‘చిన్న’ పథకంతో రూ.400 కోట్ల భూమికి ఎసరు! | TDP conspiracy over Temple land: Andhra pradesh | Sakshi
Sakshi News home page

‘చిన్న’ పథకంతో రూ.400 కోట్ల భూమికి ఎసరు!

Sep 8 2025 4:53 AM | Updated on Sep 8 2025 6:13 AM

TDP conspiracy over Temple land: Andhra pradesh

మచిలీపట్నం గొడుగుపేట వెంకటేశ్వరస్వామికి కూటమి సర్కారు పంగనామాలు

విజయవాడ గొల్లపూడిలో స్వామి వారికి చెందిన 39.99 ఎకరాల్లో టీడీపీ ముఖ్య నేత పాగా

పలువురు రైతుల కౌలు గడువు ముగియక ముందే భూమిని స్వాదీనం చేసుకున్న టీడీపీ నేత 

దుర్గగుడి పరిధిలోకి ఆ ఆలయాన్ని తీసుకొచ్చి 2017లోనే భూములు కొట్టేసేందుకు యత్నం  

అప్పట్లో దుర్గగుడి నిధులు ఇవ్వక పోవడంతో శిథిలావస్థకు చేరిన పేట స్వామి ఆలయం 

2019లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రాకతో మళ్లీ దేవదాయ శాఖ పరిధిలోకి భూములు 

ఏటా కౌలు సొమ్ముతో క్రమం తప్పకుండా ధూప దీప నైవేద్యాలతో పాటు ఘనంగా ఉత్సవాలు  

ఇప్పుడు కూటమి ప్రభుత్వం అండగా ఆ భూములను కాజేసేందుకు లీజు పేరుతో పన్నాగం 

ఇక్కడ బహిరంగ మార్కెట్‌లో ఎకరం విలువ రూ.10 కోట్లు

సాక్షి ప్రతినిధి, విజయవాడ: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దొరికిందల్లా దోచుకోవడం, నీకింత–నాకింత అని పంచుకు తినడాన్ని అలవరుచుకున్న టీడీపీ నేతలు దేవుడి ఆస్తులను కూడా కాజేసేందుకు సిద్ధమయ్యారు. ‘చిన్న’ పథకంతో ఏకంగా రూ.400 కోట్ల విలువైన భూమిని గుప్పిట్లో పెట్టుకోవడానికి స్కెచ్‌ వేశారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని గొడుగుపేట వేంకటేశ్వరస్వామి ఆలయానికి సంబంధించి ఎన్టీఆర్‌ జిల్లా విజయవాడలోని గొల్లపూడిలో సర్వే నంబర్లు 454/2బీ, 3బీలో 39.99 ఎకరాల భూమి ఉంది. ఆలయ నిర్వహణ, కల్యాణం, వైకుంఠ ఏకాదశి, బ్రహ్మోత్సవాలు, ఇతరత్రా ఉత్సవాల కోసం భక్తులు ఎన్నో ఏళ్ల క్రితం దానంగా ఇచ్చారు.

ఈ భూమిపై వచ్చే ఆదాయంతో దేవదాయ శాఖ ఆలయ నిర్వహణతోపాటు ఏటా ఉత్సవాలను నిర్వహిస్తోంది. ప్రస్తుతం ఈ భూమి విలువ ఎకరం రూ.10 కోట్లకు పైగానే ఉంది. దీంతో రూ.400 కోట్ల విలువైన ఈ భూమిని కాజేసేందుకు ప్రభుత్వ పెద్దల దన్నుతో పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ముఖ్య నేత వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా వరల్డ్‌ క్లాస్‌ గోల్ఫ్‌ ప్రాక్టీస్‌ రేంజ్‌ అండ్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ పేరుతో ఐదు ఎకరాలు.. విజయవాడ ఉత్సవాలు, ట్రేడ్‌ ఎక్స్‌పో, సాంస్కృతిక కార్యక్రమాలు, ఎస్‌హెచ్‌జీ మేళా, అగ్రిటెక్‌ షోకేస్, టూరిజం ప్రమోషన్‌ తదితర ఈవెంట్లతో ఎగ్జిబిషన్‌ నిర్వహణకు శాశ్వత వేదిక అంటూ మరో 34.99 ఎకరాల భూమి లీజు మాటున తీసుకునే ప్రక్రియ తుది దశకు చేరింది.  

