
మిడ్ టైర్ కళాశాలల్లో సంక్షోభం
అంతర్జాతీయ విద్యార్థుల చేరికల్లో భారీ క్షీణత
అంతర్జాతీయ విద్యార్థుల నమోదులో 1.50 లక్షల మంది తగ్గుదల
ఆర్థిక నష్టాలు, పెరుగుతున్న ఖర్చులతో అక్కడి విద్యాలయాలు సతమతం
అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఏడాదికి రూ.58 వేల కోట్ల నష్టం
దీర్ఘకాలిక మనుగడకూ ముప్పేనని అంచనాలు
సాక్షి, అమరావతి: అగ్రరాజ్యంగా పేరొందిన అమెరికాలో విద్యాసంస్థలను ఆర్థిక సంక్షోభం వణికిస్తోంది. విదేశీ విద్యార్థుల చేరికల్లో క్షీణత యూఎస్‌లోని కళాశాలల మూసివేతకు దారితీస్తోంది. 2025–26 విద్యా సంవత్సరం ప్రారంభం నేపథ్యంలో యూఎస్‌లోని మిడ్ టైర్ కళాశాలల పరిస్థితి దయనీయంగా మారుతోంది. తక్కువ లాభాలతో నడుస్తున్న సంస్థల్లో విద్యార్థుల చేరికల్లో తగ్గుదల, ఆదాయం తగ్గిపోవడం, పెరుగుతున్న ఖర్చులను ఎదుర్కోలేక తీవ్ర ఆర్థిక సంక్షోభానికి దారితీస్తోంది. అక్కడి కళాశాలల దీర్ఘకాలిక మనుగడకు ముప్పుగా పరిణమించింది.
వీసా నిబంధనల్లో మార్పులు
కొత్త వీసా పరిమితుల కారణంగా యూఎస్ మిడ్ టైర్ కళాశాలల్లో విద్యార్థుల చేరికలు క్షీణించి.. అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య తగ్గడంతో తీవ్ర ఒత్తిడిలో ఉన్నాయి. ముఖ్యంగా ట్యూషన్ ఆధారిత సంస్థలకు మూసివేత ప్రమాదం పెరుగుతోంది. ఎలైట్ విశ్వవిద్యాలయాలు స్థిరంగా ఉన్నప్పటికీ చిన్న సంస్థలు మాత్రం మనుగడ కోసంసిబ్బందితోపాటు ఇతర కార్యక్రమాలనూ తగ్గించుకుంటున్నాయి.
సీఎన్‌బీసీ సూచించిన ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఫిలడెల్ఫియా పరిశోధన ప్రకారం.. అమెరికా ఉన్నత విద్యారంగంలో మూసివేతలు, విలీనాలు త్వరలో సంభవించే మాంద్యంతో వేగవంతం అవుతున్నట్టు అమెరికన్ కౌన్సిల్ ఆన్ ఎడ్యుకేషన్ అధ్యక్షుడు టెడ్ మిచెట్ ప్రకటించడం గమనార్హం.
లక్షన్నర విద్యార్థుల తగ్గుదల
అమెరికా కళాశాలల్లో స్థానికంగా చేరికలు తగ్గడంతో పాటు అంతర్జాతీయ విద్యార్థుల రాక ఆగిపోవడంతో సమస్య మరింత తీవ్రం అవుతోంది. అసోసియేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేటర్స్ అంచనా ప్రకారం 2025–26 విద్యా సంవత్సరంలో అంతర్జాతీయ విద్యార్థుల నమోదులో ఏకంగా 1.50 లక్షల వరకు తగ్గుదల ఏర్పడనుంది.
ఇది కొత్త అంతర్జాతీయ విద్యార్థుల చేరికల్లో 30–40 శాతం కాగా.. మొత్తం విద్యార్థులపై 15 శాతం తగ్గుదలను సూచిస్తోంది. ఈ ఫలితాల ప్రకారం అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఏడాదికి రూ.58 వేల కోట్ల నష్టం వాటిల్లుతుందని నివేదిక పేర్కొంది. ఈ ఒత్తిళ్ల ఫలితంగా కొన్ని సంస్థలు మనుగడ సాగించలేని ఆర్థిక వాతావరణం ఏర్పడుతోంది.
ఇది ట్రంప్ ఆంక్షల ఎఫెక్టే
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిపాలన విధాన మార్పులే యూఎస్ విద్యాసంస్థల సంక్షోభానికి కారణమని నిపుణులు భావిస్తున్నారు. వాస్తవానికి అమెరికన్ సంస్థలకు అంతర్జాతీయ విద్యార్థులు చాలాకాలంగా కీలకమైన ఆర్థిక స్తంభంగా నిలుస్తున్నారు. ఈ విద్యార్థులు పూర్తి ట్యూషన్ ఫీజులు చెల్లిండంతో పాటు జీవన వ్యయాల ద్వారా ఆదాయాన్ని సమకూరుస్తున్నారు. 2024–25లో అంతర్జాతీయ విద్యార్థుల ద్వారా అమెరికాకు ఏటా రూ.4.09 లక్షల కోట్లను అమెరికా ఆర్థిక వ్యవస్థకు అందించారు.
వాస్తవానికి పూర్తిగా ట్యూషన్ ఫీజులు చెల్లించే అంతర్జాతీయ విద్యార్థులు దేశీయ విద్యార్థులకు స్కాలర్íÙప్‌లను అందించేందుకు పరోక్షంగా దోహదపడుతున్నారు. ఇది ఒకరితో ఒకరికి ముడి ఉన్న సంబంధం. అంతర్జాతీయ విద్యార్థులు తగ్గితే ఆదాయం క్షీణించడంతో పాటు స్థానిక విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించే సంస్థల సామర్థ్యం పతనం అవడం ఖాయంగా కనిపిస్తోంది.
ట్యూషన్ ఫీజులపైనే ఆధారం
అమెరికాలోని ఉన్నత విద్యారంగం తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. అనేక విద్యాసంస్థలు ఆయా రాష్ట్రాలు విధించిన పరిమితుల కారణంగా ట్యూషన్ ఫీజులు పెంచుకోలేకపోతున్నాయి. ఇదే సందర్భంలో ఖర్చులు ఏమాత్రం తగ్గడం లేదు. కేవలం ట్యూషన్ ఫీజులపై ఆధారపడి నడిచే కళాశాలలు కోల్పోయిన ఆదాయాన్ని భర్తీ చేయడానికి నానాతంటాలు పడుతున్నాయి. దానాల ద్వారా వచ్చే నిధులు కలిగిన ఎలైట్ విద్యాసంస్థలకు తక్కువ ప్రమాదం ఉంది.
రాష్ట్రాల మద్దతుతో నడిచే ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు మధ్యస్థంగా సంక్షోభాన్ని ఎదుర్కొంటుండగా, చిన్న, మధ్యస్థాయి ట్యూషన్ ఫీజుల ఆధారిత కళాశాలలు మాత్రం కునారిల్లుతున్నాయి. హార్వర్డ్, కొలంబియా, న్యూయార్క్ వర్సిటీ వంటి అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాలు పెద్ద చార్జీల నిధులు, స్థిరమైన అంతర్జాతీయ డిమాండ్ కారణంగా బాగానే ఉన్నాయి. కానీ.. చిన్న సంస్థలు తమ కార్యకలాపాలను తగ్గించుకుంటున్నాయి. క్యాంపస్ అప్‌గ్రేడ్ వాయిదా, సిబ్బంది సంఖ్యను తగ్గించుకుంటూ నిధులను ఆదా చేసుకుంటున్నాయి.