పూణె: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ‘నీట్-యూజీ - 2026’ పేపర్ లీకేజీ కేసులో సీబీఐ దర్యాప్తు వేగవంతమైంది. ఈ క్రమంలో పూణెలోని సేథ్ హీరాలాల్ సరాఫ్ పాఠశాల ప్రిన్సిపల్ మనీషా సంజయ్ హవాల్దార్‌ను సీబీఐ అధికారులు అరెస్ట్ చేయడం విద్యాశాఖ వర్గాల్లో ప్రకంపనలు రేపుతోంది. ఆమె మరో 40 రోజుల్లో పదవీ విరమణ చేయనుండగా ఇంతలోనే ఈ వివాదంలో చిక్కుకోవడం చర్చనీయాంశంగా మారింది.
పాఠశాల యాజమాన్యం షాక్
సీబీఐ చర్య దరిమిలా విద్యా ప్రసరిణి సభ ట్రస్ట్.. మనీషా హవాల్దార్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. పాఠశాల 102 ఏళ్ల చరిత్రలో ఇలాంటి వివాదం జరగడం ఇదే మొదటిసారని ట్రస్ట్ కార్యదర్శి సతీష్ గవాలి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రిన్సిపల్ అక్రమ కార్యకలాపాలపై తమకు ముందస్తు సమాచారం లేదని, నిజాన్ని నిగ్గు తేల్చేందుకు ఐదుగురు సభ్యులతో అంతర్గత కమిటీని ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు.
అంకితభావం కలిగిన ఉపాధ్యాయురాలిగా గుర్తింపు
1992లో అసిస్టెంట్ టీచర్‌గా వృత్తిని ప్రారంభించిన మనీషా హవాల్దార్, తన విద్యా అర్హతలతో పాఠశాలలో క్రమశిక్షణ కలిగిన ఉపాధ్యాయురాలిగా పేరు తెచ్చుకున్నారు. 2024లో ఆమె ప్రిన్సిపల్‌గా పదోన్నతి పొందారు. సుదీర్ఘకాలం పనిచేసిన ఆమె ఇలాంటి నేరంలో చిక్కుకోవడం నమ్మశక్యంగా లేదని తోటి ఉపాధ్యాయులు అంటున్నారు. ఒక సీనియర్ విద్యావేత్త ఇటువంటి క్రిమినల్ కేసులో ఇరుక్కోవడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది.
సోదాలు.. కీలక ఫైళ్లు స్వాధీనం
శుక్రవారం ఉదయం మనీషా నివాసంలో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించి, ఆమెను సుదీర్ఘంగా ప్రశ్నించారు. అదే సమయంలో పాఠశాలలోనూ సోదాలు జరిపి, కీలకమైన కంప్యూటర్ హార్డ్ డిస్కులు, అడ్మినిస్ట్రేటివ్ డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. నీట్ పరీక్షకు ముందే గోప్యమైన సమాచారం లీక్ అయ్యిందా లేదా అనే కోణంలో సీబీఐ ఫోరెన్సిక్ విశ్లేషణను ముమ్మరం చేసింది. దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవితవ్యం ముడిపడి ఉన్న నీట్ పరీక్షలో ఇటువంటి అక్రమాలు వెలుగుచూడటం పరీక్షల భద్రతపై పలు ప్రశ్నలను లేవనెత్తుతోంది.


