న్యూఢిల్లీ: బీజేపీ సీనియర్ నేత, మాజీ ఉప ప్రధాని ఎల్‌కె అద్వానీ ఈరోజు (శనివారం) తన 98వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ నేపధ్యంలో ఆయన పలువురు రాజకీయ నేతలు, ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు అందుకుంటున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’లో అద్వానీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘అత్యున్నత దృష్టి, తెలివితేటలతో ఆశీర్వాదం పొందిన రాజనీతిజ్ఞుడు’ అని ఆయనను అభివర్ణించారు.
Greetings to Shri LK Advani Ji on his birthday. A statesman blessed with towering vision and intellect, Advani Ji’s life has been dedicated to strengthening India’s progress. He has always embodied the spirit of selfless duty and steadfast principles. His contributions have left…
— Narendra Modi (@narendramodi) November 8, 2025
కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. అద్వానీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన లక్షలాది పార్టీ కార్యకర్తలకు స్ఫూర్తిదాయకులని అభివర్ణించారు. ఆయన పార్టీని గ్రామాల నుండి నగరాల వరకు బలోపేతం చేశారని,హోంమంత్రిగా భారతదేశ భద్రతను బలోపేతం చేశారని అమిత్ షా కొనియాడారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మాట్లాడుతూ.. లాల్ కృష్ణ అద్వానీ తన జీవితాన్ని సమగ్రత, దేశభక్తికి అంకితం చేశారన్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.. అద్వానీని బీజేపీ కుటుంబానికి మార్గదర్శక శక్తిగా ప్రశంసించారు.
రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అద్వానీకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ.. ఆయన జీవితం సమగ్రత, దృఢ నిశ్చయం, నిస్వార్థ సేవకు నిజమైన ప్రతిబింబం అని అన్నారు. 1980లో జనతా పార్టీ రద్దు తర్వాత, అద్వానీ మరో నేత అటల్ బిహారీ వాజ్‌పేయితో కలిసి బీజేపీని స్థాపించారు. 2002 నుండి 2004 వరకు అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వంలో అద్వానీ భారత ఉప ప్రధానిగా పనిచేశారు. 1990లో రామ జన్మభూమి ఉద్యమం సందర్భంగా రథయాత్రకు అద్వానీ నాయకత్వం వహించారు.
ఇది కూడా చదవండి: 9న ‘బీఎస్ఎఫ్’ సాహస యాత్ర


