
విశిష్ట లక్షణాల కలబోతే ఈ కొత్త వ్యక్తిత్వం
అంతర్ముఖులు, బహిర్ముఖులు కారు వీరు
స్థిరత్వం, ధైర్యం, సృజనాత్మకత వీరి సొంతం
అంతర్ముఖత్వం.. బహిర్ముఖత్వం.. ఈ రెండూ ఉండే ఉభయముఖత్వం.. మొత్తం ఈ మూడింటి గురించీ, ఈ తరహా వ్యక్తుల గురించీ అందరూ వినే ఉంటారు. సమాజంలో ఉండే వాళ్లంతా ఈ మూడు కేటగిరీల్లో ఏదో ఒక దాన్లో ఉంటారు అని అందరూ అనుకుంటారు. కానీ, కాదట. కొత్త తరహా వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులు కూడా ఉన్నారట. ఈ వ్యక్తులకు ‘ఆట్రోవర్ట్’ అనే పేరును ఖరారు చేశారు అమెరికాకు చెందిన ప్రముఖ సైకియాట్రిస్ట్ రామి కమిన్‌స్కి. ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ వంటి మేధావులు ఈ కోవకు చెందుతారట. – సాక్షి, స్పెషల్ డెస్క్
లండన్‌కు చెందిన ప్రసిద్ధ సైన్స్ మ్యాగజైన్ ‘న్యూ సైంటిస్ట్’లో ప్రముఖ సైకియాట్రిస్ట్ రామి కమిన్‌స్కి ‘ఆట్రోవర్ట్’ గురించి ప్రస్తావించారు. అంతేకాదు, దీనిపై ఏకంగా ‘ద గిఫ్ట్ ఆఫ్ నాట్ బిలాంగింగ్’ అనే పుస్తకమే రాశారు. ‘మనలో కొంతమంది అంతర్ముఖులు ఉంటే, మరికొందరు బహిర్ముఖత్వంతో ఉంటారు. ఈ రెండు వ్యక్తిత్వ లక్షణాలూ ఉన్నవాళ్లూ ఉంటారు. కానీ, ఆట్రోవర్ట్‌లు అలా కాదు, వీరు చాలా ప్రత్యేకం’ అంటారు కమిన్‌స్కి.
భావోద్వేగాల నియంత్రణ
ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఇతరుల మీద ఆధారపడరు. తమ సమస్యను నలుగురిలో పెట్టరు. అలాగని ఒక్కళ్లూ కూర్చుని మథనమూ చేయరు. వ్యక్తిగతంగా తాము నమ్మినవాళ్లతో లోతుగా చర్చించి విశ్లేషణ చేయడానికి, సమస్య పరిష్కారానికి ఎక్కువగా ఆలోచిస్తుంటారు.
ఈ మూడూ తెలిసినవే
ఇంట్రావర్టులు లేదా అంతర్ముఖులు.. నలుగురితో కలవడానికి ఇష్టపడరు. ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే చాలాసేపు ఆలోచిస్తారు. బయటి వ్యక్తుల నుంచి ప్రేరణ పొందరు. తమకు తామే ప్రేరణ. ఎక్స్‌ట్రావర్టులు లేదా బహిర్ముఖులు ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉంటారు. నలుగురితో కలివిడిగా ఉంటారు. ఎక్కువగా మాట్లాడతారు. త్వరగా నిర్ణయాలు తీసుకుంటారు. యాంబివర్ట్ లేదా ఉభయముఖత్వం ఉన్నవాళ్లు. ఈ రెండు లక్షణాలూ కలిసి ఉంటాయి. కొన్నిసార్లు ఒంటరితనాన్ని, మరికొన్నిసార్లు నలుగురితో కలవడాన్ని ఇష్టపడతారు.
భిన్నమైన ఆలోచనా విధానం
‘నలుగురికీ నచ్చినది.. నాకసలే ఇక నచ్చదులే’ అనే టైపు ఈ ఆట్రోవర్ట్‌లు. వీరు నలుగురూ ఆలోచించే పద్ధతికి భిన్నంగా, స్వతంత్రంగా ఆలోచిస్తారు.
