE three-language policy | Sakshi
Sakshi News home page

త్రిభాషా తకరారు

May 18 2026 2:16 AM | Updated on May 26 2026 5:42 PM

Concerns over CBSE three-language policy

సీబీఎస్‌ఈ త్రిభాషా సూత్రంపై ఆందోళన

ఇప్పటికే ప్రారంభమైన విద్యా సంవత్సరం 

హఠాత్తుగా కొత్త విధానం వద్దంటున్న విద్యావేత్తలు  

పునరాలోచన చేయాలని సీబీఎస్‌ఈకి వినతి  

న్యూఢిల్లీ: 2026–27 విద్యా సంవత్సరంలో తొమ్మిదవ తరగతి విద్యార్థులు తప్పనిసరిగా మూడు భాషలు అభ్యసించాలని సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ సెకెండరీ ఎడ్యుకేషన్‌(సీబీఎస్‌ఈ) ప్రకటించడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. సీబీఎస్‌ఈ విద్యా సంవత్సరం ఇప్పటికే ప్రారంభమైంది. తరగతులు జరుగుతున్నాయి. మొదటి యూనిట్‌ పరీక్ష కూడా నిర్వహించారు. 

ఈ నేపథ్యంలో 9వ తరగతికి త్రిభాషా సూత్రం అమలుపై విద్యావేత్తలు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలల సన్నద్ధత, పాఠ్యపుస్తకాల లభ్యతను ప్రశ్నిస్తున్నారు. సీబీఎస్‌ఈ పునరాలోచన చేయాలని కోరుతున్నారు. హఠాత్తుగా కొత్త విధానం తీసుకురావడం, విద్యార్థులపై అనవసరంగా ఒత్తిడి పెంచడం సరైంది కాదని అంటున్నారు. త్రిభాషా సూత్రం జూలై 1 నుంచి అమల్లోకి వస్తుందని సీబీఎస్‌ఈ వెల్లడించింది. మూడు భాషల్లో రెండు భారతీయ భాషలు తప్పనిసరిగా ఉండాలని పేర్కొంది. 

ఏమిటీ త్రిభాషా సూత్రం?  
జాతీయ విద్యా విధానం–2020 ప్రకారం విద్యార్థులు మూడు భాషలు అభ్యసించాలి. వీటిలో కనీసం రెండు భారతీయ భాషలు ఉండాలి. ప్రభుత్వ, ప్రైవేట్‌ విద్యాసంస్థలకు ఈ త్రిభాషా సూత్రం వర్తిస్తుంది. ఏయే భాషలు బోధించాలన్నది రాష్ట్రాలే నిర్ణయించుకోవచ్చు. ఫలానా భాష కచ్చితంగా ఉండాలన్న బలవంతం ఏమీ లేదు.  

మొదట ఎప్పుడు ప్రతిపాదించారు?  
త్రిభాషా సూత్రాన్ని తొలుత ఎడ్యుకేషన్‌ కమిషన్‌(కొఠారీ కమిషన్‌) ప్రతిపాదించింది. 1964 నుంచి రెండేళ్లపాటు ఈ కమిషన్‌ పనిచేసింది. నేషనల్‌ పాలసీ ఆన్‌ ఎడ్యుకేషన్‌–1968లో దీన్ని చేర్చారు. భాషా వైవిధ్యం, జాతీయ ఐక్యతను ప్రోత్సహించేందుకు త్రిభాషా సూత్రాన్ని ఇందిరా గాంధీ, రాజీవ్‌ గాంధీ ప్రభుత్వాలు సమర్థించాయి. 1992లో పి.వి.నరసింహారావు ప్రభుత్వం సవరణ చేసింది. దీనిప్రకారం మాతృభాష లేదా ప్రాంతీయ భాష, దేశ అధికారిక భాష, ఆధునిక భారతీయ లేదా యూరోపియన్‌ భాషను బోధించాలి.  

ఏయే విదేశీ భాషలు?  
జాతీయ విద్యా విధానం–2020 ప్రకారం.. మాధ్యమిక స్థాయి విద్యార్థులు భారతీయ భాషలు, ఇంగ్లిష్ తోపాటు కొరియన్, జపనీస్, ఫ్రెంచ్, జర్మన్, స్పానిష్‌ వంటి ఇతర విదేశీ భాషలు నేర్చుకోవచ్చు. ఆంగ్లాన్ని ఒక విదేశీ భాషగా వర్గీకరించారు. దీన్నిబట్టి విద్యార్థులు ఇంగ్లిష్‌ను, మరో విదేశీ భాషను తమ రెండు మూడో భాషలుగా ఎంచుకోవడానికి వీలుండదు.  

పుస్తకాలు సిద్ధంగా ఉన్నాయా?  
ప్రత్యేక ఆర్‌3 పాఠ్యపుస్తకాలు అందుబాటులోకి వచ్చేవరకు, 9వ తరగతి విద్యార్థులు తాము ఎంచుకున్న భాషకు సంబంధించిన 6వ తరగతి ఆర్‌3 పాఠ్యపుస్తకాలను (2026–27 ఎడిషన్‌) ఉపయోగించుకోవాలని సీబీఎస్‌ఈ తెలిపింది. తగినంత అర్హత కలిగిన స్థానిక భారతీయ భాషా ఉపాధ్యాయుల కొరతను ఎదుర్కొంటున్న పాఠశాలలు, తాత్కాలిక ఏర్పాటుగా, సంబంధిత భాషలో ప్రావీణ్యం ఉన్న ఇతర సబ్జెక్టుల ఉపాధ్యాయులను నియమించుకోవచ్చని సూచించింది.  

అసలు వివాదం ఏమిటి?  
గతంలో డీఎంకే నేతృత్వంలోని తమిళనాడు ప్రభుత్వానికి, కేంద్రానికి మధ్య రాజకీయ వివాదానికి త్రిభాషా సూత్రం కేంద్ర బిందువుగా మారింది. త్రిభాషా సూత్రాన్ని దశాబ్దాలుగా తమిళనాడు వ్యతిరేకిస్తోంది. త్రిభాషా సూత్రాన్ని అమలు చేయని ఏకైక రాష్ట్రం తమిళనాడు. తమిళంతోపాటు ఇంగ్లిష్‌ను బోధిస్తున్నారు.  

జాతీయ విద్యా విధానం–2020 చెప్పిందేమిటి?  
పాఠశాల స్థాయి నుండే బహుభాషావా దాన్ని ప్రోత్సహించడానికి త్రిభాషా సూత్రాన్ని త్వరగా అమలు చేయాలని జాతీయ విద్యా విధానం స్పష్టంచేసింది. రాజ్యాంగ నిబంధనలు, ప్రజల ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకొని, జాతీయ ఐక్యతను పెంపొందించడానికి బహుభాషావాదానికి పెద్దపీట వేయాలని సూచించింది. త్రిభాషా సూత్రాన్ని అమలు చేయడం కొనసాగిస్తామని పేర్కొంది. అయితే, ఏ ఒక్క భాషను రాష్ట్రాలపై బలవంతంగా రుద్దకూడదని వెల్లడించింది. మూడు భాషల ఎంపికను రాష్ట్రాలకు, విద్యార్థులకే వదిలేయాలని స్పష్టం చేసింది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement