ఏపీ భవన్‌లోని టీటీడీ ఆలయంలో బీర్ బాటిళ్ల కలకలం
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధానిలో తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామికి అపచారం జరిగింది. ఢిల్లీ నడిబొడ్డున ఉన్న ఏపీ భవన్‌లో కొలువైన శ్రీవారి సన్నిధిలో మద్యం సీసాలు లభించడం కలకలం రేపింది. రాత్రివేళ మందుబాబులు బీర్లు తాగి సీసాలను శ్రీ వేంకటేశ్వర స్వామివారి పాదాలకు పది అడుగుల దూరంలోనే పడేశారు. విషయం మీడియా దృష్టికి రావడంతో ఆగమేఘాల మీద ఏపీ భవన్ సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. మూడు ఖాళీ బీర్ బాటిళ్లు, ఒక కూల్‌డ్రింక్ బాటిల్, తిని పడేసిన ఆహార పదార్థాల ప్లేట్లు అక్కడి నుంచి తొలగించారు.
దీనిపై సిబ్బందిని ఆరా తీయగా.. రాత్రి వేళలో ఇక్కడి పరిసరాల్లో నిద్రిస్తున్న క్యాంటీన్ సిబ్బంది తాగి పడేసి ఉంటారని ఏపీ భవన్ సిబ్బంది తెలిపారు. ఈ ఘటన స్వామివారి భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసింది. పవిత్రమైన ఆలయంలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఏపీ భవన్‌లో వేంకటేశ్వ స్వామి వారితోపాటు దుర్గా మల్లేశ్వరి అమ్మవారు కూడా కొలువై ఉన్నారు. ఆలయ నిర్వహణ టీటీడీతోపాటు ఏపీ భవన్ అధికారులు చూస్తారు. కానీ.. ఏపీ భవన్ అధికారులకు చిత్తశుద్ధి లోపించిందనే ఆరోపణలున్నాయి. బీరు సీసాలు పడేసిన వారిపై కఠినంగా వ్యవహరిస్తామని ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు.