ఏంటి తేడా?
యాంబివర్ట్‌కీ ఆట్రోవర్ట్‌కీ ఏంటి తేడా అని చాలామందికి అనిపించవచ్చు. చాలా తేడా ఉంది. సమయం, సందర్భాన్ని బట్టి యాంబివర్ట్‌లు అంతర్ముఖులుగానో, బహిర్ముఖులుగానో ప్రవర్తిస్తుంటారు. కొన్నిసార్లు నలుగురితో కలిసినప్పుడు చురుగ్గా ఉంటే.. కొన్నిసార్లు ఎవ్వరూ లేకపోయినా ఉత్సాహంగా పనిచేసుకుపోతారు. కానీ ఆట్రోవర్ట్‌లు అలాకాదు. సమయం, సందర్భం బట్టి మారిపోయే వ్యక్తిత్వం కాదు వీళ్లది.
సామాజిక సంబంధాలు
వీళ్లు పార్టీల వంటి వేడుకలకు హాజరవుతారు. కానీ, అందరి దగ్గరకూ వెళ్లిపోరు. వచ్చిన ప్రతి ఒక్కరితోనూ అంత వేగంగా కలిసిపోరు. వ్యక్తులను అంచనావేసి, కొద్దిమందితోనే మాట్లాడతారు.
» ఏదో ఒక సమూహానికి చెందిన వ్యక్తులుగా ముద్ర వేయించుకోవడానికంటే వ్యక్తిగత సంబంధాలు, పనితీరును ఇష్టపడతారు.
» వ్యక్తులతో సంభాషణల్లో పాలుపంచుకోవడానికంటే వాటిని పరిశీలించడానికి ఆసక్తి చూపుతారు.
» సమూహంలో ఉంటేనే మెదడు యాక్టివ్‌గా పనిచేయడం, శక్తిని పొందడం ఉండదు.
నాయకత్వ లక్షణాలు
స్థిరత్వం, ధైర్యానికి వీరు ప్రతీకలు. ఎలాంటి దెబ్బ తగిలినా లేదా సమస్య వచ్చి కిందపడినా తమంతట తామే తొందరగా పైకి లేవగలరు.
» వీళ్ల దృష్టిలో నాయకత్వం అంటే అజమాయిషీ కాదు. ఎదుటివాళ్లు చెప్పేది శ్రద్ధగా వింటారు. ఎదుటివారి పరిస్థితినీ అర్థం చేసుకుంటారు.
బలమైన,నమ్మకమైన బంధాలు
ప్రముఖ శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్‌స్టీన్, రచయిత్రి వర్జీనియా ఉల్ఫ్ వంటి వాళ్లు ఈ ఆట్రోవర్ట్ వ్యక్తిత్వం ఉన్నవాళ్లు. వీళ్లు స్వతంత్ర భావాలతో ఉంటారు. సృజనాత్మకత వీరి సొంతం. సంప్రదాయ ధోరణిలో పోరు. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోగలరు. నా దగ్గరకు వచ్చే వారిలో ఇంట్రావర్ట్‌లు, ఎక్స్‌ట్రావర్ట్‌లు, యాంబివర్ట్‌లు.. ఈ మూడు రకాల వ్యక్తిత్వాలూ కానివారిని నేను గమనించాను. వీళ్ల దృష్టిలో ఎక్కువమందితో సంబంధాలు ముఖ్యం కాదు.
ఉన్నవి కొన్నయినా.. అవి బలంగా, నమ్మకంగా ఉండేలా చూసుకుంటారు. సామాజిక సంబంధాల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తారు. ఎలాంటి పరిస్థితులనైనా ఇట్టే ఆకళింపు చేసుకుంటారు. తమ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడమే కాదు, ఎదుటివారి భావోద్వేగాలనూ అర్థం చేసుకోవడం వీరి ప్రత్యేకత. – రామి కమిన్‌స్కి, సైకియాట్రిస్ట్