కారు చౌకగా కొట్టేసే ఎత్తుగడ 
 మొత్తంగా 39.99 ఎకరాలను సొంతం చేసుకోవడానికి వ్యూహాత్మకంగా ఆ నేత పావులు కదుపుతున్నారు. గోల్ఫ్‌ కోర్టు, విజయవాడ ఉత్సవ్‌ కోసం ఈ భూమి కేటాయించాలని ఎనీ్టఆర్‌ జిల్లా కలెక్టర్‌కు దరఖాస్తు చేశారు. ఈ ప్రతిపాదనలు దేవదాయ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీకి చేరాయి. ఎకరాకు ఏడాదికి రూ.500 చొప్పున, 99 సంవత్సరాలకు లీజు పొందేలా ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. 

నిజానికి ఆ భూములకు దేవదాయ శాఖ అధికారులు ఈ ఏడాది మే 15వ తేదీన ఏడాదిపాటు కౌలుకు వేలం నిర్వహించారు. బొర్రా రవికి రూ.95,500తో ఏడు ఎకరాలు, అబ్బూరి శ్రీనివాసరావుకు రూ.1,00,500తో 6.50 ఎకరాలు, అనుమోలు రామారావుకు రూ.66,700తో 4.50 ఎకరాలు, ఈపూరి నాగమల్లేశ్వరరావుకు రూ.97,000తో 4.50 ఎకరాలు ఇచ్చారు. కె.ధర్మారావుకు 2023–24 నుంచి 2025–26 వరకు ఐదెకరాల భూమిని రూ.52,500కు, కె.అయ్యప్పకు 2.50 ఎకరాలను రూ.23,500తో కౌలుకు ఇచ్చారు. కౌలు గడువు పూర్తి కాకముందే ఆ భూములను గోల్ఫ్‌ కోర్టు, విజయవాడ ఉత్సవ్‌కు లీజుకు ఇచ్చేందుకు అధికారులు సిద్ధమయ్యారు. 

 అయితే కౌలు పొందిన రైతుల నుంచే సబ్‌ లీజుకు తీసుకొని, ఈ ఏడాది ఉత్సవాల నిర్వహణ చేస్తున్నట్లు కలరింగ్‌ ఇస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏదైనా భూమిని అప్పగించాలంటే వేలం పాట నిర్వహించాలన్న నిబంధనలు తుంగలో తొక్కారు.  
ఉత్తర్వులు రాక ముందే భూమి స్వాధీనం

దేవదాయ శాఖ నుంచి ఎటువంటి ఉత్తర్వులు రాక ముందే ఈ భూములను పార్లమెంటు నియోజకవర్గం టీడీపీ ముఖ్య నేత తన ఆ«దీనంలోకి తీసుకున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా భారీ ఎత్తున మట్టి తోలించి భూమిని చదును చేయించారు. విజయవాడ ఉత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు. వీటి నిర్వహణకు అయ్యే రూ.కోట్ల ఖర్చును వ్యాపార సంస్థల నుంచి వసూలు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. 

మరో వైపు ఆ భూములను గోల్ఫ్‌ కోర్టు, విజయవాడ ఉత్సవ్‌కు కట్టబెట్టేందుకు సంబంధించిన ఫైల్‌ సచివాలయంలో శరవేగంగా ముందుకు కదులుతోంది. త్వరలో ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు వెలువడుతాయని అధికార వర్గాల సమాచారం.  

