బిహార్ శాసనసభ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ సజావుగా ముగిసింది. శుక్రవారం (నవంబర్ 14న) జరగనున్న ఓట్ల లెక్కింపు కోసం రాజకీయ పార్టీలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి బిహార్‌లో అత్యధిక శాతం పోలింగ్ నమోదైంది. రెండు విడతల్లో పోలింగ్ నిర్వహించగా.. మొదటి దశలో 65.09 శాతం, రెండో దశలో దాదాపు 69 శాతం ఓట్లు పోలయినట్టు ఎన్నికల సంఘం వెల్లడించింది. మొత్తంగా రెండు విడతల్లో కలిపి 66.91 శాతం పోలింగ్ నమోదయినట్టు ఈసీ ప్రకటించింది. 2020 ఎన్నికలతో ఇది 9.6 శాతం అధికం కావడం గమనార్హం.
పురుషుల కంటే మహిళలు ఎక్కువగా ఓట్లు వేసినట్టు ఈసీ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మహిళా ఓటర్లలో 71.6 శాతం మంది ఓటు వేయగా, పురుషుల్లో 62.8 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొదటి దశలో మొత్తం 3.75 కోట్ల మంది, రెండవ దశలో 3.70 కోట్ల మంది పోలింగ్‌లో పాల్గొన్నారు. మొత్తం మీద 7.25 కోట్ల మంది ఈ ఎన్నికల్లో ఓటు వేశారు. బిహార్‌లో పోలింగ్ శాతం పెరగడంపై అన్ని రాజకీయ పార్టీలు హర్షం వ్యక్తం చేశాయి. అదే సమయంతో పెరిగిన పోలింగ్ తమకే అనుకూలంగా ఉంటుందని ఆయా పార్టీలు చెప్పుకుంటున్నాయి.
మహిళలు మాకే ఓటేశారు
సీఎం నితీశ్ కుమార్‌ను ఆశీర్వదించడానికే మహిళలు పెద్ద సంఖ్యలో పోలింగ్‌లో పాల్గొన్నారని జేడీయూ నాయకుడు నీరజ్ కుమార్ (Neeraj Kumar) అన్నారు. ఏఎన్ఐ వార్తా సంస్థతో ఆయన మాట్లాడుతూ.. ''ఎన్నికల ఫలితాలను ఎగ్జిట్ పోల్స్ కచ్చితంగా అంచనా వేస్తాయని చెప్పలేం. కానీ బిహార్‌లో మరోసారి నితీశ్ కుమార్ నాయకత్వంలో NDA సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుందని పోలింగ్ ట్రెండ్‌ను బట్టి స్పష్టమవుతోంది. మహిళలు ఎక్కువగా ఓట్లు వేశారు. నితీశ్ కుమార్‌కు అత్యధికంగా తమ ఆశీస్సులు అందించారు. 2019 లోక్‌సభ ఎన్నికలు, 2020 అసెంబ్లీ ఎన్నికలు, 2024 సాధారణ ఎన్నికల్లోనూ ఇలాంటి పరిస్థితిని మనం చూశామ''ని అన్నారు. నితీశ్‌ను విమర్శించే అర్హత ప్రతిపక్షాలకు లేదని, ప్రచారానికి దూరంగా పని చేసుకుని పోవడమే ఆయన నైజమన్నారు. నాలుగు రాష్ట్రాల్లో కేసులు నమోదైన వ్యక్తులు కూడా ఆరోపణలు చేస్తున్నారంటూ.. తేజస్వీ యాదవ్‌ను పరోక్షంగా విమర్శించారు.
తేజస్వీ సంతోషం
అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక శాతం పోలింగ్ నమోదు కావడం పట్ల ఆర్జేడీ నేత, మహాగఠ్‌బంధన్ (Mahagathbandhan) ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వీ యాదవ్ సంతోషం వ్యక్తం చేశారు. తన మనసు ఆనందంతో నిండిపోయిందని ఆయన వ్యాఖ్యానించారు. "వృద్ధులు, మహిళలు, యువత, వ్యాపారులు, రైతులు, ప్రతి కులం, ప్రతి తరగతి ఈ గొప్ప ప్రజాస్వామ్య ఉత్సవంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ ఉత్సాహం ఇలాగే కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు.
