అక్కడి ప్రజల్లో నూరేళ్లు దాటినా.. ఏమాత్రం చేవ తగ్గకుండా, శారీరక పటుత్వంతో ఉంటున్నారు. చాలామంది 90వ పడిలో ఉన్నా.. హృద్రోగాలు వారిని దరి చేరడం లేదు. నీరసం, నిస్సత్తువ, అనారోగ్యాల గురించి ఎప్పుడోగానీ వినరట. ఆసక్తికరంగా అనిపించే ఆ ప్రాంతాలే ‘బ్లూ జోన్స్’. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 5 ప్రాంతాల ప్రజలు.. దీర్ఘాయుష్మంతులు. కొన్ని ప్రాంతాల్లో శతాయుష్మంతులు. ఇంతకీ ఎక్కడ ఉన్నాయా ప్రాంతాలు.. వారి ఆరోగ్య రహస్యం ఏమిటి? -సాక్షి, స్పెషల్ డెస్క్
బ్లూ జోన్.. అంటే దీర్ఘాయుష్మంతులు, శతాధిక వృద్ధులు ఉండే ప్రాంతాలు. అమెరికాకు చెందిన డాన్ బ్యూటనర్ అనే రచయిత, జర్నలిస్ట్ ఈ ‘బ్లూ జోన్’ సృష్టికర్త. ఇలాంటివి 5 ప్రదేశాలను ఆయన గుర్తించాడు. అవి
1. గ్రీస్ దేశంలోని ఇకారియా. ఇదో ద్వీపం
2.ఇటలీలోని సార్డీనియా ద్వీపంలోని ఓగ్లియాస్ట్రా
3. జపాన్‌లోని ఒకినావా
4.కోస్టారికా దేశంలోని నికోయా ద్వీపకల్పం
5. కాలిఫోర్నియాలోని లోమాలిండా ప్రాంతం
లక్షలో 68 మంది!
1999లో జరిగిన అధ్యయనం ప్రకారం.. సార్డీనియాలో ప్రతి లక్ష మంది జనాభాకు 13 మంది శతాధిక వృద్ధులు ఉన్నారు. ప్రస్తుతం ఈ ప్రాంత జనాభా 15.6 లక్షలు
» జపాన్‌లోని ఒకినావాలో ప్రతి లక్ష మందికి 68 మంది.. నూరేళ్లకుపైగా వయసున్నవారు ఉన్నారు. ఈ ప్రాంత జనాభా సుమారు 15 లక్షలు. ప్రపంచంలోని అత్యంత వృద్ధ మహిళలు ఇక్కడే ఉన్నారు.
» సుమారు 9వేల జనాభా ఉండే ఇకారియా మూడోవంతు మంది 90వ పడిలో ఇంకా ఆరోగ్యంగానే ఉన్నారట.
»సుమారు 25 వేల జనాభా ఉండే లోమా లిండాలో.. 9,000 మంది ఈ బ్లూ జోన్ కిందకు వస్తారు. అమెరికన్ల సగటు ఆయుర్దాయం 78 సంవత్సరాలు కాగా, వీరిది సుమారు 88 సంవత్సరాలకుపైనే అని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.
»సుమారు 2 లక్షల జనాభా ఉండే నికోయాలో కూడా సగటు ఆయుర్దాయం 85 ఏళ్లకుపైనేనట.
ఇవే వీరి ఆరోగ్య రహస్యం
పండ్లు, కూరగాయలు
తమ ప్రాంతాల్లో ఎక్కువగా దొరికే పండ్లు, కూరగాయలు. ప్రధానంగా బఠానీలు, లెట్యూస్, ఉల్లికాడలు, బొప్పాయి, చిక్కుళ్లు
తృణధాన్యాలు
ఓట్స్, బార్లీ, బ్రౌన్‌రైస్, జొన్న పొడి
ఆరోగ్యకరమైన కొవ్వులు
ఆలివ్ నూనె, అవకాడో
గింజలు
బాదం, పిస్తా, అక్రోట్లు
మాంసాహారం
చేపలు (చాలా ప్రాంతాల్లో వారంలో మూడుసార్లు), చాలా తక్కువ రెడ్ మీట్.
పానీయాలు
ఎక్కువ నీరు, కొన్ని ప్రాంతాల్లో గ్రీన్ టీ.
శారీరక వ్యాయామం
తోట పని, నడక, బద్ధకం లేకుండా పనిచేయాలనుకునే మనస్తత్వం
ఉప్పు, చక్కెర
తక్కువ మోతాదులో..
భోజనం
ఒంటరిగా కాకుండా.. కుటుంబ సభ్యులు లేదా స్నేహితులు లేదా ఇరుగుపొరుగు వారితో కలిసి, ఆహ్లాదకరమైన వాతావరణంలో భోంచేస్తారు.