ఈ భూమిని 2017లోనే కాజేసేందుకు టీడీపీ నేతలు స్కెచ్‌ వేశారు. ఈ క్రమంలో గొడుగు పేట వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని దేవదాయ శాఖ నుంచి తప్పించి, విజయవాడ దుర్గామల్లే«శ్వర స్వామి పరిధిలోకి తెచ్చారు. అయితే గొడుగు పేట వేంకటేశ్వర స్వామి ఆలయానికి ఎలాంటి నిధులు ఇవ్వకపోవడంతో ఆ ఆలయం శిథిలావస్థకు చేరుకుంది.  

గత ప్రభుత్వంలో ఆలయానికి పూర్వ వైభవం 
 వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూలిపోయే దశలో ఉన్న గొడుగుపేట ఆలయానికి పూర్వ వైభవం తెచ్చేందుకు నాటి సీఎం వైఎస్‌ జగన్‌ నడుంబిగించారు. అప్పటి మంత్రి పేర్ని నాని ప్రతిపాదన మేరకు 2020 మార్చిలో ఈ ఆలయాన్ని దుర్గామల్లేశ్వర స్వామి పరిధిలోంచి తప్పించి దేవ­దాయ శాఖ పరిధిలోకి తెచ్చి ఈవోను కూడా నియమించారు.  

 2020 అక్టోబర్‌లో పేర్ని నాని సీజీఎఫ్‌ నిధులు రూ.1.80 కోట్లు, భక్తుల నుంచి విరాళాల రూపంలో రూ.20 లక్షలు వెరసి రూ.2 కోట్లు వెచ్చించి, ఆలయ జీర్ణోద్ధరణ పనులు పూర్తి చేయించారు. చినజీయర్‌ స్వామి చేతుల మీదుగా పునఃప్రారం¿ోత్సవం జరిపించారు. 2023 జూలైలో ఈ ఆలయ భూములకు వేలం నిర్వహించారు. అప్పటి నుంచి ప్రతి ఏటా భూములకు వేలం పాట నిర్వహించి, రైతులకు లీజుకు ఇస్తున్నారు. 2024 మే వరకు  ధూప దీప నైవేద్యాలు, ఘనంగా ఉత్సవాల నిర్వహణకు అవసరమైన నిధులు విడుదల చేశారు.

గోల్ఫ్‌ కోర్టుకు వెంకన్న స్వామి స్థలమే కనిపించిందా?
ప్రపంచ స్థాయి అమరావతిలో స్థలమే దొరకలేదా?
ఆలయ భూముల్నీ పప్పు బెల్లాల్లా పంచుకుంటారా?
ఆ భూమిపై మోజు ఉంటే విక్రయించి ఆలయానికి డబ్బు జమ చేయాలి 
వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని ధ్వజం

మచిలీపట్నం టౌన్‌: ప్రపంచ స్థాయి రాజధానిగా చెబు­తున్న వేలాది ఎకరాల భూమి ఉన్న అమరావతిలో గోల్ఫ్‌ కోర్టు ఏర్పాటుకు స్థలమే కనిపించ లేదా.. అని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు పేర్ని వెంకటరామయ్య (నాని) కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మచిలీపట్నంలోని గొడుగు­పేటలో ఉన్న శ్రీ భూనీలా సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానానికి ఎన్టీఆర్‌ జిల్లా విజయవాడ రూరల్‌ మండలం గొల్లపూడిలో ఉన్న కోట్లాది రూపాయల విలువైన 40 ఎకరాల భూమిని గోల్ఫ్‌ కోర్టు సంస్థకు కేటాయించనుండటం దారుణం అన్నారు.

విజయ­వాడ ఎంపీ కేశినేని చిన్ని ఆధ్వర్యంలో ఆ స్థలాన్ని చదును చేసే పనులు చేస్తున్న నేపథ్యంలో ఆదివారం ఆలయ భక్త బృందం సభ్యులు ఆలయ ప్రాంగణంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన పేర్ని నాని మాట్లా­డుతూ.. 2017లో ఇదే చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలోనే ఈ ఆలయం జీర్ణావస్థకు చేరిందని, కూలేందుకు సిద్ధంగా ఉంటే సరుగుబాదుల సపోర్టుతో ఆల­యాన్ని భక్తులు కాపాడుతూ వచ్చారన్నారు. ఆ సమయంలోనే ఈ భూమిపై కూటమి పాలకులు కన్ను వేసి.. ఆలయాన్ని విజయవాడ దుర్గ గుడి ఆధీనంలోకి తీసుకె­ళ్లారన్నారు.