గత మూడు ఎన్నికల నుంచి బిహార్‌లో మహిళల పోలింగ్ శాతం పెరుగుతూ వస్తోంది. 2020లో మహిళల ఓటింగ్ దాదాపు 59.6 శాతం కాగా, పురుషులు 54.45 శాతం మాత్రమే పోలింగ్‌లో పాల్గొన్నారు. 2015లో, మహిళల ఓటింగ్ దాదాపు 60.48 శాతం కాగా, పురుషులు దాదాపు 53.32 శాతం మంది మాత్రమే ఓటు వేశారు. ఈ పరిణామం సామాజిక మార్పు, రాజకీయ వ్యూహం రెండింటినీ ప్రతిబింబిస్తోందని విశ్లేషకులు అంటున్నారు. సీఎం నితీశ్ హయాంలో శాంతిభద్రతలు మెరుగవడం.. అలాగే పాలక, ప్రతిపక్షాలు మహిళల ఓట్ల కోసం ఆకర్షణీయ హామీలు గుప్పించడం కూడా.. మహిళా ఓట్ల శాతం కారణమని విశ్లేషిస్తున్నారు.
పోటాపోటీగా హామీలు
ఉదాహరణకు.. జీవికా దీదీ కార్యక్రమం, లఖ్పతి దీదీ పథకం, ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజన వంటి ప్రభుత్వ పథకాలు మహిళలను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ప్రతిపక్ష మహాగఠ్‌బంధన్ కూడా బ్లాక్ మై-బెహన్-మాన్ పథకం, మహిళా యాజమాన్యంలోని కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి ఆకర్షణీయ హామీలతో మహిళా ఓటర్లకు గాలం వేసింది. అధికార, విపక్ష కూటములు పోటాపోటీగా మహిళలకు హామీలిచ్చారు. ఎవరు వాగ్దానాలకు ఎన్నెన్ని ఓట్లు పడ్డాయనేది ఎన్నికల ఫలితాల తర్వాత వెల్లడవుతుంది.

ఎన్డీఏవైపే మొగ్గు!
మహిళా ఓటర్లు ఎన్డీఏ (NDA) కూటమివైపే మొగ్గు చూపినట్టు మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఇదే అంచనా వేశాయి. నితీశ్ కుమార్ సర్కారు అధికారాన్ని నిలబెట్టుకుంటుందని, మహాగఠ్‌బంధన్‌కు నిరాశ తప్పదని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. అయితే వీటికి భిన్నంగా ఫలితాలు వస్తాయని మహాగఠ్‌బంధన్ ఆశతో ఉంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో ఎన్డీఏ నేతలు ఉత్సాహంగా ఉన్నారు. చూడాలి ఏమవుతుందో!
ఎగ్జిట్ పోల్స్‌పై ఎవరేమన్నారంటే..
ఎగ్జిట్ పోల్ ఫలితాలపై అధికార, విపక్ష కూటమి నేతలు భిన్నంగా స్పందించారు. బిహార్ అంతటా ఓటర్లు 'ఫిర్ ఏక్ బార్ ఎన్డీఏ సర్కార్' అని నిర్ణయించుకున్నారని రాష్ట్ర బీజేపీ చీఫ్ దిలీప్ జైస్వాల్ అన్నారు. ఎగ్జిట్ పోల్స్ కంటే 'ఎగ్జాట్ పోల్స్'లో ఎన్డీఏకు ఇంకా ఎక్కువ స్థానాలు వస్తాయని బీజేపీ ఎమ్మెల్సీ సంజయ్ మయూఖ్ విశ్వాసం వ్యక్తం చేశారు. మూడింట రెండొంతుల ఆధిక్యంతో అధికారంలోకి వస్తామని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి గురు ప్రకాష్ పాశ్వాన్ అన్నారు. జేడీయూ నేతలు కూడా ఎన్డీఏ గెలుపు పట్ల విశ్వాసంతో ఉన్నారు.
బీజేపీ అగ్ర నాయకత్వం ఆదేశాలకు అనుగుణంగానే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడ్డాయని తేజస్వీ యాదవ్ (Tejashwi Yadav) ఆరోపించారు. ఎన్నికల ఫలితాలు తమకు అనుకూలంగా వస్తాయని అన్నారు. ''ఈ సారి ఎన్నికల్లో అత్యధిక ఓటింగ్ శాతం నమోదైంది. ప్రజలు ఈ (నితీష్ కుమార్) ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశారు. ఈసారి మార్పు రాబోతోంది, ఎటువంటి సందేహాలకు అవకాశం లేద''ని తేజస్వీ యాదవ్ అన్నారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పిన సందర్భాలు గతంలో చాలా ఉన్నాయని ఆర్జేడీ నాయకుడు మృత్యుంజయ్ తివారీ (Mrityunjay Tiwari) పేర్కొన్నారు.
చదవండి: బిహార్ ఎన్నికలు.. ఆసక్తికర విషయాలు