దీంతో ఈ ఆలయ ధూప, దీప నైవేద్యాలకు కూడా నిధులు లేక ఇబ్బందులు ఎదురయ్యాయన్నారు. వైఎస్‌ జగన్‌ సీఎం అయ్యాక ఈ ఆలయాన్ని దుర్గ గుడి నుంచి మళ్లీ దేవదాయ శాఖ పరిధిలోకి తీసుకువచ్చారని చెప్పారు. ఈ ఆలయ జీర్ణో­ద్ధరణకు దాదాపు రూ.1.80 కోట్లు సీజీఎఫ్‌ నిధులు కూడా మంజూరు చేశారని గుర్తు చేశారు. భక్తుల వద్ద నుంచి రూ.20 లక్షలు సేకరించి.. మొత్తం రూ.2 కోట్ల నిధులతో ఆలయ పునరుద్ధరణ గావించామని చెప్పారు. ఈ భూమిని రైతులకు బహిరంగ వేలంలో కౌలుకు ఇచ్చి, వచ్చే ఆదా­యాన్ని ధూప దీప నైవేద్యాలకు వినియోగిస్తు­న్నారని వివరించారు. 

మళ్లీ కూటమి నేతల కన్ను
కూటమి అధికారంలోకి వచ్చాక ఈ 40 ఎకరాల భూమిపై మళ్లీ కన్నేసి కౌలు దారులను, అధికారులను బెదిరించి పంట వేయకుండా అడ్డగిస్తూ గోల్ఫ్‌ కోర్టు నిర్మాణం పేరుతో ఆ భూమిని కాజేయడానికి యత్నిస్తున్నారు. వందలాది టిప్పర్లతో మట్టి తోలుతూ, దేవుడి ఆస్తి అనే భయం లేకుండా మెరక పనులు చేస్తున్నారు. దీనికి జిల్లా కలెక్టర్‌ సైతం అండగా ఉండటం పాపం కాదా..? ఇదే కలెక్టర్‌ ఈ భూమిని గోల్ఫ్‌ కోర్సుకు, ఎగ్జిబిషన్‌కు కేటాయించాలని జూలైలో దేవదాయ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీకి లేఖ రాశారు.

దేవదాయ భూమిని లీజుకు తీసుకోవాలంటే బహిరంగ వేలం ద్వారానే తీసుకోవా­లని, వేరే ఏ పద్ధతుల్లోనూ తీసుకోకూడదని హైకోర్టు తీర్పు­నిచ్చింది. దేవుడి భూమిని కూటమి పాలకులు పప్పు బెల్లాల్లా పంచుకోవాలని చూస్తుండడం ఎంతవరకు సబబు?’ అని నాని నిలదీశారు. స్వామి వారి భూమిపై మీకు మోజు ఉంటే బహిరంగ వేలం వేసి విక్రయించగా వచ్చే మొత్తాన్ని ఆలయ ఖాతాలో జమ చేయాలని డిమాండ్‌ చేశారు. ఆలయ భూమి ఆక్రమణపై మంత్రి కొల్లు రవీంద్ర దృష్టికి తీసుకువెళ్లాలని, ఆయన ఈ దోపిడీని నిలిపివేస్తే సరి అని, లేదంటే కోర్టును ఆశ్రయించాలని సమావేశానికి హాజరైన భక్తులు, పలు రాజకీయ పక్షాల నాయకులు తీర్మానించారు. ఈ సమావేశంలో విష్ణుభట్ల సూర్యనారాయణ శర్మ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement